ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదాలమయంగా మారుతోంది. ఇప్పటికే అమరావతి చుట్టూ అనేక అనుమానాలు, సవాలక్ష సందేహాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యేకి జరిగిన అవమానం కలకలం రేపుతోంది. కుల దురహంకారంతో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను వివాదంగా మారేలా కనిపిస్తోంది.
తుళ్లూరు మండలం అనంతవరంలో కొందరు టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణంగా మారింది. వినాయక చవితి సందర్భంగా జరిగిన ఈ వివాదం కులరంగు పులుముకోవడంతో తగాదా తీవ్రమవుతోంది. కులం పేరు చెప్పి అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని అవమానించడం దానికి మూలం. ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే దేవుడు మైలపడతాడంటూ వ్యాఖ్యానించడంతో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అనంతవరం టీడీపీ నేతల తీరు మీద ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం తనకు జరిగిన అవమానంపై శ్రీదేవి మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే పట్లే ఇలా ఉంటే.. సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తనను కులం పేరుతో దూషించిన ఘటనపై చర్యలు తీసుకునే వరకూ సహించేది లేదన్నారు.