అద్దంకి రాజకీయాలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గొట్టిపాటి రవి 2014లో వైసీపీ తరుపున టీడీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ని ఓడించారు. కానీ ఆ తర్వాత టీడీపీలో చేరి కరణం కుటుంబం చీరాల చేరడానికి కారణం అయ్యారు. ఇక 2019లో టీడీపీ తరుపున బరిలో దిగి వైసీపీ అభ్యర్థి పరుచూరి వెంకటేశ్వర రావుని పరాజయం పాలుజేశారు. గతం కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచిన గొట్టిపాటి రవి మళ్లీ పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం సాగింది. కానీ ఆయన వైసీపీ లో చేరతారనే ఊహాగానాలకు భిన్నంగా టీడీపీలోనే కొనసాగుతున్నారు.
దాంతో ఇప్పుడు వైసీపీ కూడా టీడీపీ దారిలో సాగుతూ అద్దంకి ఎమ్మెల్యేని తన దారికి తెచ్చుకునే పనిలో ఉన్నట్టు అందరూ అనుమానించాల్సి వస్తోంది. గతంలో కూడా గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్ క్వారీలపై దాడులు చేసి ఆయనపై టీడీపీ ఒత్తిడి పెంచింది. చివరకు ఆయన పాలకపక్షంలో చేరేంత వరకూ ఈ దాడుల పరంపర సాగింది. వాటికి తలొగ్గి, టీడీపీ కండువా కప్పుకున్న తర్వాత గొట్టిపాటి రవి గ్రానైట్ క్వారీలకు ఢోకా లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ ఆయనకు అలాంటి స్థితి వస్తోంది. ఈసారి వైసీపీ ప్రభుత్వం దాడులు మొదలుపెట్టింది. గడిచిన కొన్ని రోజులుగా గొట్టిపాటి రవి క్వారీలపై విజిలెన్స్ దృష్టి సారించింది. ఏకంగా డీఐజీ వెంకటరెడ్డి రంగంలో దిగి గత కొన్నేళ్లుగా సాగిన తవ్వకాలు, ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు వంటి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రానైట్ పరిమాణానికి తగ్గట్టుగా చెల్లింపులు లేకపోతే గట్టి చర్యలకు సైతం వెనుకాడేది లేదనే సంకేతాలు ఇస్తున్నారు. తద్వారా గొట్టిపాటి రవిపై రాజకీయంగా సాగుతున్న దాడులుగా కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాల తర్వాత గొట్టిపాటి రవి దారి మార్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఆయన మళ్లీ పార్టీ ఫిరాయించే ఆలోచనలో ఉన్నట్టు , దానికి ముందస్తుగానే ఈ దాడులు దోహదపడుతున్నాయని అంంటున్నారు.