క‌మ‌ల కుతూహ‌ల‌మే త‌ప్ప‌, కాలం క‌లిసిరావ‌డం లేదు..!

0

అర్జెంటుగా ఏపీలో బ‌ల‌ప‌డిపోవాల‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. తెలంగాణాలో కేసీఆర్ తర్వాత తామేన‌ని లెక్క‌లేసుకుంటున్న ఆపార్టీకి ఏపీలో కూడా తాము త‌ప్ప మ‌రో దిక్కులేద‌ని లెక్క‌లేస్తోంది. ముఖ్యంగా వైసీపీ మీద ప్ర‌జా వ్య‌తిరేక‌త పెరిగితే, చంద్ర‌బాబు దానిని సొమ్ము చేసుకోగ‌లిగే స్థితిలో లేర‌ని కాబ‌ట్టి తాము ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతామ‌ని అంచ‌నాలేస్తోంది.. జ‌న‌సేన కు రాజ‌కీయంగా జ‌వ‌స‌త్వాలు సంపాదించ‌డం క‌ష్ట‌మేన‌ని క‌మ‌ల‌నాధుల భావ‌న‌. దేశ‌మంతా త‌మ‌కు సానుకూలంగా ఉన్న త‌రుణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌నే అభిప్రాయం ఆపార్టీ నేత‌ల్లో వినిపిస్తోంది.

అభిప్రాయాలు, అంచ‌నాలు ఎలా ఉన్నా అస‌లు వాస్త‌వం మాత్రం భిన్నంగా క‌నిపిస్తోంది. బీజేపీ బ‌లోపేతం మాట అలా ఉంచి, ఆపార్టీ శ్రేణుల‌కు కూడా పూర్తివిశ్వాసం క‌ల్పించే ప‌రిస్థితి కొర‌వ‌డుతుంద‌నే అబిప్రాయం కూడా వినిపించ‌డం మొద‌ల‌య్యింది. ముఖ్యంగా టీడీపీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోతార‌ని తొలుత ప్ర‌చారం చేసుకున్నారు. ప‌లువురు మాజీలు కూడా క‌మ‌లం కండువాలు సిద్ధం చేసుకుంటున్నార‌ని పీల‌ర్లు వ‌దిలారు. కాపు టీడీపీ నేత‌లు స‌మావేశం కూడా కాషాయ‌పార్టీ కోస‌మేన‌ని చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే సీన్ వేరుగా క‌నిపిస్తోంది.

బీజేపీతో ట‌చ్ లో ఉన్నార‌ని చెబుతున్న ఎమ్మెల్యేలెవ‌రూ ఇప్పుడు ఆపార్టీ వైపు మొగ్గుచూపేలా క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు ఢిల్లీ వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపిన అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వంటి ఎమ్మెల్యేలు కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ క‌లిసి పోటీ చేయ‌బోతున్న త‌రుణంలో ఇక ఆపార్టీలో చేరి ఏమి ఉప‌యోగం అంటూ ఆయ‌న స‌న్నిహితుల వ‌ద్ద మాట్లాడుతున్నార‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు కూడా త‌మ ప్ర‌య‌త్నాలు విర‌మించుకున్నారని చెబుతున్నారు. టీడీపీలో కొన‌సాగ‌లేని స్థితిలో ఉన్న గంటా శ్రీనివాస‌రావు వంటి వారు కూడా బీజేపీలో చేర‌డానికి సంశ‌యం వ్య‌క్తం చేస్తుండ‌డంతో క‌మ‌లం ఆశ‌లు క‌ల్ల‌ల‌వుతున్న‌ట్టేన‌ని చెప్ప‌వ‌చ్చు.

మాజీలు కూడా తోట త్రిమూర్తులు, ఆకుల స‌త్య‌న్నారాయ‌ణ వంటి వారు బీజేపీ వైపు చూసినా చివ‌ర‌కు వైసీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. ఇక అనేక‌మంది కూడా అదే బాట‌లో ఉండ‌డంతో ఇప్ప‌టికే బీజేపీలో చేరిన సీఎం ర‌మేష్, సుజ‌నా వంటి ప్ర‌జాబ‌లం లేని నేత‌లు మిన‌హా ప్ర‌జాక్షేత్రంలో ప‌ట్టున్న వారు దొర‌క‌డం క‌ష్ట‌మేన‌ని తేల‌డం క‌మ‌ల‌ద‌ళంలో నిరాశ‌కు దారితీస్తోంది. పైగా టీడీపీలో ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న వారిని త‌మ పార్టీలో చేర్చుకుని మ‌రింత న‌ష్టం చేకూరుస్తార‌నే అభిప్రాయం సీనియ‌ర్ బీజేపీ నేత‌ల్లో వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో క‌న్నా వంటి వారు ఎన్ని క‌ల‌లు క‌న్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు చ‌తికిల‌ప‌డ‌క త‌ప్ప‌ద‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. మీడియాలో సానుకూల‌త ప్ర‌ద‌ర్శిస్తున్నా సామాన్య జ‌నంలోకి ఆపార్టీ చొచ్చుకెళ్లేటంత స్థితి లేద‌ని ప‌రిశీల‌కులు సైతం భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here