జేఎన్యూ విద్యార్థుల ఉద్య‌మం ఎందుకు?

  0

  ఢిల్లీ జెఎన్యూ మ‌ళ్లీ వార్త‌ల‌కెక్కింది. విద్యార్థుల ఆందోళ‌న‌తో అట్టుడుగుతోంది. తాజాగా పార్ల‌మెంట్ కి మార్చ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో ఢిల్లీ పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. విద్యార్థుల‌ను అడ్డుకునేంద‌కు ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. ప‌లువురు విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో విద్యార్థుల ఆందోళ‌న ప‌ట్ల సోష‌ల్ మీడియాలో ఫేక్ క్యాంపెయిన్ పెద్ద స్థాయిలో సాగుతోంది.

  జెఎన్యూలో విద్యార్థుల ప‌ట్ల అబద్ధాల ప్ర‌చారం ఐదేళ్ల నుంచి సాగుతోంది. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఈ క్యాంప‌స్ లో చ‌దువుకునే అత్యున్న‌త మేథావి వ‌ర్గం ఎన్న‌డూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవడ‌మేన‌న్న‌ది ప‌లువురి అభిప్రాయం. ముఖ్యంగా దేశ‌మంతా బీజేపీ గెలిచినా, జేఎన్యూ విద్యార్థులు మాత్రం మోడీ అనుకూల ఏబీవీపీని ఎన్న‌డూ ఆద‌రించ‌లేదు. వామ‌ప‌క్ష అనుబంధ సంఘాలు వ‌రుస‌గా విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నాయి.

  ఈ నేప‌థ్యంలో జేఎన్యూ ప‌ట్ల నిత్యం ప్ర‌జ‌ల్లో అపోహ‌లు క‌లిగించే ప్ర‌య‌త్నం పెద్ద స్థాయిలో సాగుతోంది. గ‌తంలో బీజేపీ నేత‌లే జేఎన్యూ లో వ్య‌భిచారం జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వంటి వారు కూడా అదే క్యాంప‌స్ నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆర్ఎస్ఎస్ క్యాంప్ మాత్రం త‌మ ప్ర‌చారం ఆప‌దు. ఇక తాజాగా జేఎన్యూలో ఏకంగా 1100శాతం ఫీజులు పెంచారు. దానిపై విద్యార్థులు ఆందోళ‌న‌కు పూనుకున్నారు. పెంచిన ఫీజులు మొత్తం ఉప‌సంహ‌రించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. క్యాంప‌స్ లో చ‌దువుతున్న విద్యార్థుల్లో 43 శాతం మంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి 1.44ల‌క్ష‌ల లోపుగా ఉంది. అలాంటి కుటుంబాల నుంచి వ‌చ్చిన వారు ఏటా రూ.66వేల ఫీజులు చెల్లించాల‌ని నిర్ణ‌యం చేయ‌డాన్ని వారు త‌ప్పుబ‌డుతున్నారు. పేద‌ల‌కు ప్ర‌భుత్వ విద్య‌ను దూరం చేసి, ప్రైవేటీక‌ర‌ణ చేసే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఇలాంటి కుట్ర‌లు చేస్తున్నార‌ని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

  ఏటా ఉన్న‌త‌విద్యా ప‌న్ను పేరుతో సుమారుగా 95వేల కోట్లు వ‌సూలు చేస్తున్న‌ట్టు కాగ్ రిపోర్ట్ లో పేర్కొన్న ప్ర‌భుత్వం విద్యార్థుల ముక్కు పిండి ఫీజులు వ‌సూలు చేయ‌డం ఏమిట‌ని వారు నిల‌దీస్తున్నారు. గ‌తంలో హాస్ట‌ల్ ఫీజులు నెల‌కు 2,800 గా ఉంటే ఇప్పుడు దానిని 4,300కి పెంచుతున్నార‌ని, త‌ద్వారా దేశంలోనే అత్యంత ఎక్కువ ఫీజులున్న సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీగా జేఎన్యూని మారుస్తున్నార‌ని చెబుతున్నారు. జేఎన్యూ విద్య‌ని ఖ‌రీదు చేసే స‌ర్కారు య‌త్నాల‌పై తాము నిల‌దీస్తుంటే కొంద‌రు దానిని వ‌క్రీకరించే య‌త్నం చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here