బాబు ఇంటిపై దృష్టి పెట్టి..సొంతింటిని చ‌క్క‌దిద్దులేక‌!

0

ఏపీ సీఎం జ‌గ‌న్ కి అనూహ్య‌మైన అవ‌కాశం వ‌చ్చింది. ఎదురులేని మెజార్టీతో ఆయ‌న ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా పార్టీని, ప్ర‌భుత్వాన్ని న‌డిపించే సువ‌ర్ణ అవ‌కాశం ద‌క్కించుకున్నారు. కానీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో ఆయ‌న స‌క్సెస్ అవుతారా లేదా అన్న సందేహాలు మొద‌ల‌వుతున్నాయి. ముఖ్యంగా టేకాఫ్ స‌మ‌యంగా భావించే తొలి వంద రోజుల జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మొద‌ల‌యిన అసంతృప్తి మ‌రింత రాజుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దాని తాకిడి ఇప్ప‌టికే వైసీపీ నేత‌ల‌కు చేరింది. విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌లువురు ఎమ్మెల్యేలు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్న తీరు ఈ ప‌రిస్థితికి అద్దంప‌డుతోంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం నాలుగు నెల‌లు నిండుతున్న‌ప్ప‌టికీ ఇంకా ట్రాక్ లో ప‌డ‌లేదు. పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత జ‌గ‌న్ పెద్ద‌గా ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. కీల‌కాంశాల‌లో వైప‌ల్యం ప్ర‌భుత్వానికి పెద్ద చిక్కులు తెచ్చేలా ఉంది. ఇసుక స‌మ‌స్య అందులో ఒక‌టి. ఈనెల 5 నాటి నుంచి కొత్త ఇసుక విధానం అమ‌లులోకి వ‌చ్చినా ఇంకా స‌మ‌స్య తీరిన దాఖ‌లాలే లేవు. పైగా స్టాక్ పాయింట్లు అరకొర‌గా ఏర్పాటు చేశారు. కృష్ణా, గోదావ‌రి వ‌ర‌ద‌లు కూడా ఆటంకంగా మారాయి. అదే స‌మ‌యంలో ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉండ‌డంతో అంద‌రూ ఆందోళ‌న చెందుతున్నారు. దాంతో ఈ ప‌రిణామాలు ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకొస్తున్నా జ‌గ‌న్ త‌గిన రీతిలో స్పందించ‌క‌పోవ‌డం విస్మ‌య‌కరంగా క‌నిపిస్తోంది.

ఇదే రీతిలో అనేక ముఖ్య‌మైన విష‌యాల్లో జ‌గ‌న్ వేచి చూసే ధోర‌ణిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. పోలవ‌రం ప‌నులు న‌వంబ‌ర్ నుంచి ప్రారంభిస్తామ‌ని ముందుగా చెప్పిన‌ప్ప‌టికీ అమ‌రావ‌తి విష‌యంలో మాత్రం ముఖ్య‌మంత్రి నోరుమెద‌ప‌క‌పోవ‌డం ప్ర‌జ‌ల్లో అపోహ‌లు పెంచుతోంది. అన్నింటికీ మించి చంద్రబాబు ఇంటి మీద దృష్టి కేంద్రీక‌రించి సొంత ఇంటిని చ‌క్క‌దిద్దుకోవ‌డానికి శ్ర‌ద్ధ చూప‌లేక‌పోతున్నార‌నే అభిప్రాయం కొందరు ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తోంది.

కృష్ణా క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత విష‌యంలో ఈ వారం మ‌రోసారి క‌ద‌లిక క‌నిపిస్తోంది. ఇది రాజ‌కీయంగా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినా సామాన్యుడికి సంబంధం లేని అంశం కావ‌డంతో జ‌గ‌న్ కి ఇమేజ్ పెంచే అవ‌కాశం లేదు. అక్ర‌మ క‌ట్ట‌డాల‌న్నీ కూల్చివేస్తే జ‌నం ఆస్వాదిస్తారు. కానీ చంద్ర‌బాబు నివాసం మాత్ర‌మే కూల్చుతాం..గోకరాజు గంగ‌రాజు, మంతెన స‌త్య‌న్నారాయ‌ణ రాజు వంటి వారి జోలికి పోం అంటే మాత్రం చివ‌ర‌కు ఉండ‌వ‌ల్లి ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు కూడా ఆస్వాదించే అవ‌కాశం లేదు.

ఈపరిస్థితుల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల దృష్టి పెడితే మంచిద‌నే స‌ల‌హాలు వినిపిస్తున్నాయి. సంక్షేమం పేరుతో ప‌లువురికి పెద్ద మొత్తంలో పంపిణీల‌కు శ్రీకారం చుడుతున్నప్ప‌టికీ ఇత‌ర స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుండా ఇలాంటి తాయిలాల కార‌ణంగా ప్ర‌జ‌లు సంతృప్తి చెందే అవ‌కాశం ఉండ‌ద‌న్న‌ది అర్థం చేసుకుంటే మంచిదనే వారు క‌నిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here