ఇంత‌క‌న్నా బాగా తెలుగు భాష‌ను ఎవ‌రు ప్రోత్స‌హిస్తారు..!

0

అసెంబ్లీలో పాత‌రేస్తా అన్న‌నాడే విలువ‌ల‌కు పాత‌ర ప‌డింది. ఒరేయ్ నీ య‌మ్మ అంటూ నోరు పారేసుకున్న నాడే నిజ‌స్వ‌రూపాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వైఎస్ జ‌మానాలో నాటి ప్ర‌తిప‌క్ష నేత అమ్మ గురించి ఎంత ర‌చ్చ జ‌రిగిందో అంద‌రికీ తెలుసు. కానీ ఇప్పుడు అలా కాదుగా..ద‌శాబ్దం త‌ర్వాత కొత్త త‌రం నేత‌లు వేదిక మీద కూడా దిగువ స్థాయి మాట‌ల‌ను య‌ధేశ్ఛ‌గా వ‌ల్లిస్తున్నారు. కెమెరా ముందు కూడా త‌మ అస‌లు స్వ‌రూపం సాక్షాత్క‌రిస్తున్నారు. కుళాయి ద‌గ్గ‌ర కొట్లాట‌లో కొంద‌రు వాడే భాష‌ను కెమెరా సాక్షిగా లైవ్ ప్ర‌సారాల‌తో ఇంటింటికీ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇంత‌కు మించిన తెలుగు భాష ఉద్దార‌ణ ఎక్క‌డుంటుంద‌న్న‌ట్టుగా ఈ ధోర‌ణి సాగుతోంది. ఈ మాట‌లు వింటుంటే రాబోయే త‌రం నేత‌లు ఇంకెంత తెగిస్తారోన‌నే సందేహాలు క‌ల‌గ‌క‌మాన‌దు.

వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారు తొలినాళ్ల‌లో నీటిపారుద‌ల మంత్రి నోటిపారుద‌ల చాలామందిని విస్మ‌య‌ప‌రిచింది. అసెంబ్లీలో కూడా అనిల్ వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చాయి. ఇక‌ ఇప్పుడు పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రి వంతు వ‌చ్చిన‌ట్టుంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మీద చేసే విమ‌ర్శ‌ల‌కు, ఎదురుదాడికి అంతూ పొంతూ లేకుండా పోతుంది. పౌర స‌మాజం ఏమ‌నుకుంటుందోన‌నే ఆలోచ‌న కూడా రావ‌డం లేదు. మొన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒంటిక‌న్ను భాష‌కు నిన్న‌టి కొడాలి నాని లుచ్ఛా ప‌ద‌జాలం తోడ‌య్యింది. మంచి స్నేహితుల‌యిన వీరిద్ద‌రూ ఉప‌యోగించిన ప‌దాలు, మీడియాలో ప్ర‌సారం అయిన వ్యాఖ్య‌లు క‌ర‌డుగట్టిన టీడీపీ వ్య‌తిరేకుల‌కు సంతృప్తినివ్వ‌వ‌చ్చు. కానీ రాజ‌కీయ నేత‌ల్లో, వారి ఉచ్ఛార‌ణ‌లో ప‌డిపోతున్న విలువ‌లు చాలామందిని క‌ల‌వ‌ర‌ప‌రుస్తాయ‌న్న దానిలో సందేహం లేదు,,

ఈ దుస్థితి ఈరోజు మొద‌ల‌య్యింది మాత్రం కాదు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు గ‌తంలోనూ ఉన్నాయి. ఒక‌రిద్ద‌రు నోటికి ప‌ని చెబుతూ చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. కీల‌క‌నేత‌లు కూడా ఇష్టారాజ్యంగా నోరుపారేసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. అసెంబ్లీలో జ‌గ‌న్ మ‌గ‌త‌నం గురించి నాటి మంత్రి అచ్చెన్న ప్ర‌స్తావించిన‌ప్పుడు క‌ట్ట‌డి చేసి ఉంటే ఆ త‌ర్వాత బోండా ఉమా లాంటి వాళ్లు అంత బోల్డుగా వ్యాఖ్య‌లు చేయ‌డానికి సాహ‌సం చేయ‌లేరు. ఇంకా అనేక‌మంది నేత‌లు వ‌రుస‌గా అధికారం అండ చూసుకుని సాగించిన మాట‌ల దాడి ఈరోజు చంద్ర‌బాబు అండ్ కో మీద రివ‌ర్స్ స్వింగ్ అవుతున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఇప్పుడు జ‌గ‌న్ అండ్ కో కూడా ఇలాంటి వ్య‌వ‌హార‌శైలికి అడ్డుక‌ట్ట వేయ‌క‌పోతే ఆ తర్వాత సంభ‌వించే ప‌రిణామాల‌కు చింతించి కూడా ఉప‌యోగం ఉండ‌దు.

వాస్త‌వానికి ఇప్పుడు ఎవ‌రూ అత్యంత ఉన్న‌త విలువ‌లు ఆశించ‌డం లేదు. కానీ ఉన్న స్థాయిని మ‌రింత దిగ‌జార్చ‌డాన్ని మాత్రం అంగీక‌రించ‌లేదు. అందుకే తాత్కాలికంగా కొంద‌రు ఆనందించిన‌ప్ప‌టికీ, ఆ త‌ర్వాత ప్ర‌తిఫ‌లం చెల్లించాల్సి వ‌స్తుంద‌న్న‌ది స్ప‌ష్టం. చంద్ర‌బాబు పాల‌నా కాలంలో చెల‌రేగిపోయిన సెక్ష‌న్ కి ఇప్పుడు త‌గిన శాస్తి జ‌రుగుతుంద‌నే విష‌యం తాజాగా చింత‌మ‌నేని మాట‌ల్లో స్ప‌ష్టం అయ్యింది. అయినా గుణపాఠాలు నేర్చుకోక‌పోతే అన్ని విష‌యాల‌ను గ్ర‌హించే ప్ర‌జ‌లు ఆ త‌ర్వాత త‌గిన పాఠం నేర్పుతార‌న్న‌ది మాత్రం చ‌రిత్ర అందించే సందేశం. జ‌ర నోరు భ‌ద్రం నేత‌ల్లారా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here