‘ఎల్లో’ మీడియా రంగు మారుతోంది..!

0

మీడియా రంగు మారుతోంది. క్ర‌మంగా ఎల్లో కాస్తా సాఫ్రాన్ అవుతోంది. కాషాయ రూపం ధ‌రించేందుకు అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇప్ప‌టికే అనేక క‌థ‌నాల ద్వారా క‌మ‌ల‌ద‌ళానికి అండ‌గా నిలిచేందుకు ఏపీలో ఓ సామాజిక‌వ‌ర్గం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వేళ అదే వ‌ర్గానికి చెందిన మీడియా కూడా ఆ దారిన సాగుతోంది.

తాజాగా ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక అమిత్ షా పై క‌వ‌ర్ స్టోరీ ప్ర‌చురించిన తీరు దానికి అద్దంప‌డుతోంది. ఆరు నెల‌ల‌ క్రిత‌మే అదే అమిత్ షా కి వ్య‌తిరేకంగా, మోడీ-షా తీరు మీద ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాసిన రాత‌లు గ‌మ‌నిస్తే ఇది అనూహ్య మార్పుగానే ఉంటుంది. కానీ ఏపీలో అధికార మార్పిడి దానికి బీజం వేసింద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యంగానే క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఏబీఎన్ , టీవీ చానెళ్ల ప్ర‌సారాల‌ను ఏపీలో అడ్డుకున్న త‌ర్వాత అమిత్ షా జ‌రిపిన మంత్రాంగం ఫ‌లించి ఆ చానెళ్లు జ‌నంలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దానికి ప్ర‌తిఫ‌లంగానే బీజేపీ బాజా మోగించేందుకు ఈ బృందాలు సన్న‌ద్ద‌మ‌వుతున్న‌ట్టు రుజువ‌వుతోంది.

అదే స‌మ‌యంలో ఏపీలో వైఎస్ జ‌గ‌న్ ని, తెలంగాణాలో కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే త‌మ‌కు బీజేపీ త‌ప్ప మ‌రో దారి లేద‌నే నిర్ణ‌యానికి ఈ మీడియా అధినేత‌లు వ‌చ్చేసిన‌ట్టుగా భావించాలి. దానికి అనుగుణంగా బీజేపీ నేత‌లు చేసే ప్ర‌క‌ట‌న‌లు, చిన్న చిన్న కార్య‌క్ర‌మాల‌కు గ‌తంలో జిల్లా ఎడిష‌న్ లోప‌లి పేజీల్లో చోటు క‌ల్పించిన ప‌త్రిక‌లే ఇప్పుడు మెయిన్ ఎడిష‌న్ లో ప్ర‌ధాన వార్త‌లుగా మలుస్తున్నాయి. త‌ద్వారా బీజేపీని ప్ర‌త్యామ్నాయ పార్టీగా ప్ర‌జ‌ల్లో ప్రొజెక్ట్ చేసేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి.

మీడియా ఎంత‌గా భ‌జ‌న చేసినా జ‌నం ఆలోచ‌న భిన్నంగా ఉంటుంద‌న్న‌ది గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు చెబుతున్నాయి. ఏపీ ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ మీద దుష్ప్ర‌చారం, చంద్ర‌బాబు కి అనుకూలంగా చేసిన హంగామా చిన్న‌దేమీ కాదు. అయినా జ‌నం బాబుని చాలా దూరం పెట్ట‌డం ద్వారా మీడియా క‌థ‌నాలు కొంత వ‌ర‌కూ ఫ‌లితాన్నిస్తాయే త‌ప్ప‌, పూర్తిగా ప్ర‌భావితం చేయ‌లేవ‌ని చాటిచెప్పారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బ‌లోపేతం కోసం చూస్తున్న బీజేపీకి ఒక వ‌ర్గం మీడియా వంత‌పాడుతున్న వేళ జ‌నాల్లో క‌మ‌ల వికాసానికి అది ఎంత‌వ‌ర‌కూ తోడ్ప‌డుతుంద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం భ‌విష్య‌త్తులోనే వెద‌కాల్సి ఉంటుంది. కానీ ప్ర‌స్తుతానికి ఒక‌వ‌ర్గం మీడియాకు బీజేపీ అండ మాత్రం పెద్ద ఉప‌శ‌మ‌నంగానే క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here