జ‌గ‌న్ కి జూపూడి నేర్పుతున్న పాఠం!

0

పాఠాలు నేర్చుకున్న పొలిటీషియ‌న్ ప‌దికాలాల పాటు చిద్విలాసంగా సాగుతాడు. లేదంటే ప్ర‌జ‌ల్లో ఉన్న మ‌ద్ధ‌తు కూడా ప‌టాపంచ‌ల‌యి పోయి చివ‌ర‌కు ప‌ద‌వికే ఎస‌రు వ‌స్తుంది. ఇప్ప‌టికే అనేక‌మందికి ఇలాంటి అనుభ‌వాలున్నాయి. అయితే ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ పాఠాలు నేర్చుకుంటున్నట్టా లేన‌ట్టా అన్న‌ది ప్ర‌స్తుతానికి స్ప‌ష్ట‌త క‌నిపించ‌డం లేదు. కానీ పాఠాలు నేర్చుకోక‌పోతే మాత్రం ముఖ్య‌మంత్రికి కూడా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌న‌డంలో సందేహం లేదు.

వైసీపీలో గ‌ట్టిగా త‌న స్వ‌రం వినిపించి, 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత పార్టీ ఫిరాయించిన జూపూడీ ప్ర‌భాక‌ర్ రావు మ‌ళ్లీ సొంత గూటికి చేరారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో కండువా క‌ప్పుకుని తాను దారిత‌ప్పిన గొర్రెన‌ని చెప్పుకున్నారు. తిరిగి స‌రైన దారిలోకి వ‌చ్చాన‌ని ఆయ‌న చెప్పుకున్న‌ప్ప‌టికీ వైసీపీ శ్రేణుల‌కు మాత్రం ఈ ప‌రిణామం మింగుడుప‌డ‌లేదు. ఇప్పుడు జూపూడి, రేపు గంంటా, బొండా, చింత‌మ‌నేని వంటి వారిని కూడా చేర్చుకుంటారా అంటూ సోషల్ మీడియాలో చెల‌రేగిపోయారు. సూటిగానే అధిష్టానాన్ని ప్ర‌శ్నించారు. ఫిరాయింపుదారుల‌ను, నోటికొచ్చిన‌ట్టు మండిప‌డిన వారిని మ‌ళ్లీ నెత్తిన పెడ‌తారా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

సోష‌ల్ మీడియాలో నిల‌దీత‌కు పార్టీ అధికారిక వాణి వినిపించే వారు కూడా సైలెంట్ అయిపోవాల్సి వ‌చ్చింది. సొంత పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు మండిప‌డ‌డంతో మౌనం దాల్చాల్సి వ‌చ్చింది. కొంద‌రు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ విరుచుకుప‌డ‌డంతో మిగిలిన వారికి ఆ ప‌రిస్థితి త‌ప్ప‌లేదు. అయితే ఇదంతా అధికార‌పార్టీ క్యాడ‌ర్ లో ఉన్న అస‌హ‌నానికి, అసంతృప్తికి నిద‌ర్శ‌నంగా కొంద‌రు భావిస్తున్నారు. నాలుగు నెల‌ల పాల‌న‌లో పెద్ద‌గా ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌లేక‌పోవ‌డం, ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తుండ‌డం, పార్టీని న‌మ్ముకున్న వారికి కూడా నామినేటెడ్ స‌హా వివిధ ప‌ద‌వుల పందేరం చేప‌ట్ట‌క‌పోవ‌డం వంటి ప‌లు కార‌ణాల‌తో పార్టీ కార్య‌క‌ర్త‌లు కుత‌కుత‌లాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అలాంటి వారికి జూపూడి మంచి ఆయుధంగా మారారు.

ఇప్ప‌టికైనా ఆ ప‌రిస్థితిని జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల‌ను గ‌మ‌నించాల్సి ఉంటుంది. వారికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపించేందుకు ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది. లేదంటే సోష‌ల్ మీడియా కాలంలో ప్ర‌త్య‌ర్థులు ప‌క్క‌న పెడితే సొంతింటి కుంప‌టే పెద్ద స‌మ‌స్య అవుతుంది. ఈ విష‌యంలో పాఠాలు నేర్చుకుని, ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకోవాల్సిన అధికార పార్టీ అధినేత అందుకు అనుగుణంగా అడుగులు వేస్తారా లేదా అన్న‌ది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here