కశ్మీర్ వాస్తవ స్థితి-మీడియా మౌనం

0

భారతీయ వ్యవహారాల్లో కశ్మీర్ సుదీర్ఘకాలంగా కీలకంగా ఉంది. కానీ తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ రెండు భాగాలుగా మారడం, రాష్ట్ర హోదా కోల్పోయిన నేపథ్యంలో అక్కడి పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా 370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీరీయుల చుట్టూ పెద్ద వలయం ఏర్పడింది.

అంతర్జాతీయంగా ఈ విషయంలో భారతదేశానికి పెద్దగా సమస్యలు కనిపించలేదు. కేవలం పాకిస్తాన్, స్వల్పంగా చైనా మినహా మిగిలిన దేశాల నుంచి ఎటువంటి ప్రతికూల సంకేతాలు లేవు. దాని వరకూ భారతదేశం దౌత్యపరంగా పై చేయి సాధించినట్టుగానే చెప్పాలి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎంతగా రంకెలు వేసినప్పటికీ వారికి పెద్దగా మద్ధతు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు గానీ ప్రస్తుతానికి పాకిస్తాన్ ఒంటరిగానే ఉందనే చెప్పవచ్చు.

అదే సమయంలో అసలు సమస్యను ఎదుర్కొంటున్న కశ్మీరీల వైఖరి కీలకం కాబోతోంది. ఇప్పటికే పక్షం రోజులుగా లోయలో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది. లద్దక్ లో ఉపశమనం ఉన్నప్పటికీ జమ్మూలో పెద్దగా సందడి కనిపించడం లేదు. అదే సమయంలో లోయలో మాత్రం నేటికీ సాధారణ జనజీవనానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అనేక చోట్ల ఆందోళనలు, నిరసనలకు తెరలేస్తోంది. గట్టి నియంత్రణ ఉన్నప్పటికీ కశ్మీర్ వాసులు మాత్రం తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయంలో భారతీయ మీడియా తీరు విస్మయకరంగా ఉంది. పూర్తిగా నియంత్రణలో ఉన్నట్టు కనిపిస్తోంది. కశ్మీరీయులకు ఈనెల 5 నుంచి ఎటువంటి కమ్యూనికేషన్స్ లేవు. కనీసం ల్యాండ్ లైన్ ఫోన్ కూడా లేదు. చివరకు ట్రాన్స్ పోర్ట్ తో పాటుగా ఇతర అన్ని సదుపాయాలు కట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ వారు ఎలా ఉన్నారో తెలుసుకునే అవకాశం గానీ, వారు అక్కడ ఎలా ఉన్నారో తెలుసుకునే అవకాశం బయటివారికి గానీ లేకుండా పోయింది. ఇదో అసాధారణ పరిస్థితి. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా 80లక్షల మందికి ఎటువంటి హక్కులు లేకుండా నిర్బంధంలో ఉన్నట్టుగా మారిపోయింది. చివరకు భారతదేశమంతటా స్వతంత్య్రదినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ కశ్మీరీలకు స్వేచ్ఛా స్వతంత్య్రాలు లేని పరిస్థితి దాపురించింది.

ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న వారికి సంబంధించిన ఎటువంటి సమాచారం చెప్పేందుకు మీడియా సిద్ధంగా లేదు. అటు ఎలక్ట్రానిక్ మీడియా, ఇటు ప్రింట్ మీడియా పూర్తిగా శీతకన్ను వేసేశారు. కనీసం కశ్మీర్ లో సమస్య ఉందని కూడా చెప్పడానికి సిద్ధపడడం లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఇష్టం ఉండదనే ఉద్దేశంతో మీడియా స్వీయనియంత్రణలోకి పోయిందా..లేక ఎవరి ఆదేశాలతోనైనా అలా జరుగుతుందా అన్నది అంతుబట్టని విషయంగా మారింది. అదే సమయంలో కశ్మీర్ వెళ్లి వస్తున్న వారి సమాచారం కూడా బయట ప్రపంచానికి తెలిపేందుకు పలు సంఘాల వారు చేసిన ప్రయత్నానికి కూడా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో అభ్యంతరాలు రావడం మరింత ఆందోళనకరంగా చెప్పవచ్చు.

దేశంలోని కీలక సంస్థలు పూర్తి మౌనంగా ఉన్న దశలోనే కశ్మీర్ లో వాస్తవ స్థితిని వెల్లడించేందుకు అంతర్జాతీయ మీడియా కొంత ప్రయత్నాలు చేస్తోంది. బీబీసీ, అల్ జజీరా వంటి వారు కొన్ని కథనాలను వెలువరించడం కూడా అనేకమందికి రుచించలేదు. ఆయా సంస్థలకు వ్యతిరేకంగా కూడా ప్రచారం సాగింది. చివరకు కేంద్ర హోం శాఖ కూడా వాస్తవాలను అంగీకరించినా ఆయా మీడియా సంస్థలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మీడియా ఎంతం నిర్లిప్తగా వ్యవహరిస్తున్న వేళ, పూర్తిగా సర్కారు వాదనకే వంతపాడుతున్న వేళ ప్రజాస్వామ్యం మాట అలా ఉంచి ప్రజల విశ్వాసం ఎందుకు దక్కుతుందన్నది ప్రశ్న. అంతేగాకుండా కశ్మీరీలకు మరింత అనుమానాలు కలిగే అవకాశాలున్నాయని కూడా భావించకతప్పదు. ఇది భవిష్యత్తులో దేశస్తుల హక్కుల విషయంలో పొంచి ఉన్న ప్రమాదానికి సంకేతంగా చెప్పక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here