కోడెల ఎపిసోడ్: బాబుకి ప్ల‌స్సా, మైన‌స్సా?

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ గా ప‌నిచేసిన కోడెల శివ‌ప్ర‌సాద్ ఆత్మ‌హ‌త్య పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అందుకు ప్ర‌ధాన కార‌ణం టీడీపీ చేసిన రాజ‌కీయ హంగామా అన్న‌ది కాద‌న‌లేం. ముఖ్యంగా ఏపీలో డిఫెన్స్ లో ఉన్న టీడీపీ కోడెల ఆత్మ‌హ‌త్య ఆధారంగా కొంత మైలేజ్ గ‌డించాల‌నే య‌త్నం చేసింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే న‌రసారావుపేట‌లో పెద్ద సంఖ్య‌లో అంతిమ‌యాత్ర‌కు జ‌నం హాజ‌ర‌య్యారు. కానీ అటు తెలంగాణా, ఇటు ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా సాగించిన యాత్ర పూర్తిగా చంద్ర‌బాబు రోడ్ షోని త‌ల‌పించ‌డం, చివ‌ర‌కు పేట‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాద‌యాత్ర త‌ర‌హాలో విక్ట‌రీ సింబ‌ల్స్ చూపిస్తూ సాగ‌డం సామాన్యుల‌కు సైతం రుచించ‌లేదు.

కోడెల తొలిసారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ఒడిగ‌ట్టిన‌ప్పుడు చంద్ర‌బాబు ఓదార్చి ఉంటే కొంత ఫ‌లితం ద‌క్కేది. పైగా వ‌ర్ల రామ‌య్య వంటి వారితో కోడెల కార‌ణంగా చంద్ర‌బాబుకి త‌ల‌వంపులు వ‌స్తున్నాయ‌నే వాద‌న వినిపించ‌డం మ‌రో విచిత్రంగా చెప్ప‌వ‌చ్చు. అదే స‌మయంలో బీజేపీ నేత‌ల‌కు ట‌చ్ లో వెళ్లిన కోడెల‌కు ఇంటి క‌ష్టాలు మ‌రింత కుంగ‌తీసిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా కొడుకు కార‌ణంగా కొంత అయితే బ‌స‌వ‌తార‌కం ట్ర‌స్ట్ లో ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ సునీత విష‌యంలో జ‌రిగిన ప‌రిణామాలు కూడా కోడెల‌ను కోలుకోలేని స్థాయికి చేర్చిన‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు.

ఆత్మ‌హ‌త్య‌ను కూడా రాజ‌కీయం చేసే యోచ‌న‌కు చంద్ర‌బాబు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం టీడీపీ నేత‌ల మీద వ‌రుస‌గా న‌మోద‌వుతున్న కేసులేన‌ని చెప్ప‌వ‌చ్చు. కోడెల మీద కేసుల‌ను హైలెట్ చేయ‌డం ద్వారా ఇప్ప‌టికే జైలు పాల‌యిన చింత‌మ‌నేని, దానికి చేరువ‌గా ఉన్న కూన ర‌వికుమార్, అచ్చెన్నాయుడు వంటి వారిపై వేధింపుల‌కు ఉప‌శ‌మ‌నం క‌నిపెట్టాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు క‌నిపించింది. అటు పోలీసుల‌ను హెచ్చ‌రిస్తూ, ఇటు మీడియాను బెదిరిస్తూ ఏకంగా జ‌గ‌న్ ని సైకో అనే స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ద్వారా చంద్ర‌బాబు అస‌లు ల‌క్ష్యం అదేన‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.

ఇంత చేసిన త‌ర్వాత చంద్ర‌బాబు ఆశించిన ఫ‌లితం ద‌క్కుతుందా అంటే సందేహంగానే ఉంది. ముఖ్యంగా జ‌గ‌న్ స‌ర్కారు దూకుడు గ‌మ‌నించిన త‌ర్వాత చంద్ర‌బాబు ఎత్తులు ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదు. పైగా ప్ర‌జ‌ల్లో పెద్ద స్థాయిలో సానుభూతి ద‌క్కే అవ‌కాశాలు కూడా ప్ర‌స్తుతానికి లేవు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత ఓ పెద్ద ఈవెంట్ త‌ర‌హాలో కోడెల ఎపిసోడ్ న‌డిపినా ఆశించిన ఫ‌లితం మాత్రం ఆల‌శ్యం అవుతుంద‌న‌డంంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here