కాపులకు మాత్ర‌మే అంటే ఎలా జ‌గ‌న్ గారూ..!

0

ఏపీలో కులాల ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. అది ఎన్నిక‌ల్లోనే కాదు పాల‌నా పొడ‌వునా ప్ర‌స్ఫుటం అవుతుంది. ప్రస్తుతం వైసీపీప్ర‌భుత్వం పూర్తిగా సామాజిక స‌మీక‌ర‌ణాల త‌క్కెడ‌ను ఎక్క‌డా మొగ్గు లేకుండా చూస్తాన‌ని చెబుతూ తాజాగా ప్ర‌క‌టించిన ఓ ప‌థ‌కం కాపు మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తింపజేయ‌డం వెనుక కార‌ణాలు అంతుబ‌ట్ట‌డం లేదు. హేతుబ‌ద్ధ‌మైన కార‌ణాలు చెప్ప‌కుండానే కాపు మ‌హిళ‌ల‌కు వైఎస్సార్ నేస్తం ప‌థ‌కం ప్ర‌వేశ పెట్ట‌డం ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వం సామాజికంగా చీల్చేందుకు య‌త్నిస్తున్న‌ట్టు ప‌లువురు సందేహించాల్సి వ‌స్తోంది.

ఇప్ప‌టికే రైతు భ‌రోసా ప‌థ‌కంలో కౌలు రైతుల‌కు ప‌లు ఆంక్ష‌లు పెట్టారు. ముఖ్యంగా అగ్ర‌వ‌ర్ణ రైతుల‌కు అవ‌కాశం లేద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా కాపు మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక ప‌థ‌కం కింద ఏటా 15వేల రూపాయ‌ల చొప్పున చెల్లించేందుకు పూనుకుంది. క్యాబినెట్ భేటీలో ఆమోదం పొందిన ఈ ప‌థ‌కం త్వ‌ర‌లో ఏపీలో అమ‌లుకాబోతోంది. కాపు, తెల‌గ‌, బ‌లిజ , ఒంట‌రి కుల‌స్తుల‌కు మాత్ర‌మే అంద‌బోతోంది.

45–60 ఏళ్ల మధ్యనున్న మహిళలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75వేలు ఆర్ధిక సహాయం అందిస్తాన‌న‌డం ఎవ‌రికీ వ్య‌తిరేక‌త ఉండ‌దు. ప్ర‌తిప‌క్షాలు కూడా నోరు మెదిపే అవ‌కాశం లేదు. కేవ‌లం ఒక్క కులానికేనా అని నిల‌దీసే నాయ‌కుడు కూడా ఉండ‌డు. దానికి కార‌ణం రాష్ట్రంలో ప్ర‌ధాన‌మైన ఓ కులానికి ద‌క్కుతున్న ప్ర‌యోజ‌నం ప‌ట్ల నోరు మెదిపితే ఆ కుల‌స్తుల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే ఆందోళ‌న అన్ని పార్టీల్లోనూ ఉండ‌డ‌మే. కాపు మ‌హిళ‌ల‌ జీవనప్రమాణాలను పెంచి, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికే ఈ ఆర్ధిక సహాయం చేస్తున్నామన్న మంత్రిమండలి చెబుతోంది. ఇదే ప్ర‌య‌త్నం ఇత‌రుల‌కు ఎందుకు వ‌ర్తింప‌జేయ‌రు, వారిని ఎందుకు ఉద్ద‌రించ‌రంటే మాత్రం స‌మాధానం క‌నిపించ‌దు.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వం మ‌తాల ప్రాతిప‌దిక‌న ప‌లు కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జాధనం వినియోగిస్తోంది. దానిపై కొంద‌రు రాజ‌కీయం చేయాల‌ని కూడా చూస్తున్నారు. కానీ ఇప్పుడు కులాల ఆధారంగా ప‌థ‌కాలు తీసుకురావ‌డం, అందులో కాపుల‌కు ప్ర‌త్యేకం అని చెప్ప‌డం విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది. మ‌హిళ‌లంద‌రికీ వ‌ర్తింప‌జేస్తే దానికి అభ్యంత‌రం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పోనీ గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్టు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కే అంటే సామాజిక వెనుక‌బాటు కూడా అర్థం అవుతుంది. అదీ కూడా కాకుండా కేవలం కాపు మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే అని చెప్ప‌డం దానికి 1100 కోట్లు నిధులు కేటాయించ‌డం గ‌మ‌నిస్తే ప్ర‌భుత్వం పూర్తిగా కులాల కొల‌త‌ల‌తో సాగుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here