పేట‌లో హీటు రాజుకుంటోంది..

0

వైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీలో విబేధాలు ఓ రీతిలో ఉంటాయి. పాల‌క‌ప‌క్షంలో త‌గాదాలు, ఆధిప‌త్యం కోసం సాగించే ప్ర‌య‌త్నాలు తార స్థాయికి చేరుతుంటాయి. తాజాగా చిల‌క‌లూరిపేట సీన్ అదే విధంగా క‌నిపిస్తోంది. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ కి, సీనియ‌ర్ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి మ‌ధ్య విబేధాలు ఇప్పుడు పార్టీకి ఇక్క‌ట్లు తెచ్చేలా క‌నిపిస్తున్నాయి.

ప్ర‌త్తిపాటి పుల్లారావుకి బ‌ల‌మైన సీటుగా ఉన్న చిల‌క‌లూరిపేట‌లో విడ‌ద‌ల ర‌జ‌నీ ఓ ర‌కంగా సంచ‌ల‌నం సృష్టించారు. ఆమెకు జ‌గ‌న్ హ‌వా బాగా తోడ్ప‌డింది. అయితే ఇప్పుడు అనుభ‌వం లేక‌పోవ‌డం, దూకుడు స్వ‌భావం కావ‌డంతో విడ‌ద‌ల ర‌జనీ వేగంగా ముందుకెళ్లాల‌ని చూస్తున్నారు. కానీ వాస్త‌వానికి పార్టీలో అంద‌రినీ క‌లుపుకుని పోవాలనే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆమెతో విబేధిస్తున్న నేత‌లంతా ఒక్క‌ట‌వుతున్నారు. ఎమ్మెల్యే తీరుని అధిష్టానం దృష్టికి తీసుకెళుతూనే స్థానికంగా ఆమెను చికాకు పెట్టే ప‌నుల‌కు పూనుకుంటున్నారు.

రాజ‌కీయంగా ఇది ఆస‌క్తిక‌రంగా మారుతోంది. వైసీపీ క్యాడ‌ర్ లో మాత్రం అయోమ‌యం, ఆందోళ‌న క‌లిగిస్తోంది. చివ‌ర‌కు ఆమె స్వ‌యంగా రంగంలో దిగి ఈ ప‌రిణామాల మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మ‌రింత హీటు రాజేసేలా ఉన్నాయి. ‘చిలకలూరిపేటకు పట్టిన పీడను వదిలించాలని, పేటకోటపై వాలిన అవినీతి గద్దలను తరిమివేయాలని జగనన్న స్థాపించిన వైసీపీలో చేరి పోటీచేశా.. ఎన్నో దుష్టశక్తులు నా కలలను చిదిమివేయాలని చూశాయి.. నా పోరాటాన్ని ఆపేయాలని పన్నాగాలు పన్నినా.. నిజాయితీవుంటే విజయం సాధిస్తామని మొన్నటి ఎన్నికలు నిరూపించాయి’ అంటూ వ్యాఖ్యానిస్తూనే నాలుగు నెలలక్రితమే గెలుపు రుచిచూసినా ఏరోజూ ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేదన్నారు. ప్రతిపక్ష పార్టీతోనూ, మాజీ మంత్రితో ఎందాకైనా పోరాడవచ్చు. వారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదని, మీకు అన్నీ తెలుసన్నారు.‘ఆడపిల్లనైన నేను నాలుగువైపుల నుంచి శత్రువులతో యుద్ధంచేయాల్సివస్తోంది. సొంతపార్టీలోని కొందరు నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా అనుకున్నవాళ్ళు సైతం నన్ను అడ్డుకోవాలని, నియంత్రించాలని చూస్తున్నారు’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు

ఈ కామెంట్స్ తో ఇప్పుడు ఎమ్మెల్యే ర‌జ‌నీ కాక రేపార‌ని చెప్ప‌వ‌చ్చు. కౌంట‌ర్ గా అస‌మ్మ‌తి నేత‌లు ఏమి చేస్తార‌న్న‌దే చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here