తెలంగాణా,ఆంధ్రా రాజ‌కీయాల‌లో అత‌డో ‘మేఘా’…!

0

ఏదో ఒక రాష్ట్రంలో చ‌క్రం తిప్ప‌గ‌లిగితే స‌మర్థుడు అంటారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లోనూ పట్టు సాధించ‌గ‌లిగితే ఘ‌టికుడు అనాలేమో. ప్ర‌స్తుతం తెలుగు నేల మీద బ‌డా కాంట్రాక్ట‌ర్ గా మారిన మేఘ సంస్థ‌ను చూస్తే వారి సామ‌ర్థ్యం అర్థ‌మ‌వుతుంది. పుష్క‌ర కాలం క్రితం వైఎస్సార్ హ‌యంలో కొత్తం పుంత‌లు తొక్కించిన ప్ర‌స్థానం నుంచి, కేసీఆర్, చంద్ర‌బాబు పాల‌నా కాలంలో మ‌రింత బ‌ల‌ప‌డిన నేప‌థ్యం ద్వారా ఇప్పుడు జ‌గ‌న్ హ‌యంలో తానేంటో నిరూపించుకుంటోంది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌ల రాజకీయాల్లో కూడా మేఘా సంస్థ‌ది కీల‌క పాత్ర‌. ఎవ‌రు అధికారంలో ఉంటే వారికి అండ‌గా ఉంటూ, వారి ద్వారా భారీ ప్రాజెక్టులు సాధించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడిగా మారిందీ సంస్థ‌. గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో ప‌ట్టిసీమ ప్రాజెక్ట్ స‌కాలంలో నిర్మించార‌నే పేరుతో ఏకంగా స‌న్మానాలు, అంత‌కుమించి వంద‌ల కోట్ల న జారానాలు కూడా మేఘాకి ద‌క్కాయి. అప్ప‌ట్లో ఈ సంస్థ మీద జ‌గ‌న్ తీవ్రంగా మండిప‌డ్డారు. అవినీతి పుంఖానుపుంఖాలుగా సాగిపోయిందంటూ అసెంబ్లీలో సైతం కాగ్ రిపోర్ట్ ప‌ట్టుకుని ప్ర‌భుత్వాన్ని క‌డిగిపారేశారు.

క‌ట్ చేస్తే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇప్పుడు అతి భారీ ప్రాజెక్ట్ పోల‌వ‌రంలో సింగిల్ టెండ‌ర్ తో మేఘా మీద మ‌న‌సు ప‌డిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏకంగా రివ‌ర్స్ ని ప‌క్క‌న పెట్టి కాంట్రాక్ట్ ఖాయం చేసేసింది. పైగా తానిచ్చిన జీవో తానే అతిక్ర‌మించి ఖ‌రారు చేసింది. అంతేగాకుండా 700కోట్ల త‌క్కువ‌కు టెండ‌ర్ వేశారంటూ ప్ర‌తిఫ‌లింగా ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌లోనూ ఆ సంస్థ‌కు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదంతా ఆరు నెల‌ల క్రితం వ‌ర‌కూ అవినీతికి పాల్ప‌డింద‌ని ఆరోపించిన సంస్థ‌కే కావ‌డం విస్మ‌య‌క‌రం. విశేషం.

అదే స‌మ‌యంలో మేఘా సంస్థ‌ని మొన‌గాడు అంటూ కీర్తించిన చంద్ర‌బాబు అండ్ కో ఇప్పుడు రివ‌ర్స్ గేర్ వేసింది. పెద్ద అవినీతి జ‌రుగుతోందంటూ గ‌గ్గోలు పెడుతోంది. మొన్న‌టి వ‌ర‌కూ స‌న్మానాలు చేసి, శాలువాలు క‌ప్పి ఇప్పుడు హ‌ఠాత్తుగా ఇలా మారిపోయారాంటా అని మీకు అనుమానం రావ‌చ్చు గానీ అధికారం అటూ ఇటూ కావ‌డంతో వారి తీరు కూడా ఇటుది అటు, అటుది ఇటుగా మారిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలంగాణాలో కూడా అదే తీరులో ఉంది. కాంగ్రెస్ హయంలో కీల‌క ప్రాజెక్టులు ద‌క్కించుకున్న‌ప్పుడు మేఘాని మెచ్చుకున్న నేత‌లే ఇప్పుడు టీఆర్ఎస్ పాల‌న‌లో తిడుతున్నారు. అప్పుడు ఆంధ్రా వ‌ల‌స కాంట్రాక్ట‌ర్లు అంటూ విమ‌ర్శ‌లు గుప్పించిన కేసీఆర్ ఇప్పుడు త‌న నోటితోనే కాళేశ్వ‌రం సిద్ధించ‌డంలో మేఘా పాత్ర మామూలుగా లేదంటున్నారు.

ఏమ‌యినా ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లోనూ మేఘా సంస్థ ప్ర‌భుత్వాల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌డంలో ప్ర‌ద‌ర్శిస్తున్న నేర్ప‌రిత‌నం ఆశ్చ‌ర్య‌క‌రంగా క‌నిపిస్తోంది. ఆ..అలాంటిదేమీ లేదు..అంతా స‌మ‌ర్పించుకోవ‌డంలోనే ఉంటుంద‌ని మీరు అనుకుంటే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here