ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదా కోసం తీవ్రంగా శ్రమించిన జగన్ తీరులో అనూహ్య మార్పు కనిపిస్తోంది. సీఎం జగన్ అనిపించుకోవడానికి జగన్ కష్టం అంతా ఇంతా కాదు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా చరిత్ర సృష్టించిన జగన్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన మూడు నెలల పదవీకాలంలో పూర్తి మార్పు కనిపిస్తోంది. జనాలకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. ప్రజా సమస్యలు పేరుకుపోతున్నప్పటికీ ముఖ్యమత్రి జగన్ మాత్రం తన దారి తనదే అన్నట్టుగా సాగుతున్నారనే అభిప్రాయం బలపడుతోంది.
చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం నిత్యం ఏదో కార్యక్రమాలు కనిపించేవి. ప్రచారయావతో సాగుతున్నారనే ఆరోపణలున్నప్పటికీ చంద్రబాబు మాత్రం వెనక్కితగ్గేవారు కాదు. ముఖ్యమంత్రిగా సమీక్షలు గానీ, సభలు, ఇతర కార్యకలాపాలు గానీ ఆయన హయంలో కనిపించేవి. కానీ జగన్ మాత్రం కాస్త భిన్నంగా సాగుతున్నారు. మూడు నెలల కాలంలో ఆయన ప్రజల మధ్య నిర్వహించిన కార్యక్రమాలు కేవలం మూడు మాత్రమే. ఒకటి వైఎస్సార్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం, ఆతర్వాత సామూహిక అక్షరాభ్యాసం, తాజాగా వనమహోత్సవం మాత్రమే జగన్ పాల్గొన్న కార్యక్రమాలు.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన మీద పట్టు సాధించడానికి కొంత సమయం పడుతుందనడంలో సందేహం లేదు. కానీ 100 రోజుల తర్వాత జగన్ పాలన గాడిలో పడినట్టు కనిపించడం లేదు. రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తారని తొలుత ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ 2నాడు అది జరగలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రజా దర్బార్ విషయంలో కూడా ఇప్పటికీ స్పష్టత రాలేదు. గతంలో వైఎస్సార్ చేపట్టిన కార్యక్రమాలు కొనసాగిస్తారని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆచరణ రూపం దాల్చలేదు. ఇక వాలంటీర్ల వ్యవస్థ ఆర్భాటంగా ప్రారంభించినా అది ఆచరణలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. గ్రామ సచివాలయాల విషయంలో ఎంత సమర్థవంతంగా పనిచేయిస్తారన్నది చూడాలి. కొత్త విధానంలో ఆధిలో కొంత సమస్యలు వచ్చినప్పటికీ పట్టు సడలకుండా సాగితేనే పాలన సక్రమం అవుతుంది.
సెప్టెంబర్ నుంచి ప్రజారంజక పాలనలో భాగంగా నవరత్న పథకాలు అమలుకు నోచుకుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. వాటి అము విషయంలో ముఖ్యమంత్రి మరింత చొరవ ప్రదర్శించాల్సిన అవసరం కనిపిస్తోంది. మంత్రులు కూడా మరింత క్రియాశీలకంగా సాగాల్సి ఉంటుందని వరదల సందర్భంగా వారి పనితీరు చాటిచెప్పింది. క్యాబినెట్ భేటీలు కూడా అరకొరగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. వాటన్నింటినీ సరిదిద్ది టీమ్ పని మెరుగుపరిచేందుకు నాయకుడిగా జగన్ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాల్లో సీఎం ఎలా వ్యవహరిస్తారన్న దానిని బట్టే ప్రభుత్వ పనితీరు ఆధారపడి ఉంటుంది.