జ‌గ‌న్ త‌లుపులు తెరిచే ఉంచారు..!

0

తోట త్రిమూర్తుల‌నే చేర్చుకున్నారు. జూపూడి ప్ర‌భాక‌ర్ ఓ లెక్కా అంటున్నారు ప‌లువురు వైసీపీ కార్య‌క‌ర్త‌లు కూడా. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సొంత పార్టీ శ్రేణుల‌ను, నేత‌ల‌ను నోటికొచ్చిన‌ట్టు మాట్లాడిన వారిని పిలిచి కండువాలు క‌ప్పుతున్న తీరు చాలామంది కార్య‌క‌ర్త‌ల‌కు మింగుడుప‌డ‌డం లేద‌న్న విష‌యం జ‌గ‌న్ కి తెలుసో లేదో అర్థం కావ‌డం లేదు. అధికారం ఉన్న‌ప్పుడు ప‌క్క‌న చేరి, ఆ త‌ర్వాత ప‌ని పూర్తికాగానే నోటికి ప‌నిచెప్పే బ్యాచ్ కి పుష్ప‌గుచ్చాలు అందిస్తున్న తీరు విస్మ‌య‌క‌రంగా మారుతోంది.

తోట త్రిమూర్తులు గానీ, జూపూడి ప్ర‌భాక‌ర్ గానీ ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలో లేక‌పోతే ఆయ‌న మొఖం కూడా చూడ‌డానికి సిద్ధ‌ప‌డే ర‌కాలు కాదు. స‌హ‌జంగా అధికారం ఉన్న‌ప్పుడే ఎవ‌రైనా వ‌స్తార‌న్న‌ది వాస్త‌వమే అయినా అది లేన‌ప్పుడు క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా సిద్ధంకాని వాళ్ల‌ను, పైగా బుర‌ద‌జ‌ల్ల‌డానికి ప్ర‌య‌త్నించిన వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టుకుంటే ఆ త‌ర్వాత పార్టీ ప‌రిస్థితి ఎలా మారుతుందో చెప్పడం పెద్ద క‌ష్టం కాబోదు.

గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇలానే చేశారు. త‌నను సంప్ర‌దించిన ప్ర‌తీ ఒక్క‌రినీ పార్టీలో చేర్చుకున్నారు. కొంద‌రిని ప‌నిగ‌ట్టుకుని న‌యానో,భ‌యానో కండువాలు క‌ప్పేశారు. ఎదుటి పార్టీని బ‌ల‌హీన‌ప‌ర్చాల‌నో, మ‌రో పార్టీలోకి పోకుండా చూసుకోవాల‌నో ఆశించి చేసిన ఇలాంటి ప్ర‌య‌త్నాలు ఎలాంటి ఫ‌లితాలు ఇచ్చాయో అంద‌రూ చూశారు. స‌రిగ్గా ఇప్పుడు జ‌గ‌న్ కూడా అలాంటి ల‌క్ష్యాల‌తోనే న‌మ్మ‌శ‌క్యంగాని నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా ఏమి సాధిస్తార‌న్న‌ది కూడా ప్ర‌శ్న‌గానే మిగిలిపోతుంది. పైగా ప్ర‌జ‌ల్లో తిర‌స్క‌రించిన వారిని పార్టీలోకి ఆహ్వానించ‌డం ద్వారా పార్టీ కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాల‌ను కూడా ఖాత‌రు చేయ‌డం లేద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఇది పాల‌క‌ప‌క్షానికి పెద్ద‌గా ప్ర‌యోజ‌నం చేకూర్చే అవ‌కాశం లేద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి.

జూపూడికి జెండా ఊపేసిన నేప‌థ్యంలో ఇక వైసీపీలో చేర‌డానికి ఉత్సాహ‌ప‌డుతున్న ఇత‌రుల‌కు కూడా దాదాపుగా త‌లుపులు తెరిచిన‌ట్టే భావించ‌వ‌చ్చు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటి వ‌ర‌కైనా ఉంటారో లేదో చెప్ప‌లేని చాలామంది నేత‌ల‌కు ఈ ప‌రిణామాలు సానుకూలంగానే క‌నిపిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here