ప‌త్రికా రంగంలోకి టీవీ9 యాజ‌మాన్యం!

0
Back view of a young man watching a big TV panel

తెలుగు మీడియాలో ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తున్న మై హోమ్స్ గ్రూప్ చేతుల్లోకి ఇప్ప‌టికే రెండు ప్ర‌ధాన చానెళ్లు చేరిపోయాయి. అందులో ఒక‌టి టీవీ9. రెండోది 10టీవీ. శ్రీనిరాజు చేతుల్లోంచి టీవీ9 టేకోవ‌ర్ చేసిన క్ర‌మంలో ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్ ద్వారా కొంత వివాదాస్ప‌దం అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం పూర్తిగా మైహోమ్స్, మేఘా కాంబినేష‌న్ లోకి ఈ చానెల్ వ‌చ్చేసింది. అదే స‌మ‌యంలో క‌మ్యూనిస్టు శ్రేయోభిలాషుల చానెల్ , తెలుగులో మొట్ట‌మొద‌టి కోఆప‌రేటివ్ విధానంలో ఆవిర్భ‌వించిన 10టీవీ కూడా ఏడాది క్రిత‌మే కొత్త మేనేజ్ మెంట్ చేతుల్లోకి మారిపోయింది.

వాటితో పాటుగా ఎన్టీవీ, టీవీ5లో కూడా భాగ‌స్వామ్యం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. ఈలోగానే ప్రింట్ మీడియాలో అడుగుపెట్టేందుకు వేగంగా పావులు క‌దుపుతున్నారు. అందుకు స‌న్నాహాలు కూడా షురూ అయ్యాయి. త్వ‌ర‌లోనే తెలుగులో మ‌రో పత్రిక పురుడు పోసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఉన్న ప్ర‌ధాన ప‌త్రిక‌లే తీవ్రంగా ఆప‌సోపాలు ప‌డుతున్న త‌రుణంలో మ‌రో ప‌త్రిక ముందుకు రావ‌డం విశేషంగానే క‌నిపిస్తోంది.

అయితే ఉభ‌య తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి, త‌ద్వారా త‌మ పారిశ్రామిక అవ‌స‌రాలు తీర్చుకునేందుకు అనుగుణంగా పావులు క‌ద‌పాల‌ని ఆశిస్తున్న యాజ‌మాన్యం త‌మ ప‌త్రిక‌కు ప్ర‌భంజ‌నం అనే పేరుని ప‌రిశీలిస్తోంద‌ని చెబుతున్నారు. ఇంకా మ‌రికొన్ని టైటిల్స్ కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నప్ప‌టికీ రెండు తెలుగు రాష్ట్రాల‌కు అనుగుణంగా ఉండేందుకు ఇలాంటి పేరుతోనే మందుకురావ‌చ్చ‌ని మీడియా వ‌ర్గాల్లో సాగుతున్న ప్ర‌చారం. అందుకు అనుగుణంగానే నియామ‌కాల ప్ర‌క్రియ కు కూడా శ్రీకారం చుట్టిన‌ట్టు చెబుతున్నారు.

గ‌తంలో సంఘీ సంస్థ‌ల నుంచి కూడా ఇదే రీతిలో భారీగా వ‌చ్చిన వార్త ఆ త‌ర్వాత తెలుగు పాఠ‌కుల‌కు దూరం అయిపోయింది. ఇక ఈ బ‌డా బిజినెస్ గ్రూప్ నుంచి రాబోతున్న ప‌త్రిక ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here