జగన్ వ్యూహం: వైఎస్ విగ్రహావిష్కరణలో వారు!

0

ఏపీలో విగ్రహాల చుట్టూ రాజకీయాలు కొత్తేమీ కాదు. తొలగించిన విగ్రహాల ఏర్పాటు ఇప్పుడు మరోసారి రాజకీయం అవుతోంది. విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా కీలక ప్రాంతంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించడం అప్పట్లో పెద్ద చర్చకు తెరలేపింది. ఈ విగ్రహాన్ని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రోద్భలంతో ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా జలదాతగా వైఎస్ ని చాటే రీతిలో ఈ విగ్రహం ఉండేది.

పుష్కరాల సమయంలో ట్రాఫిక్ కి అడ్డంగా ఉందనే పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అర్థరాత్రి పూట విగ్రహాన్ని తొలగించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలు యధావిధిగా ఆ విగ్రహాన్ని పున:ప్రతిష్టించేందుకు రంగం సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం అయ్యింది.

ఈ సందర్భంగానే వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం విశేషంగా మారింది. గతంలో విగ్రహాన్ని తొలగించిన సమయంలో టీడీపీలో కీలక నేతలుగా ఉన్న వారందరినీ తాజాగా పున:ప్రతిష్టకు ఆహ్వానించడం విశేషంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమంగా ప్రోటోకాల్ ప్రకారం అందరినీ ఆహ్వానించాలనే నిబంధన ప్రకారమే అని చెప్పుకున్నప్పటికీ వాస్తవానికి వైసీపీ అధినేత వ్యూహంలో భాగంగానే ఇలాంటి ప్రయత్నం జరిగిందనే సందేహం కలుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి తోపాటుగా స్థానిక ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రమే కాకుండా బుద్ధా వెంకన్నని కూడా ఎమ్మెల్సీ హోదాలో ఆహ్వానించడం విశేషంగా కనిపిస్తోంది.

ప్రోటోకాల్ ప్రకారమే అయితే మిగిలిన ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించాల్సి ఉన్నప్పటికీ ఈ నలుగురు నేతలకు మాత్రమే ఆహ్వానపత్రంలో చోటు దక్కడం రాజకీయంగా ఆసక్తికర అంశంగా మారింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత గద్దె రామ్మోహన్ ని కూడా మినహాయించి కొందరికి మాత్రమే ఆహ్వానం పంపించడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. వైసీపీ అధినేత ప్రణాళికాబద్ధంగానే గతంలో విగ్రహం కూల్చిన సమయంలో కీలకంగా వ్యవహరించిన వారికే ఇప్పుడు ఆహ్వానపత్రంలో చోటు కల్పించి ఉంటారనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here