త‌ప్పు వాళ్ల‌ది…త‌ల‌వంపులు స‌ర్కారుకి!

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాల‌ను మీడియా సంస్థ‌ల య‌జ‌మానులే శాసిస్తుంటార‌న్న‌ది చాలాకాలంగా ఉన్న అభిప్రాయం. దానికి అద్దంప‌డుతోంది వర్త‌మాన వాస్తవం. తాజాగా ఏపీలో గ్రామ స‌చివాల‌యాల పేరుతో సుమారుగా 2ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి ఏర్పాట్లు చేశారు. కానీ తీరా ఫ‌లితాలు వ‌చ్చే స‌మ‌యానికి అభ్య‌ర్థులు, సామాన్యుల్లో అపోహ‌లు పెంచే రీతిలో మీడియా క‌థ‌నాలు రావ‌డంతో వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకోవాల్సి వ‌స్తోంది. ప‌గ‌డ్భందీగా, ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ఫ‌లితాలు విడుద‌ల చేసి, పోస్టుల నియామ‌కాలు పూర్తి చేస్తున్నందున ద‌క్కాల్సిన క్రెడిట్ తాజా ప‌రిణామాల‌తో చేజారిపోతుంద‌నే సందేహాలు అధికార వ‌ర్గాల్లో బ‌ల‌ప‌డుతోంది.

ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త ఏపీపీఎస్సీది. దానికి చైర్మ‌న్ గా ఉన్న ఉద‌య్ భాస్క‌ర్ ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే నియ‌మించింది. ఆయ‌న్ని జ‌గ‌న్ స‌ర్కారు కూడా కొన‌సాగిస్తోంది. వాస్త‌వానికి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న వారిని విధుల నుంచి తొల‌గించ‌డం ఏపీపీఎస్సీ యంత్రాంగం చేయాల్సిన బాధ్య‌త‌. కానీ ఈసారి అలా జ‌ర‌గ‌లేదు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అనిత‌మ్మ అనే టాప్ ర్యాంక‌ర్ తో పాటు ప‌లువురు అభ్య‌ర్థుల బందువులు కూడా కీల‌క స్థానాల్లో ఉన్నారు. అంటే పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో భాగ‌స్వామ్యం అవుతూ, ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. అది అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తోంది. అందుకు ముందుగా ఆమెను బాధ్య‌త‌ల నుంచి తొల‌గించాల్సిన ఏపీపీఎస్సీ చేసిన త‌ప్పిదం.

కానీ ఇప్పుడు ఏపీపీఎస్సీ త‌ప్పిద‌మే ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకుంది. ఉద్యోగాలు ద‌క్కిన 1.25 ల‌క్ష‌ల మంది ఆనంద‌ప‌డుతుంటే మిగిలిన 18ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల్లో సందేహాలు వినిపిస్తున్నాయి. దాంతో జ‌గ‌న్ స‌ర్కారుకి ఈ ప‌రిణామాలు మింగుడుప‌డ‌డం లేదు. వైసీపీలోని కొంద‌రు నేత‌లు ఈ వ్య‌వ‌హారంలో కీల‌క‌పాత్ర‌ధారుల‌ను ప్ర‌చారం సాగుతున్న‌ప్ప‌టికీ దానికి కూడా ఏపీపీఎస్సీ ఇన్ సైడ్ నుంచి స‌హ‌కారం ఉండాల్సిందే అన‌డంలో సందేహం లేదు. ఏమ‌యినా ఈ ప‌రిణామాల‌తో ప్ర‌భుత్వం ఆశించిన‌ది ద‌క్క‌క‌పోగా, ప్ర‌తిప‌క్షం కోరుకున్న రీతిలో మీడియా చేసిన ప్ర‌య‌త్నం ఫలించింద‌నే చెప్ప‌వ‌చ్చు. పైగా ఈ విష‌యాన్ని గ‌ట్టిగా కౌంట‌ర్ చేయ‌డంలో అధికార‌ప‌క్షం అల‌స‌త్వం కూడా అందుకు మ‌రో కార‌ణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here