ప్రియాంక రెడ్డి కేసులో నిందితుల‌ను ఏం చేయాలి?

  0

  ఇదే చ‌ర్చ సాగుతోంది. ర‌క‌ర‌కాల వాద‌నలు వినిపిస్తున్నాయి. ఈసారి ఏకంగా నిందితుల‌ను శిక్షించాల‌ని జ‌నం రోడ్డెక్కారు. షాద్ న‌గ‌ర్ పీఎస్ ముందు ఆందోళ‌న కూడా చేశారు. ఉరితీయాల‌ని, ఎన్ కౌంట‌ర్ చేయాల‌నే డిమాండ్స్ ప్ర‌బ‌లంగా వినిపిస్తున్నాయి. అయితే మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు అస‌లైన ప‌రిష్కారం ఏంట‌న్న‌దే అస‌లు ప్ర‌శ్న‌. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల ప‌శువుల క‌న్నా హీనంగా ప్ర‌వ‌ర్తిస్తున్న వారిని క‌ట్ట‌డి చేయ‌కుండా ఎంత క‌ఠినంగా శిక్ష‌లు విధించినా ఏమి ఒరిగేనో అన్న‌ది మాత్రం అంతుబ‌ట్ట‌కుండా ఉంది.

  డాక్టర్ ప్రియాంకా రెడ్డి పై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్లు చాలామంది చేస్తున్నారు. ఎన్కౌంటర్ డిమాండ్ చేయడం అంటే ఆవేశపూరిత ప్రతీకారం ప్రదర్శించడం మాత్రమే అన్న‌ది కాద‌న‌లేని స‌త్యం. గతంలోనూ ఇలాంటి నేరం చేసిన వారిపై పోలీసులు ఎన్కౌంటర్లో సమాధానం చెప్పిన ఉదంతం మనం చూశాం. ఆ తర్వాత ఆడవారిపై దాడులు పసి పిల్లలపై అఘాయిత్యాలు జరగడం తగ్గిపోయిందా? అన్న‌ది కూడా ప‌రిశీలించాలి.

  బాధితురాలి దగ్గరి బంధువుల వల్లనో.. వారి ఇంటి పరిసర ప్రాంతాల్లోనో … నిర్మానుష్య ప్రాంతాల్లోనో జరిగితే పోలీసులకు అక్కడకు వచ్చి నివారించే అవకాశం లేదులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ తాజా ఘ‌ట‌న‌లు అలా కాదు. ప్రియాంక రెడ్డి పై జరిగిన అఘాయిత్యం రోడ్డుపై ఉన్న మహిళ పై జరిగిందన్న విషయం మనం మర్చిపోవద్దు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె దగ్గరికి లారీ డ్రైవర్లు వచ్చారే కానీ పోలీసులు ఎందుకు రాలేదు.. ఏమైనా సహాయం కావాలా అని ఎందుకు అడగలేదు.? పోలీసుల నిఘా/ అప్రమత్తత అంటే అర్థం ఏంటి? టోల్ ప్లాజా కి 60 మీట‌ర్ల దూరంలో కూడా సీసీ కెమెరాలు ఏం చెబుతున్నాయి..

  షి టీమ్స్ అనేవి ఇలాంటి ఘటనలకు సంబంధం లేని బృందాలా?.. ఫోన్ చేసి పోకిరిని పట్టిస్తే తీసుకుపోవడం మాత్రమే వాళ్ళ డ్యూటీ నా? పోలీసుల నిఘా తో పాటు… షీ టీమ్స్ నిర్వహించాల్సిన మరికొన్ని బాధ్యతలపై కూడా రివ్యూ చేయాల్సిన సందర్భం ఇది కాదా..క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని ఈ న‌లుగురు అనాగ‌రికుల‌ను అంతం చేస్తే అస‌లు స‌మ‌స్య తీరిపోతుందా.. సామాజిక వైఫ‌ల్యాల‌ను మ‌నం విస్మ‌రిద్దామా..త‌ల్లిదండ్రులుగా, సోద‌రులుగా, స‌మాజంలో పౌరులుగా మ‌న‌మంతా ఎవ‌రి బాధ్య‌త‌ను వారు మ‌ర‌చిపోదామా.. వ్య‌వ‌స్థీకృత లోపాల‌ను అంగీక‌రించ‌కుండా, వాటిని స‌రిచేయ‌కుండా, ఏ కొంద‌రినో శిక్షించి చేతులు దులుపుకుందామా అన్న‌ది కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి నిందితుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించ‌కుండా, ఇలాంటి చ‌ర్య‌లు పున‌రావృతం కాకుండా ఎంత ప‌గ‌డ్భందీ చ‌ర్య‌లు అవ‌స‌ర‌మో అన్న‌ది ఓసారి ప‌రిశీలిద్దాం.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here