కమలంలో మూడు ముక్కలాట

0

ఆంధ్రప్రదేశ్ లో అర్జెంటుగా ఎదిగిపోవాలని అధిష్టానం ఆలోచిస్తోంది. అందుకు అనుగుణంగానే అగుపించిన వారందరినీ అక్కున చేర్చుకునే పనిచేస్తోంది. పనికొస్తారా లేదా అన్న పట్టింపులు లేకుండా తమ దరికి వచ్చిన లేదా దారికి తెచ్చుకున్న వారందరికీ కండువాలు కప్పుతోంది. కానీ తీరా చూస్తే అంత మోదీ గాలిలో కూడా ఒక్క శాతం ఓట్లు కూడా లేని పార్టీ ఇక్కడ పాట్లు పడుతోంది. పార్టీ నేతల మధ్య మూడుముక్కలాటగా మారినట్టు తాజాగా రూఢీ అవుతోంది.

ఏపీలో బీజేపీకి ఎన్నడూ తగిన బలం లేదు. కేవలం వాజ్ పాయ్ కాలంలో మాత్రం గోదావరి జిల్లాల్లో ఎంపీ సీట్లను గెలుచుకుని చరిత్ర స్రుష్టించింది. ఆ తర్వాత టీడీపీతో పొత్తు ద్వారా అసెంబ్లీలో చోటు దక్కించుకోవడమే తప్ప అంతకుమించిన బలం ఆపార్టీకి లేదు. కానీ ఇప్పుడు దేశమంతా కాషాయమయం అవుతుందని భావిస్తున్న బీజేపీ పెద్దలు ఏపీని కూడా మినహాయించకూడదని పట్టుదలగా ఉన్నారు. అందుకు అనుగుణంగానే గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ బలహీనతలను సొమ్ము చేసుకుని తాము బలపడాలనే లక్ష్యంతో సాగుతున్నారు.

తీరా చూస్తే తెలుగునేల మీద కమలం పునాదులు బలహీనంగా ఉండడమే కాకుండా బీజేపీలో వెంకయ్య నాయుడు వంటి వారి వ్యవహారాలతో పార్టీ బలోపేతం కావాలనే కల అలానే మిగిలిపోయింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చి కమలంలో చేరిన కన్నా, పురేందేశ్వరి, కావూరితో పని కావడం లేదని భావించి టీడీపీ నుంచి తెచ్చుకున్న సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వ్యవహారం గమనిస్తుంటే బీజేపీ బలం పెరగడం తర్వాత గానీ మరింత కుదేలయ్యే పరిస్థితి రాకూడదని కార్యకర్తలు ఆలోచించే స్థితి వస్తోంది. ముఖ్యంగా బీజేపీలో ఇప్పటికే వెంకయ్య అనుకూల, వ్యతిరేక వర్గాలుండగా ఇప్పుడు టీడీపీ పట్ల సానుకూలంగా ఉండే నేతలు, వైసీపీ పట్ల కొంత అనుకూలతను చాటే నాయకులు పోగా మిగిలిన వారు ఆర్ఎస్ఎస్ పట్టుతో అధిష్టానం ఆలోచనలతో సాగే నేతలు అన్నట్టుగా మూడుముక్కలాటగా మారిపోతోంది.

హైదరాబాద్ కేంద్రంగా చింతన్ భైఠక్ అంటూ కన్నా క్యాంపు సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఐవైఆర్, సుధీష్ రాంభోట్ల, దినేష్ రెడ్డి సహా మరికొందరు నేతలు ప్రత్యేకంగా భేటీ కావడం భాజపా వర్గపోరుని బాహాటం చేస్తోంది. ఆపార్టీ తగాదాలతో తలపట్టుకోవాల్సిన పరిస్థితి స్పష్టం అవుతోంది. ఈ రెండు శిబిరాలకు దూరంగా మరికొందరు నేతలున్నట్టు కూడా చెబుతున్నారు. ఏమయినా ఏపీలో బీజేపీ బాగుపడే కాలం తర్వాత మరింత గడ్డు పరిస్థితి ఖాయమనే సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here