జ‌గన్ కి మింగుడుప‌డ‌ని ఆ ఎంపీ తీరు..!

0

ఏపీ రాజ‌కీయాల్లో అధికార వైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ఆపార్టీలో కొంద‌రు ఎంపీల తీరు ప‌ట్ల అధినేత అస‌హ‌నంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కిన‌ట్టు క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. కొంద‌రు ఎంపీలు నేరుగా లాబీయింగ్ చేసుకుంటున్న ధోర‌ణికి అడ్డుక‌ట్ట వేయాల‌ని జ‌గ‌న్ ఆలోచించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

జ‌గ‌న్ టికెట్లు ఇచ్చిన వారిలో 22 మంది లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వారిలో అత్య‌ధికులు తొలిసారిగా పార్ల‌మెంట్ లో అడుగుపెట్టారు. అయినా వారిలో కొంద‌రు చాలాకాలంగా రాజ‌కీయాల్లో ఉండ‌డం, ఇత‌ర పార్టీల్లో ప‌నిచేసి రావ‌డంతో ప‌లువురు నేత‌ల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధాలున్నాయి. అంతేగాకుండా కొంద‌రికి నేరుగా వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ రాజ‌కీయాల్లో వాటిని ఉప‌యోగించి కొంద‌రు సొంతంగా వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దుకునే ప‌రిస్థితికి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీలో కొన్ని చిక్కులు త‌ప్ప‌డం లేద‌ని స‌మాచారం. ముఖ్యంగా తొలి పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బ‌డ్జెట్ పై చ‌ర్చ‌లో ఎవ‌రు పాల్గొనాల‌నే విష‌యంలో ఇద్ద‌రు ఎంపీలు ప‌ట్టుద‌ల‌కు పోవ‌డంతో పెద్ద స‌మ‌స్య‌గా మారింది. గోదావ‌రి జిల్లాల‌కే చెందిన ఈ ఇద్ద‌రు ఎంపీల్లో ఒక‌రు యువ ఎంపీ కాగా, మ‌రొక‌రు వ్యాపారాల నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నేత కావ‌డం విశేషం. చివ‌ర‌కు యువ ఎంపీగా ఉన్న మార్గాని భ‌ర‌త్ మాట్లాడ‌డం, మంచి మార్కులు కొట్టేయ‌డం కూడా అంద‌రికీ తెలిసిందే.

ఆ త‌ర్వాత పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీల ఎంపిక‌లో కీల‌క‌మైన క‌మిటీకి బాధ్య‌త‌లు ద‌క్కించుకున్న మ‌రో ఎంపీ నేరుగా పీఎంవోలో వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దుకునే స్థాయికి చేరడం వైసీపీలోనే ప‌లువురికి రుచించ‌డం లేద‌ని తెలుస్తోంది. దాంతో నేరుగా పార్టీ అధినేత ముందు ఈ ప‌రిస్థితిపై పంచాయితీ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మొన్న‌టి స‌మావేశంలో జ‌గ‌న్ కాస్త సూటిగానే స‌ద‌రు ఎంపీకి చెప్ప‌డంతో ఆయ‌న కొంత అసంతృప్తికి గురయిన‌ట్టు అనుచ‌రుల ద్వారా తెలుస్తోంది. త‌న‌కు తెలిసిన మీడియా యాజ‌మాన్యాల ద్వారా త‌న అసంతృప్తిని జ‌గ‌న్ దృష్టికి చేరేలా క‌థ‌నాలకు లీకులు ఇస్తున్న‌ట్టు వైసీపీ క్యాంప్ అంచ‌నా వేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే గ‌డిచిన రెండు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముందు రెండు సార్లు పార్టీలు మారి, చివ‌ర‌కు ఈసారి బ‌రిలో దిగి, విజ‌యం సాధించిన ఆ ఎంపీ చివ‌ర‌కు ఏం చేస్తారు, ఆయ‌న్ని క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నంలో ఉన్న జ‌గ‌న్ కి ఈ ప‌రిణామాలు ఎంత‌వ‌ర‌కూ దారితీస్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.

తాజాగా మాతృభాష‌లో బోధ‌న విష‌యంపై పార్ల‌మెంట్ లో స‌ద‌రు ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంకేతాల‌కు కార‌ణం అవుతోంద‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. అధినేత ఆలోచ‌న‌కు భిన్నంగా వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మ‌కంగానే ఆయ‌న సాగిస్తున్నార‌నే సందేహాల‌ను కూడా కొంద‌రు లేవ‌నెత్తుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here