టీడీపీలో ఎన్టీఆర్ పాత్ర‌పై క‌ల‌క‌లం

  0

  ఒక‌ప్పుడు తెలుగునాట తిరుగులేని పార్టీ. అన్ని ప్రాంతాల్లోనూ హ‌వా న‌డిచిన రోజుల నుంచి ఇప్పుడు క్ర‌మంగా ప్రాభ‌వం కోల్పోతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణాలో ఉనికి ఉందా లేదా అన్న‌ట్టుగా మారిపోయింది. మిగిలిన అరకొర నేత‌లు కూడా వ‌రుస‌గా బీజేపీ బాట‌లో ఉన్నారు. ఏపీలో కూడా చంద్ర‌బాబు స‌న్నిహితులు సైతం గుడ్ బై చెప్పేసిన త‌రుణంలో టీడీపీ ఒక కోలుకునే అవ‌కాశం ఉందా లేదా అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

  ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వృద్ధాప్యం, త‌గిన వార‌సుడు ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా త‌న‌యుడు లోకేశ్ కోసం పార్టీ అధినేత ఎంత‌గా త‌ప‌న ప‌డుతున్నా తెలుగుదేశం పార్టీకి ఆయ‌న త‌గిన నాయ‌కుడవుతార‌నే ధీమా క‌నిపించ‌డం లేదు. తొలిసారిగా బ‌రిలో దిగి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం ఎదుర్కొన్న నారా లోకేశ్ కి పార్టీని న‌డిపించే స‌త్తా లేద‌నే అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే అస‌లైన నేత‌గా అనేక‌మంది అంచ‌నాలు వేస్తున్నారు. ఎన్టీఆర్ న‌ట వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని, త‌గిన తోడ్పాటు ద‌క్క‌క‌పోయినా టాలీవుడ్ లో తానేంటో నిరూపించుకున్న యంగ్ టైగ‌ర్ రాజ‌కీయంగానూ రాణించే స‌త్తా ఉన్న నేత‌గా 2009 ఎన్నిక‌ల్లోనే నిరూపితం అయ్యింది.

  తాత‌ను పోలిన న‌ట‌న మాత్ర‌మే కాకుండా వాగ్ధాటి కూడా ఉండ‌డంతో ఎన్టీఆర్ కి తెలుగుదేశం సార‌ధ్యం విష‌యంలో పెద్ద‌గా అడ్డంకులు ఉండ‌వ‌నే అంచ‌నాలున్నాయి. ఒక‌రిద్ద‌రు భిన్నంగా ఆలోచించినా చివ‌ర‌కు అత‌డే టీడీపీకి దిక్క‌వుతార‌నే లెక్క‌ల్లో మెజార్టీ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కి అంత సులువుగా చ‌క్రం తిప్పే అవ‌కాశాలు ద‌క్క‌వ‌ని ప‌రిణామాలు చాటుతున్నాయి. ఇప్ప‌టికే నారా లోకేశ్ కోస‌మే ఎన్టీఆర్ కి తలుపులు మూసేసిన‌ట్టుగా ప్ర‌చారం సాగింది. రాజ‌కీయంగా ఎన్టీఆర్ ని దూరం పెట్ట‌డానికి కార‌ణం చంద్ర‌బాబు త‌న‌యుడేన‌నే అభిప్రాయం వినిపించింది.

  ఒక సంద‌ర్భంలో ఏపీలో టీడీపీ అధికారాన్ని ఉప‌యోగించుకుని ఎన్టీఆర్ కి చెందిన సినిమాల‌కు కూడా ఆటంకాలు క‌ల్పించిన సంద‌ర్భాలున్నాయి. నాన్న‌కు ప్రేమ‌తో వంటి సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఎదుర‌యిన స‌వాళ్లు చాలామందికి తెలిసిన‌వే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా నారా లోకేశ్ తోడ‌ల్లుడు, బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు చేసిన వ్యాఖ్య‌లు క‌నిపిస్తున్నాయి. విశాఖ పార్ల‌మెంట్ సీటుకి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌యిన భ‌ర‌త్ తాజాగా ఎన్టీఆర్ గురించి ప్ర‌స్తావించ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారుతోంది. తెలుగుదేశం పార్టీలో సంచలనం రేపుతున్నాయి.

  ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌ని ఉద్దేశించి భ‌ర‌త్ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి మంచి జరుగుతుందని అనుకోవట్లేదు.. మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు. ఎందుకు అవసరం చెప్పండి. మేం బాగానే ఉన్నాం కదా. అసలు ఎన్టీఆర్‌ను మేం ఎందుకు కోరుకుంటాం. ఇప్పటివరకు మేం నడిపిన పార్టీ, మా నాయకులు పనికిరాకుండా ఉన్నారా? అలాంటిదేం లేనప్పుడు ఎన్టీఆర్‌ను ఎందుకు కోరుకుంటాం.” అంటూ మాట్లాడారు.

  ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఉంది కదా అనే ప్రశ్నకు అలాంటిదేం లేదు. ఎన్టీఆర్‌కు చాలామంది పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్లలో ఒకరే, ఆయనను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ఎన్టీఆర్ అవసరం టీడీపీ అవసరం లేదంటూ.. పెద్ద ఎన్టీఆర్ వచ్చినపుడు అంతా కొత్తవాళ్లతోనే పార్టీని నిర్మించారంటూ చెప్పుకొచ్చాడు.

  దాంతో ఈ కామెంట్స్ కాక రేపుతున్నాయి. ఇప్ప‌టికే హ‌రికృష్ణ ప్ర‌ధ‌మ వ‌ర్థంతి కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ తో ప్ర‌త్యేకంగా కొద్దిసేపు చంద్ర‌బాబు మంత‌నాలు జ‌రిపి, అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నార‌నుకునే లోపు భ‌ర‌త్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ప‌లువురు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని వెళ్లి, పార్టీకి పున‌రుత్తేజం కోసం ప‌నిచేయాల్సిన స‌మ‌యంలో తోడ‌ల్లుళ్ల తీరుతో టీడీపీ మ‌రింత కుదేల‌య్యేలా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఎన్టీఆర్ లాంటి స‌మ‌ర్థుడితో స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగాల్సి ఉండ‌గా ఒంటెద్దు వాదంతో వ్య‌వ‌హ‌రిస్తే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని మ‌ర‌చిపోవ‌ద్దంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. అనుభ‌వ‌లేమితో లోకేశ్, భ‌ర‌త్ వంటి వారు చేసే వ్యాఖ్య‌లు. చేష్ట‌లు చంద్ర‌బాబుకి స‌మ‌స్య‌గా ప‌రిణమించే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు సైతం భావిస్తున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here