ఆ వ‌ర్గం చేతుల్లో ప‌వ‌న్? కాపుల్లో అసంతృప్తి!

0

తొలిసారిగా ఎన్నిక‌ల బరిలో దిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అంతో ఇంతో ఆద‌ర‌ణ ద‌క్కింది గోదావ‌రి జిల్లాల్లో మాత్ర‌మే. గెలిచిన ఏకైక సీటు కూడా తూగోజిల్లా రాజోలు. ఈ ఫ‌లితాల‌కు కార‌ణం ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గ‌మే అన్న‌ది అంగీక‌రించాల్సిన విష‌యం. రాజ‌కీయాల్లో కుల ప్ర‌స్తానం గురించి పైకి ఎవ‌రు ఎన్ని చెప్పినా చివ‌ర‌కు అదో ప్ర‌భావితం అంశం అన్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఇక స్వ‌యంగా పార్టీ అధ్య‌క్షుడు పోటీ చేసిన రెండు స్థానాలు కూడా కాపులు పెద్ద సంఖ్య‌లో ఉన్న‌వే కావ‌డం విశేషం. అయితే భీమ‌వ‌రంలో ఆయ‌న‌పై గెలిచింది సొంత సామాజిక‌వ‌ర్గానికే చెందిన నేత కావ‌డం, గాజువాక‌లో కాపులంతా ఐక్యంగా లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ప‌రాజ‌యం త‌ప్ప‌లేద‌న్న‌ది ప‌లువురి అంచ‌నా.

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌న‌సేన శ్రేణులు ఢీలా ప‌డ్డాయి. చివ‌ర‌కు అధ్య‌క్షుడు పోటీ చేసి ఓట‌మి పాలుకావ‌డంతో ప‌లువురు నిరాశ‌కు గుర‌య్యారు. దానిని అధిగ‌మించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొంత ప్ర‌య‌త్నం చేస్తున్నారు గానీ ఫ‌లితానిస్తున్న దాఖ‌లాలు లేవు. పైగా ఎన్నిక‌ల స‌మీక్ష‌ల పేరుతో జ‌రిగిన స‌మావేశాల్లో చంద్ర‌బాబుతో కుమ్మ‌క్క‌య్యార‌నే ప్ర‌చారం న‌ష్టం చేకూర్చిందంటూ ప‌లువురు ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్లిన స‌మ‌యంలో కొన్ని త‌ప్ప‌వు అన్న‌ట్టుగా ఆయ‌న దానిని ఖండించ‌క‌పోవ‌డంతో జ‌న‌సేన నేత‌ల్లోనూ అసంతృప్తి మ‌రింత రాజుకుంటోంది.

అంతేగాకుండా జ‌న‌సేన అధినేత పూర్తిగా చంద్ర‌బాబు చేతిలో పావుగా మారార‌ని ప‌లువురు జ‌న‌సేన నేత‌లు సైతం సందేహిస్తున్నారు. అదే స‌మ‌యంలో పార్టీలో పెత్త‌నం నాదెండ్ల మ‌నోహ‌ర్ కి అప్ప‌గించ‌డాన్ని కూడా కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దాంతో కాపుల పార్టీలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం పెత్త‌నం చేస్తుంద‌నే అభిప్రాయానికి కొంద‌రు వ‌స్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు జ‌న‌సేన‌ను వీడుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక‌వ‌ర్గానికే చెందిన నేత‌లు దూరం అవుతుండ‌డంతో జ‌న‌సేన మూలాలు మ‌రింత బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జనసేన కు రాజీనామా చేసిన కాపు ప్రముఖుల్లో సీనియర్ జర్నలిస్ట్ ఆర్టీఐ మాజీ కమిషనర్, రాధా-రంగా మిత్ర మండలి నేత విజయ్ బాబు , అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తూ టీవీల‌లో పార‌ట్ఈ వాణి వినిపించిన అద్దేపల్లి శ్రీధర్, ఐఆర్ఎస్ మాజీ అధికారి చింతల పార్ధ సారధి తదితరులు ఉన్నారు. వారికి తోడుగా మాజీ ఎమ్మెల్యేలు ఆకుల స‌త్య‌న్నారాయ‌ణ‌, చింత‌ల‌పూడి వెంక‌ట్రామ‌య్య వంటి వారు రాజీనామాలు చేశారు. ఇక జ‌నసేన త‌రుపున మొన్న‌టి ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగిన‌ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు , మాజీ సిబిఐ JD లక్ష్మి నారాయణ లు కూడా దాదాపుగా జనసేన కు దూరం అయిన‌ట్టే చెప్ప‌వ‌చ్చు.

కీల‌క‌మ‌యిన కాపు నేత‌లు పార్టీ కి దూరం అవుతుండ‌డం వెనుక జ‌న‌సేనాని తీరు మీద అపోహ‌లు కూడా కార‌ణ‌మ‌ని, లింగ‌మ‌నేని ర‌మేష్ వంటి వారు అడుగుజాడ‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌య‌నం సాగించ‌డాన్ని వీరంతా అంగీక‌రించలేక‌పోతున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here