ప‌’వార్’ అప్పుడే ప్రారంభ‌మ‌య్యింది..!

  0

  ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌పై ప‌డింది. చివ‌రి నిమిషంలో సీన్ లోకి వ‌చ్చి చ‌క్రం తిప్పిన క‌మ‌ల‌నాధుల చాక‌చ‌క్యం చూసి విప‌క్షాలు అవాక్క‌యితే, సామాన్యులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. త‌గిన బ‌లం లేకపోయినా ఎన్సీపీ లో అజిత్ ప‌వార్ అండ చూసుకుని బీజేపీ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా..లేక పేల‌వంగా ముగుస్తుందా అనేది కొద్దిరోజుల్లో తేల‌బోతోంది. అయితే అజిత్ ప‌వార్, శ‌ర‌ద్ ప‌వార్ మ‌ధ్య విబేధాలు ఇప్పుడు ర‌చ్చ‌కెక్క‌డంతో ఎన్సీపీ భ‌విత‌వ్యం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బాబాయ్ శ‌ర‌ద్ ప‌వార్ అడుగుజాడ‌ల్లో రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన అబ్బాయ్ అజిత్ ప‌వార్ ఇప్పుడు ఆధిప‌త్యం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నం ఆధారంగానే బీజేపీ ప్ర‌భుత్వ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంది.

  ప్ర‌స్తుతానికి అజిత్ ప‌వార్ ప‌రిస్థితి అయోమ‌యంగా క‌నిపిస్తోంది. ఆయ‌న వెంట క‌నీసం డ‌జ‌ను మంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ బాట ప‌ట్ట‌లేదు. చివ‌ర‌కు ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో వెంట ఉన్న ఎమ్మెల్యే కూడా శ‌ర‌ద్ ప‌వార్ చెంత‌న చేరిపోయారు. దాంతో అజిత్ హ‌వా సాగుతుందా లేక శ‌ర‌ద్ ప‌వార్ చ‌క్రం తిప్పుతారా అన్న‌ది చూడాలి. అయితే 1979లో తొలిసారిగా ముఖ్య‌మంత్రి కావ‌డానికి కాంగ్రెస్ (ఐ) నుంచి జ‌నతాపార్టీతో చేతులు క‌లిపిన శ‌ర‌ద్ ప‌వార్ త‌ర‌హాలోనే ఇప్పుడు అజిత్ ప‌వార్ కూడా ఎన్సీపీ నుంచి బీజేపీతో జ‌త‌గ‌ట్టి డిప్యూటీ సీఎం కాగ‌లిగార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది.

  ప‌వార్ ల మ‌ధ్య ఈ ప‌వ‌ర్ గేమ్ ఈనాటిది కాద‌ని తెలుస్తోంది. గ‌డిచిన నాలుగైదేళ్లుగా ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు కొన‌సాగుతున్న‌ట్టు ఎన్సీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా శ‌ర‌ద్ ప‌వార్ కుమార్తె సుప్రియ సూలే ఆధిప‌త్యం అజిత్ కి అస‌లు గిట్ట‌డం లేద‌ని భావిస్తున్నారు. యూపీఏ స‌ర్కార్ కాలం నుంచి సుప్రియ హ‌వా సాగుతుండ‌డం గిట్ట‌ని అజిత్ చివ‌ర‌కు మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల్లో త‌న‌యుడు పార్థ్ ప‌వార్ ని బ‌రిలో నిలిపారు. కానీ ఆయ‌న మావాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓట‌మి పాల‌య్యారు. ఈ ఓట‌మికి శ‌ర‌ద్ ప‌వార్ కార‌ణ‌మ‌నే అభిప్రాయానికి వ‌చ్చిన అజిత్ నాటి నుంచి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని ఎదురుచూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి అనుగుణంగా బీజేపీ ఉచ్చులో చిక్కుకుని శ‌ర‌ద్ ప‌వార్ స్థాపించిన పార్టీని చీల్చ‌డానికి సైతం సిద్ధ‌ప‌డిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అయినా అజిత్ త‌గిన ప‌ట్టు దొర‌క్కపోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.

  బీజేపీ పెద్ద‌లు ఎత్తులు వేసి శివ‌సేన‌ను చీల్చ‌డం గానీ, ఇత‌ర మార్గాల్లో ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ‌పెట్టే ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతం కాలేక‌పోతే తాజాగా కొలువుదీరిన స‌ర్కారు కొన‌సాగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఎన్సీపీ నుంచి ఆశించిన సంఖ్య‌లో ఎమ్మెల్యేలు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గిపోతున్న త‌రుణంలో బీజేపీ నేత‌ల వ్యూహాల‌పైనే ఇప్పుడు భ‌విత‌వ్యం ఆధారప‌డి ఉంటుంది. అందుకే ఇప్పుడు అంద‌రికన్నా ఈ ప‌రిస్థితి అజిత్ ప‌వార్ కి క‌ఠిన ప‌రీక్ష‌గా మారుతోంది. దాదాపుగా ఆయ‌న చేతుల్లోంచి ఎన్సీపీ చేజారిపోయిన‌ట్టు క‌నిపిస్తున్న త‌రుణంలో బాబాయ్ పై పై చేయి కోసం వేసిన ఎత్తులు ఏమేర‌కు లాభిస్తాయో చూడాలి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here