మోడీ స‌ర్కారు: యూపీలో అలా..ఏపీలో ఇలా!

0

కేంద్ర ప్ర‌భుత్వ తీరు రెండు నాలుక‌ల ధోర‌ణిని త‌ల‌పిస్తోంది. ఏపీ ప్ర‌భుత్వానికి అడ్డుక‌ట్ట వేసిన మోడీ ప్ర‌భుత్వ‌మే యూపీలో యోగికి అవ‌కాశం ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అయిన వాళ్ల‌కు ఆకుల్లో అన్న‌ట్టుగా సొంత పార్టీ ప్ర‌భుత్వానికి స్వేచ్ఛ నిస్తూ మ‌రో ప్ర‌భుత్వానికి మాత్రం మోకాలు అడ్డుతున్న‌ట్టు భావించే ప‌రిస్థితి వ‌స్తోంది. గ‌తంలో రాష్ట్రాల విభ‌జ‌న విష‌యంలో యూపీలో స‌సేమీరా అంటూ ఏపీలో సై అన్న సంగ‌తి క‌మ‌ల‌నాధుల‌కు అనుభ‌వ‌మే .

అదే రీతిలో ఇప్పుడు ప‌వ‌ర్ ప‌ర్చేజ్ అగ్రిమెంట్స్ (పీపీఏ)ల విష‌యంలో క‌నిపిస్తోంది. పీపీఎల విష‌యంలో పునఃస‌మీక్ష చేస్తాన‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌య‌త్నించారు. కానీ అది దేశ ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం చేకూరుస్తుందంటూ కేంద్రం అడ్డుపుల్ల వేస్తోంది. గ‌త ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల కార‌ణంగా డిస్కంలు న‌ష్టాల పాల‌వుతున్నాయ‌ని, ప్ర‌భుత్వానికి 2వేల కోట్ల మేర‌కు భారం అవుతోంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం వాదిస్తోంది. అయినా మోడీ స‌ర్కారు నుంచి స‌సేమీరా అంటున్న తీరు విస్మ‌య‌క‌రంగా మారుతోంది.

స‌రిగ్గా అదే స‌మ‌యంలో యూపీలో ఆదిత్యానాథ్ స‌ర్కార్ మాత్రం పీపీఏల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో అఖిలేష్ యాద‌వ్ స‌ర్కారు చేసుకున్న ఒప్పందాల నుంచి విర‌మించుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఎన్టీపీసీకి కాంట్రాక్ట్ ఇచ్చి పాత కంపెనీతో ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఏపీ ప్ర‌భుత్వం అదే ప‌ని చేస్తే దేశంలో విద్యుత్ కంపెనీల న‌మ్మ‌కాన్ని కోల్పోతామ‌ని, అంత‌ర్జాతీయంగానూ న‌ష్ట‌దాయ‌కం అని చెబుతున్న ప్ర‌భుత్వం యూపీలో ఎలా అంగీక‌రించింద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారుతోంది.

కేంద్ర ఇంధ‌న మంత్రిత్వ శాఖ నుంచి ప‌లుమార్లు ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాశారు. పీపీఏల నుంచి వెన‌క్కి త‌గ్గ‌డానికి నిరాక‌రిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. కానీ యూపీలో అనుమ‌తించి ఏపీలో మాత్రం నిరాక‌రించ‌డం కేంద్రప్ర‌భుత్వ తీరుకి అద్దంప‌డుతోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి ఆర్కే సింగ్ గ‌తంలో రాసిన లేఖ‌ల్లో జ‌గ‌న్ స‌ర్కారుపై ఒత్తిడి పెంచేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు గ‌మ‌నిస్తే బీజేపీ ప్ర‌భుత్వం అస‌లు భాగోతం అర్థం చేసుకోవ‌చ్చ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here