ఆ మంత్రుల ప‌ట్ల జ‌గ‌న్ అసంతృప్తి?

0

ఏపీ క్యాబినెట్ లో కొంద‌రి తీరు ప‌ట్ల ముఖ్య‌మంత్రి అసంతృప్తిగా ఉన్నారు. తీవ్ర పోటీ ఉన్న‌ప్ప‌టికీ ఏరికోరి ఎంచుకున్న నేత‌లు దానికి త‌గ్గ‌ట్టుగా ప‌నిచేక‌పోవ‌డంతో ఆయ‌న నిరాశ చెందుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే అనేక మార్లు ఆయా మంత్రుల‌కు సీఎం వార్నింగులు కూడా ఇచ్చారు. కొంద‌రు సంబంధిత శాఖ‌ల వ్య‌వ‌హార‌ల్లో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌లేక‌పోతుంటే, మ‌రికొంద‌రు ప్ర‌భుత్వ వాణి వినిపించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేద‌నే అభిప్రాయం సీఎంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతేగాకుండా ఆయా జిల్లాల్లో ఇత‌ర నేత‌ల‌ను క‌లుపుకుని పోవాల్సిన స‌మ‌యంలో కొంద‌రి తీరు దానికి భిన్నంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రుల ప‌నితీరుని స‌మీక్షిస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ ఏడాది నాటికే అలాంటి ప్ర‌య‌త్నం చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని వైసీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

అవినీతిని అదుపు చేసే ప‌నిలో సీఎం ఉంటే కొంద‌రు మంత్రులు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో గ‌తంలోనే వారికి క్లాస్ తీసుకున్నారు. పున‌రావృతం కాకుండా చూడాల‌ని హెచ్చ‌రించారు. ఆ త‌ర్వాత సెక్ర‌టేరియేట్ లో అందుబాటులో ఉండ‌ని మంత్రుల‌కు క్యాబినెట్ సాక్షిగానే చెప్పేశారు. ప‌నితీరు మార్చుకోవాల్సిందేన‌ని ఆయ‌న సూటిగా చెప్ప‌డంతో కొంద‌రు మంత్రులు ఖంగుతినాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌భుత్వం మీద విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నా త‌గిన రీతిలో స్పందించ‌డం లేదంటూ కొంద‌రి తీరు ప‌ట్ల ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హంగా ఉన్నార‌ని చెబుతున్నారు.

మ‌తం కోణంలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా, వాటికి ధీటుగా కౌంట‌ర్ ఇవ్వాల్సిన దేవాదాయ శాఖ మంత్రి అందుకు త‌గ్గ‌ట్టుగా స్పందించ‌లేక‌పోతున్నార‌ని సీఎంవో భావిస్తోంది. అదే స‌మంయ‌లో బీసీ సంక్షేమం కోసం చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంద‌ని అంచ‌నా వేస్తోంది. వాటితో పాటుగా మ‌రికొన్ని శాఖ‌ల మంత్రుల ప‌నితీరు కూడా ముఖ్య‌మంత్రి మెచ్చుకునే స్థాయికి చేరాల్సి ఉంటుంద‌ని సీఎంవో నుంచి కొంద‌రికి నేరుగా స‌మాచారం అందిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. ఈ ప‌రిణామాల‌తో ఏపీక్యాబినెట్ మంత్రులు దానికి త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే క‌ఠిన నిర్ణ‌యాల‌కు సైతం ముఖ్య‌మంత్రి వెన‌కాడ‌ర‌ని కొంద‌రుభావిస్తున్నారు. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here