క‌శ్మీర్ వివాదం: గొంతు నొక్కేశారంటూ ఐఏఎస్ రాజీనామా

  0

  అత‌నో ఆద‌ర్శ అధికారి. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో కూడా స్వ‌యంగా రంగంలో దిగి వేల‌మంది బాధితుల‌కు అండ‌గా నిలిచిన ఉన్న‌త స్థాయి సివిల్ స‌ర్వెంట్ ఆయ‌న‌. 2012లో ఐఏఎస్ గా ఎంపిక‌య్యి, స్వ‌ల్ప‌కాలంలోనే ప‌లువురి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు హ‌ఠాత్తుగా ఆయ‌న త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఐఏఎస్ ని వీడుతున్న‌ట్టు వెల్లడించి సంచ‌ల‌నం రేపారు.

  కేర‌ళ‌కు చెందిన క‌న్న‌న్ గోపీనాథ‌న్ ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపారు. క‌శ్మీర్ లో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల క‌ల‌త చెందుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గొంతు లేని వారికి గొంతుగా నిల‌వాల‌ని ఆశించిన నాకు, గొంతు లేకుండా చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న రాజీనామాను కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించారు.

  కశ్మీరీల‌కు ప్రాధ‌మిక హ‌క్కులు కూడా లేకుండా చేసిన తీరు మీద ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెండు వారాలుగా అక్క‌డ సాగుతున్న నిర్బంధంపై ఆందోళ‌న చెందారు. సివిల్ స‌ర్వెంట్ గా ప్ర‌జ‌ల హ‌క్కులు ర‌క్షించే బాధ్య‌త‌లో ఉన్న‌ప్ప‌టికీ హ‌క్కులు హ‌రించేస్తున్న స‌మ‌యంలో మౌనంగా ఉండ‌డం నా వ‌ల్ల కాదంటూ త‌న వేద‌న వెల్ల‌డించారు. 370 ర‌ద్దు గురించి నాకు స‌మ‌స్య లేదు, కానీ ప్ర‌జ‌ల గొంతు నొక్క‌డం, త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేసే అవ‌కాశం కూడా లేకుండా చేయ‌డం హ‌క్కులు హ‌రించ‌డ‌మే అంటూ ఆయ‌న పేర్కొన్నారు.

  ఇప్ప‌టికే తెలంగాణాలో ఆకునూరి ముర‌ళీ అనే ఐఏఎస్ అధికారి కూడా సామాజిక కార‌ణాల‌తోనే త‌న రాజీనామా స‌మ‌ర్పించారు. ఇప్పుడు మ‌రో యువ ఐఏఎస్ అధికారి రాజీనామా స‌మ‌ర్పిస్తున్నారు. ఇలాంటి అత్యున్న‌త స్థాయి అధికార వ‌ర్గంలో ఉన్న వారు వ‌రుస‌గా రాజీనామాలు స‌మ‌ర్పించ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. కశ్మీర్ స‌మ‌స్య‌పై ఉన్న‌త స్థాయి అధికారుల్లో ఉన్న ఆవేద‌న‌కు గోపీనాథ‌న్ రాజీనామా అద్దంప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here