బాబాయ్-అబ్బాయ్ గేమ్: ‘మ‌హా’రంజుగా రాజ‌కీయం

0

త‌న అన్న కుమారుడు మాత్ర‌మే కాకుండా ఇన్నాళ్లుగా త‌న రాజ‌కీయాల‌కు వార‌సుడిగా ఉన్న అజిత్ ప‌వార్ నిర్ణ‌యంతో శ‌ర‌ద్ ప‌వార్ ఖంగుతిన్నారు. మ‌హారాష్ట్ర ప‌రిణామాల్లో కీల‌కంగా మారిన ఎన్సీపీ వ్య‌వ‌హారం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. బాబాయ్- అబ్బాయ్ మ‌ధ్య దోబూచులాట నిజంగానే సాగుతోందా లేక రాజ‌కీయ దొంగాట ఆడుతున్నారా అనే అనుమానాలు క‌లిగిస్తోంది.

ఇటీవ‌లే శ‌ర‌ద్ ప‌వార్ మోడీతో భేటీ అయ్యారు. ఆసంద‌ర్భంగానే మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో క‌లిసి ప‌నిచేయ‌డంపై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ శ‌ర‌ద్ ప‌వార్ వాటిని తోసిపుచ్చారు. తాను రాజ‌కీయాలు మాట్లాడ‌లేద‌నే బ‌య‌ట‌కు చెప్పారు. అది జ‌రిగిన నాలుగురోజుల‌కు అనూహ్యంగా అర్థ‌రాత్రి నిర్ణ‌యాలు మారిపోయాయి. అజిత్ ప‌వార్ ఏకంగా బీజేపీ సీఎంతో క‌లిసి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. తొలిసారిగా ఎన్సీపీ , బీజేపీ ప్ర‌భుత్వానికి పునాది వేశారు. దానిని అజిత్ వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం అంటున్న శ‌ర‌ద్ ఏకంగా పార్టీనుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంత‌టితో స‌రిపెట్టుకోకుండా ఉద్ద‌వ్ ఠాక్రేతో క‌లిసి మీడియా ముందుకు వ‌చ్చారు. నిజ‌మైన ఎన్సీపీ నాయ‌కుడు గానీ, కార్య‌క‌ర్త ఎవ‌రైనా బీజేపీతో చేతులు క‌ల‌పాల‌ని కోరుకోరంటూ వ్యాఖ్యానించారు. త‌మ కూట‌మికి 174 మంది మ‌ద్ధ‌తు ఉంద‌ని తెలిపారు. బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య విరుద్ధ‌మ‌ని వ్యాఖ్యానించారు.

అదే స‌మ‌యంలో ఎన్సీపీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు పూనుకున్నారు. అజిత్ పవార్ కి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఎన్సీపీ వ్య‌వ‌హారాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆపార్టీలో చీలిక వ‌స్తుందా అనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. శివ‌సేన‌తో క‌లిసి సాగేందుకు మొగ్గు చూప‌ని ఎన్సీపీ వ‌ర్గం అజిత్ ప‌వార్ వెంట ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. బీజేపీతో క‌ల‌వ‌డానికి ససేమీరా అంటున్న వారిని శ‌ర‌ద్ ప‌వార్ ఏం చేస్తార‌న్న‌దే చ‌ర్చ‌నీయాంశం. అదే స‌మ‌యంలో శివ‌సేన ను కూడా చీల్చాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీతో క‌ల‌వ‌డాన్ని స‌హించ‌ని వారిని త‌న‌వైపు తిప్పుకునే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు మ‌రింత రంజుగా మారాయి. చివ‌ర‌కు పీఠం మీద ఎవ‌రుంటారో..బ‌లిప‌శువుగా ఎవ‌రు మిగులుతారో అన్న‌ది ప‌వార్ పార్టీ తేల్చ‌బోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here