రంగులు మార్చుతున్న తెలుగు మీడియా

0

తెలుగునాట కొన్నేళ్లుగా ఎల్లో మీడియా హ‌వా అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల మీడియాలోకి తొలుత సాక్షి ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి , ఆ త‌ర్వాత టీ న్యూస్, న‌మ‌స్తే తెలంగాణా పేరుతో కేసీఆర్ రంగ ప్ర‌వేశం చేయ‌డంతో కొంత‌వ‌ర‌కూ సీన్ మారింది. తాజాగా టీవీ9, 10టీవీ వంటి వాటిని మైహోమ్స్, మేఘా కాంబినేష‌న్ లో కొనుగోలు చేయ‌డంతో మొత్తం రివ‌ర్స్ అయిపోయింది. ఈలోగా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మి త‌ర్వాత ప‌రిస్థితి త‌ల్ల‌కిందుల‌య్యింది.

ఇప్పుడు ఎల్లోమీడియా ప‌రిస్థితి విల‌విల్లాడాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా చంద్ర‌బాబు పాల‌నాకాలంలో చ‌క్రం తిప్పిన రామోజీరావు, రాధాకృష్ణ వంటి వారికి ఊపిరిస‌ల‌ప‌డం లేదు. ఈ నేప‌థ్యంలో గ‌తంలో వైఎస్ మ‌యంలో కూడా బీజేపీ చ‌లువ‌తో గ‌ట్టెక్కిన రామోజీరావు మ‌ళ్లీ కాషాయ క్యాంప్ కి చేరువ‌యిన‌ట్టు కనిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఏబీఎన్ రాధాకృష్ణ కూడా త‌న రంగు మార్చుకోవ‌డం మేల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.

తాజాగా రాధాకృష్ణ నేరుగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. త్వ‌ర‌లో పూర్తిస్థాయి రాజ‌కీయ నేత‌గా ఎదిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న రాధాకృష్ణ ప‌సుపు కండువా కాకుండా కాషాయ కండువా క‌ప్పుకుంటార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది జ‌రుగుతుందా లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే త‌న మీడియా వ్య‌వ‌హారాల్లో మాత్రం కొంత రంగు సంత‌రించుకోవ‌డం ఖాయ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎల్లో మీడియా కాస్తా త్వ‌ర‌లో సాఫ్రాన్ రంగు పులుముకునే అవ‌కాశం సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే రామోజీరావుకి బీజేపీ బంధం ఉండ‌గా, ఇప్పుడు రాధాకృష్ణ ఆ క్యాంపులో చేరారు. త్వ‌ర‌లో టీవీ5 బీఆర్ నాయుడు కూడా పూర్తి కాషాయ‌ధారి కాబోతున్న‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో టీవీ5 కాషాయ గూటి స్వ‌రం వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో తెలుగు మీడియాలో కూడా బీజేపీ వేళ్లూనుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌ను పింక్ మీడియాగా చెప్పుకుంటున్న కేసీఆర్ సొంత సంస్థ‌లు, జ‌గ‌న్ మీడియా ఎలా ఎదుర్కొంటాయో ఆస‌క్తిక‌రంగానే చెప్ప‌వ‌చ్చు. తెలుగు మీడియాలో రంగులు మారుతున్న వారి కార‌ణంగా స‌మ‌రం కొత్త పుంత‌లు తొక్క‌డం ఖాయమ‌నే అంచ‌నాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here