జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేస్తారా..?భార‌తి అందుకేనా??

0

ఈవార‌మే ఏదో జ‌ర‌గ‌బోతోందంటూ ఓ వ‌ర్గం మీడియా హ‌డావిడి చేస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ కి సీబీఐ కోర్ట్ లో బెయిల్ ర‌ద్ద‌వుతుంద‌నే ఊహాగానాలు విస్తృతంగా వ్యాప్తిజేస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ అనంత‌రం వైఎస్ భార‌తి ముఖ్య‌మంత్రి సీటు ఎక్కుతారంటూ కూడా టీడీపీ అనుకూల వెబ్ సైట్లు హోరెత్తిస్తున్నాయి. ఇప్ప‌టికే దానికి త‌గ్గ‌ట్టుగా భారతి అన్ని విష‌యాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారంటూ తాజాగా గ‌వ‌ర్న‌ర్ ని స‌తీస‌మేతంగా క‌లిసిన సంద‌ర్భాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

వాస్త‌వానికి అలాంటి అవ‌కాశం ప్ర‌స్తుతానికి క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సీబీఐ కోరింది లేదు. ఒక‌వేళ సీబీఐ కోరిన‌ప్ప‌టికీ కోర్టులో దానికి త‌గ్గ‌ట్టుగా విచార‌ణ జ‌ర‌గాలి. విచార‌ణ‌లో అనేక అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయి. దానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. సీబీఐ వాద‌న‌ను కోర్టులు య‌ధావిధిగా అంగీక‌రించే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్ప‌టికే సీబీఐ అభియోగాలు ఎదుర్కొన్న అనేక మందికి జ‌గ‌న్ కేసుల నుంచి కోర్టుల ద్వారా ఉప‌శ‌మ‌నం ల‌భించింది. సీబీఐ వాద‌న‌ల‌కు ఆధారాలు లేక‌పోవ‌డంతో అనేక మంది అధికారులు, పారిశ్రామిక‌వేత్త‌లు కేసుల నుంచి బ‌య‌ట ప‌డ్డారు. నిందితులుగా పేర్కొన్న వారిలో అత్య‌ధికులు ఇప్ప‌టికే నిర్ధోషులుగా బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రుణంలో జ‌గ‌న్ మీద కేసులు నిల‌బ‌డే అవ‌కాశాలు ఏమేర‌క‌న్న‌ది కూడా ప్ర‌శ్నార్థ‌కం. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ కేసుల్లో బెయిల్ ర‌ద్దు చేయాల‌ని నిజంగా సీబీఐ కోరిన‌ప్ప‌టికీ దానికి త‌గిన ఆధారాలు కోర్టుకి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

తన‌కు కోర్ట్ హాజ‌రుకాకుండా మిన‌హాయింపు ఇవ్వాలంటూ జ‌గ‌న్ చేసిన అభ్య‌ర్థనను ఇప్ప‌టికే కోర్ట్ తోసిపుచ్చ‌డంతో ఈ విష‌యంలో ఎలా స్పందిస్తున్న‌ది కూడా సందేహ‌మే. ఇటీవ‌ల దీర్ఘ‌కాలిక కేసుల విష‌యంలో సీబీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుని, బెయిల్ మీదున్న వారిని తిరిగి విచారించ‌డానికి అవ‌కాశం కోరాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అదే జ‌రిగితే జ‌గ‌న్ క‌న్నా ముందు చాలా కేసులున్నాయ‌నే సంగ‌తిని ఈ ప్ర‌చారం చేస్తున్న వారు మ‌ర‌చిన‌ట్టున్నార‌ని కొంద‌రు న్యాయ‌నిపుణులు చెబుతున్నారు.

అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌డాన్ని స‌హించలేని త‌ర‌గ‌తి సోష‌ల్ మీడియాలో ఈ తీరున రెచ్చిపోతున్న తీరు విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా ఎదుర్కోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ వెబ్ సైట్ల ద్వారా అనేక అనుమానాలు రేకెత్తించే క‌థ‌నాలు ఉధృతంగా ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో అపోహ‌లు పెంచే ప్ర‌య‌త్నం సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కోర్టులో జ‌రిగే ప్ర‌క్రియ‌ను త‌మ రంగు క‌ళ్ల‌ద్దాల్లోంచి చూస్తున్న వారు అంద‌రికీ అదే చూపించే య‌త్నంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ వాస్త‌వానికి పొంత‌న‌లేని ఇలాంటి క‌థ‌నాల‌తో జ‌గ‌న్ మీద సాగించే దుష్ప్ర‌చారం తాత్కాలికంగా కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించి, సంతృప్తి ప‌డ‌వ‌చ్చేమోగానీ దీర్ఘ‌కాలంలో ఎటువంటి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌వ‌ని అర్థం చేసుకుంటే మంచిది.

ఇప్ప‌టికే ఇలాంటి కొన్ని వెబ్ సైట్ల పేర్ల‌ను వ‌ల్ల‌భ‌నేని వంశీ స్వ‌యంగా ప్ర‌స్తావించారు. టీడీపీ సోష‌ల్ మీడియా విభాగం వాటి వెనుక ఉంద‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు కూడా చేశారు. త‌న‌మీద సాగించిన దుష్ప్ర‌చారం నేరుగా పోలీసుల దృష్టికి పిర్యాదు రూపంలో తీసుకెళ్లారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ బెయిల్ చుట్టూ వ‌స్తున్న క‌థ‌నాల వెనుక కూడా అలాంటి ప్ర‌య‌త్నాలే ఉన్నాయ‌నే అనుమానం బ‌ల‌ప‌డుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here