ఢిల్లీలో చంద్ర‌బాబు: మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌య్యేందుకేనా?

0

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ ఢిల్లీలో ద‌ర్శ‌న‌మిచ్చారు.కొంత విరామం త‌ర్వాత ఆయ‌న హ‌స్తిన‌లో అడుగుపెట్ట‌డం ఆస‌క్తిగా మారింది. అరుణ్ జైట్లీ కి నివాళి అర్పించేందుకు ఆయ‌న ఢిల్లీ వెళ్లిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. పైకి ఏ కార‌ణాలు చెప్పిన‌ప్ప‌టికీ అంత‌ర్గ‌తంగా ఇత‌ర కార‌ణాలు ఉంటాయ‌నే అనుమానాలు వినిపిస్తున్నాయి.

Source: Chandrababu twitter handle

ఇలాంటి సందేహాల‌కు ఆస్కార‌మిచ్చేలా చంద్ర‌బాబు తీరు ఉంది. ఇటీవ‌లే మ‌ర‌ణించిన మ‌రో మాజీ మంత్రి సుష్మా స్వ‌రాజ్ కి నివాళి అర్పించేందుకు చంద్ర‌బాబు సిద్ధం కాలేదు. కేవ‌లం ట్వీట్స్ , ప్ర‌క‌ట‌న‌ల‌తో స‌రిపెట్టుకున్నారు. కానీ అరుణ్ జైట్లీ విష‌యంలో దానికి భిన్నంగా స్పందించారు. వాస్త‌వానికి అరుణ్ జైట్లీ సుదీర్ఘ‌కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. కానీ సుష్మా మాత్రం కార్డియాక్ అరెస్ట్ తో హ‌ఠాన్మ‌ర‌ణం పొందారు. అయినా సుష్మా క‌డ‌చూపు కోసం హస్తిన వ‌ర‌కూ వేంచేసేందుకు చంద్ర‌బాబు చొర‌వ చూప‌లేదు.

ఇటీవ‌ల దేశంలో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా క‌శ్మీర్ వ్య‌వ‌హారం, అనంత‌రం చిదంబ‌రం అరెస్ట్ తో కాంగ్రెస్ నేత‌లే కుదేల‌వుతున్నారు. సింఘ్వీ, శ‌శిథ‌రూర్, జైరాం ర‌మేష్ వంటి వారే మోడీకి జై కొట్టే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక ఇత‌ర నేత‌లు సైతం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు కూడా బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే మార్గ‌లు వెదుకుతున్న‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ లో కీల‌క‌నేత‌లు క‌మలం వైపు క్యూ క‌డుతున్న త‌రుణంలో చంద్ర‌బాబుకి లైన్ క్లియ‌ర్ చేసేందుకు వారంతా ప్ర‌య‌త్నిస్తార‌ని భావిస్తున్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ తో క‌లిసి మోడీ, షా ద్వ‌యంతో పాటుగా బీజేపీ మీద తీవ్రంగా విరుచుకుప‌డ్డ చంద్ర‌బాబు ఇప్పుడు మ‌ళ్లీ స్నేహానికి సిద్ధంగా ఉన్నార‌నే సంకేతాలకు ఈప‌రిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి. గ‌తంలో హ‌రికృష్ణ భౌతిక‌కాయం వ‌ద్దే టీఆర్ఎస్ తో పొత్తుల కోసం ప్ర‌య‌త్నించిన చంద్ర‌బాబు మ‌ళ్లీ అలాంటి ప్ర‌య‌త్నాలు చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేద‌నేది కొంద‌రి అభిప్రాయం.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ లో కొంద‌రు కీల‌క బీజేపీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అదే జ‌రిగితే ఏపీలో బీజేపీకి ఉన్న అవ‌కాశాల‌న్నీ కోల్పోవ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబుకి ఏమాత్రం చేయూత అందించినా అది మ‌ళ్లీ టీడీపీ కోలుకోవ‌డానికి ఏదో మేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందే త‌ప్ప బీజేపీకి క‌లిసొచ్చే అవ‌కాశం లేద‌ని చెప్పుకొస్తున్నారు. ఏమ‌యినా చంద్ర‌బాబు తాజా ప‌ర్య‌ట‌న మ‌రోసారి పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here