మోడీ రాజ్: మ‌హారాష్ట్రలో మ‌రిన్ని మ‌లుపులు ఖాయం

  0

  మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో అనిశ్చితి కొత్తదేమీ కాదు. అస్థిర‌త్వం అక్క‌డ ప్ర‌భుత్వాల‌కు అల‌వాటుగా మారింది. ఇన్నేళ్ల చ‌రిత్ర‌లో కేవ‌లం రెండే రెండు ప్ర‌భుత్వాలు పూర్తికాలం పాల‌న సాగించ‌గ‌లిగాయంటేనే మ‌హా రాజ‌కీయం మ‌న‌కు అర్థం అవుతుంది. అందులో ఒక‌టి ఇటీవ‌లే ముగిసిన శివ‌సేన‌-బీజేపీ కూట‌మి న‌డిపిన దేవేంద్ర ఫ‌డ్న‌విస్ ప్ర‌భుత్వ‌మే కావ‌డం మ‌రో విశేషం. అయితే ఇప్ప‌డు మ‌హా గ‌డ్డ మీద మ‌రిన్ని మ‌లుపులు ఖాయంగా క‌నిపిస్తోంది. న‌యా గేమ్ కి అక్క‌డ అంకురార్ప‌ణ జ‌రిగింది. మూడు ద‌శాబ్దాల స్నేహం చెడిన త‌ర్వాత శివ‌సేన‌, బీజేపీ చెరో క్యాంప్ గా మారాయి. క‌లిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీ ఇప్పుడు వేరు కుంప‌టి దిశ‌లో ఉన్నాయి.

  అదే స‌మ‌యంలో శ‌ర‌ద్ ప‌వార్ కార‌ణంగా ప‌వ‌ర్ గేమ్ మారుతోంది. గుజ‌రాత్ గ్యాంగ్ మ‌రాఠ్వాడా మాయానాట‌కంలో ముంద‌డుగు వేయ‌గ‌లిగింది. భూమిపుత్రుల‌మ‌ని చెప్పుకునే శివ‌సేన చావుదెబ్బ తినాల్సి వ‌చ్చింది. కాంగ్రెస్ కోలుకోవ‌డం ప్ర‌శ్నార్థ‌కంగా క‌నిపిస్తోంది. 145 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంటేనే ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌గ‌ల మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 112 మంది మాత్ర‌మే ఎమ్మెల్యేలున్నారు. ఇక ఇండిపెండెంట్లు మ‌రో ఆరుగురు బ‌ల‌ప‌రుస్తున్న‌ట్టు చెబుతున్న త‌రుణంలో ఆపార్టీకి క‌నీసంగా మ‌రో 27 మంది అవ‌స‌రం క‌నిపిస్తోంది. బ‌ల‌నిరూప‌ణ స‌మ‌యంలో కొంద‌రు శివ‌సేన ఎమ్మెల్యేలు చేయూత‌నిచ్చే అవ‌కాశం ఉంద‌నే చెబుతున్న త‌రుణంలో క‌నీసంగా ఎన్సీపీ నుంచి 20 మంది మ‌ద్ధ‌తు అవ‌స‌రం. అది పెద్ద స‌మ‌స్య కాద‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితిని బ‌ట్టి అర్థం అవుతోంది. దాంతో ఫ‌డ్న‌విస్ ప్ర‌భుత్వం కొలువుదీర‌డ‌మే కాకుండా స‌భ‌లో మెజార్టీని సాధించే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది.

  శివ‌సేన భ‌విత‌వ్యానికే ఇప్పుడు ముప్పు ఏర్ప‌డింది. ముఖ్యంగా ఉత్త‌ర‌, మ‌ధ్య మ‌హారాష్ట్ర‌ల్లో మంచి ప‌ట్టున్న పార్టీకి పెద్ద‌న్న అండ లేక‌పోతే ఎలా ఉంటుంద‌న్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌. కేంద్రంలోని ద‌ర్యాప్తు సంస్థ‌ల స‌హాయంతో ప‌వార్ ని దారిలోకి తెచ్చుకున్న మోడీ-షా బృందానికి ఠాక్రే ఉద్ద‌వ్ వ్య‌వ‌హారం మింగుడుప‌డ‌లేద‌ని ప్ర‌చారం సాగుతున్న‌ప్ప‌టికీ వాస్త‌వానికి శివ‌సేన తొలినుంచి బీజేపీకి దూరం జ‌రిగే ఆలోచ‌న చేసింది. ఎన్నిక‌ల ముందు సీట్ల స‌ర్థుబాటులో పీఠ‌ముడి వేసింది. కానీ స్వ‌యంగా అమిత్ షా వెళ్లి న‌డిపిన రాయ‌బారంతో ఆఖ‌రికి మెత్త‌ప‌డింది. ఇక ఫ‌లితాల త‌ర్వాత కూడా శివ‌సేన డిమాండ్ల‌కు త‌లొగ్గి స‌ర్కారు ఏర్పాటు చేయాల‌ని కొంద‌రు బీజేపీ నేత‌లు ఆలోచ‌న చేసిన‌ప్ప‌టికీ మ‌హారాష్ట్ర‌లో తాము బ‌ల‌ప‌డాలంటే శివ‌సేన అడ్డు తొల‌గించుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన బీజేపీ పెద్ద‌లు అందుకు త‌గ్గ‌ట్టుగా బంతిని శివ‌సేన కోర్టులో వేసి ఎదురుచూశారు. చివ‌ర‌కు ఆట త‌మ చేతుల్లోకి రావ‌డంతో శివ‌సేన‌కు చుక్క‌లు చూపించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

  మోడీ హ‌యంలో త‌మ ముందు తోక జాడిస్తే పులిన‌యినా స‌హించేది లేద‌ని చెప్పేందుకు త‌గ్గ‌ట్టుగా మ‌హారాష్ట్ర విష‌యంలో ఆయ‌న స్వ‌యంగా వేలు పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆర్థిక రాజ‌ధానిని త‌మ చేతుల్లోంచి చేజారిపోకుండా చూసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా వేసిన ఎత్తుల్లో ఎన్సీపీ చిక్కుకోవ‌డంతో ఇక విద‌ర్భ‌లో కూడా బీజేపీ త‌న బ్రాండ్ రాజ‌కీయాలు మొద‌లుపెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాలు మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క మార్పుల‌కు దోహ‌దం చేసే అవ‌కాశాలున్నాయి. ఎటు మ‌ళ్లుతాయో చూడాలి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here