అయ్యో..బాబు! అలా అయిపోయారేంటి?

0

తెలంగాణాలో టీడీపీ దాదాపుగా క‌నుమ‌రగ‌య్యింది. ఏపీలో అధికారం కోల్పోయి ఆరు నెల‌లు కూడా కాలేదు. అంత‌లోనే పార్టీ ప‌రిస్థితి అయోమ‌యంగా మారుతోంది. ఏకంగా పార్టీ అధినేత తీరుతో తెలుగుదేశం పార్టీ దిక్కుతోచ‌ని స్థితిలో సాగుతోంది. విప‌క్ష నేత‌గా కూడా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌లేక‌పోతున్నార‌నే అబిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. దాంతో సీఎంగా జ‌నం చీద‌రించిన త‌ర్వాత కూడా ఆయ‌న‌లో మార్పు రాక‌పోవ‌డంతో పార్టీ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారే ప్ర‌మాదం ఉంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

తాజాగా మోడీ గురించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు టీడీపీ అధినేత ప‌రిస్థితిని చాటుతున్నాయి. ఏకంగా తాను త‌ప్పు చేశాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డం ద్వారా ఆయ‌న టీడీపీ శ్రేణుల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసిన‌ట్టుగా భావిస్తున్నారు. రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల పొత్తులు, ఎత్తులు స‌ర్వ‌సాధ‌రమ‌ణి కానీ ఒక పార్టీతో స్నేహం వీడ‌డం ద్వారా తాను పెద్ద నేరం చేశాన‌నే రీతిలో మాట్లాడ‌డం శ్రేయ‌స్క‌రం కాద‌ని టీడీపీ నేత‌లే చెబుతున్నారు. త‌ద్వారా మ‌రోసారి బీజేపీతో పొత్తు కోసం ఆయ‌న ప్రాకులాడుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని, ఇది రాజ‌కీయంగా టీడీపీని పాత‌ళంలోకి నెట్టేసే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు.

అధికారం ఆశించి, ఆఖ‌రి నిమిషంలో తృటిలో దానిని కోల్పోయిన త‌ర్వాత కూడా వైఎస్ జ‌గ‌న్ వెనుదిర‌గ‌కుండా పోరాడిన నేప‌థ్యం ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ఓవైపు ఆర్థికంగా ద‌ర్యాప్తు సంస్థ‌ల మూలంగా ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ , మ‌రోవైపు పార్టీ నుంచి నేత‌లు వ‌ల‌స‌లు పోతున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం నిల‌దొక్కుకుని పోరాడిన తీరే ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంద‌ని చెబుతున్నారు. కానీ చంద్ర‌బాబు దానికి భిన్నంగా ప‌ద‌వి పోగానే ప్ర‌త్య‌ర్థుల ముందు సాగిల‌ప‌డ‌డానికి కూడా సిద్ధ‌మ‌నే సంకేతాలు ఇవ్వ‌డం స‌మంజ‌సం కాద‌ని టీడీపీ నేత‌లే భావిస్తున్నారు. ఓవైపు టీడీపీ నేత‌లు అన్నింటినీ ఎదురించి జ‌గ‌న్ కి వ్య‌తిరేకంగా పోరాడుంతే, చంద్ర‌బాబు మాత్రం బీజేపీతో బంధం తెంచుకోవ‌డం త‌ప్ప‌య్యింద‌ని చెప్ప‌డం స‌రికాద‌ని కొంద‌రు నేత‌లు అంత‌ర్గ‌తంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో వాపోయారు. గ‌తంలో కేంద్రంలో కాంగ్రెస్ నుంచి ఎన్ని ఆటంకాలు వ‌చ్చిన ఎదురొడ్డి నిల‌బ‌డి బ‌ల‌ప‌డిన అనుభ‌వం ఉన్న టీడీపీ ఆఖ‌రికి ఇలా నీరుగారిపోవ‌డం నిరుత్సాహ‌క‌రంగా ఉంద‌ని అంటున్నారు. అందులోనూ అధినేతే దాదాపుగా స‌రెండ‌ర్ అయిపోతున్న‌ట్టుగా సంకేతాలు ఇవ్వ‌డం శ్రేయ‌స్క‌రం కాద‌ని చెబుతున్నారు.

ఈ ప‌రిణామాల‌తో ఏపీలో టీడీపీ ఇక పూర్తిగా కాషాయ‌మ‌యం కావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం తీసుకోద‌ని కూడా కొంద‌రు లెక్క‌లేస్తున్నారు. ఇప్ప‌టికే త‌న స‌న్నిహితుల‌ను బీజేపీలో చేర్చిన బాబు త్వ‌ర‌లో త‌న పార్టీని పూర్తిగా బీజేపీకి ద‌గ్గ‌ర చేసే దిశ‌లో ఈ ప‌రిణామాలున్నాయ‌ని భావిస్తున్నారు. చంద్ర‌బాబు ప‌రిస్థితి చూస్తుంటే ఏం జ‌రిగినా ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌నే అబిప్రాయం వినిపిస్తోంది. మ‌ళ్లీ టీడీపీ పొత్తుకు సిద్ధ‌మ‌యినా లేక ఇత‌ర మార్గాల‌లో క‌లిసినా టీడీపీని క‌మ‌లం క‌బ్జా చేయ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here