రెండు వారాల త‌ర్వ‌త ప‌వ‌న్ ఏం చేస్తారో తెలుసా?

0

ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ మార్చ్ ముగిసింది. ఊహించిన దానికంటే ఎక్కువ మందే అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. ఏపీలో గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా, త‌ర‌లించాల్సిన అవ‌స‌రం లేకుండా తండోప‌తండాలుగా అభిమాన‌జ‌నం త‌ర‌లివ‌చ్చే ఏకైక నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాజ‌కీయంగా దాని ప్ర‌భావం ఎంత‌మేర‌కు అన్న‌ది ప‌క్క‌న పెడితే ఎక్క‌డ స‌భ నిర్వ‌హించినా స‌క్సెస్ ఫుల్ గా సంద‌డి క‌నిపిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. రెండో చోట్ల ఓడిపోయి, ఒక్క సీటు మాత్ర‌మే గెలిపించుకోగ‌లిగిన పార్టీ అధినేత నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి అంత పెద్ద సంఖ్య‌లో యువ‌త త‌ర‌లిరావ‌డం దానికి నిద‌ర్శ‌నం.

అనుకున్న‌ట్టేగా ప‌వ‌న్ లాంగ్ మార్చ్ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. గ‌తంలో ధ‌వ‌ళేశ్వ‌రం అనుభ‌వ‌మే పున‌రావృతం అయ్యింది. కారు మీద నిల‌బ‌డి, అంద‌రికీ అభివాదం చేస్తూ కార్య‌క్ర‌మం ముందుకు సాగింది. ఆ త‌ర్వాత స‌భ‌లో తెలుగుదేశం నేత‌ల‌తో క‌లిసి ప‌వ‌న్ మ‌ళ్లీ వేదిక పంచుకోవ‌డం రాజ‌కీయ మార్పుల‌కు సంకేతం. త్వ‌ర‌లో జ‌ట్టుక‌ట్టడానికి బీజం ప‌డింద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. అదే స‌మ‌యంలో మోడీతో త‌న స్నేహం గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌డం, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు చెప్ప‌డం ద్వారా క‌మ‌లంతో మ‌ళ్లీ చేతులు క‌ల‌ప‌డానికి కుతూహులంతా ఉన్నార‌నే సంకేతాన్ని జ‌న‌సేనాని ఇచ్చారు.

స‌హ‌జ‌ధోరణిలోనే స‌మ‌స్య క‌న్నా వైసీపీ విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పేందుకు ప‌వ‌న్ ఎక్కువ ప్ర‌ధాన్య‌త‌నిచ్చారు. ఇది జ‌న‌సేన అధినేత ప్ర‌ధాన బ‌ల‌హీన‌త‌గా చెప్ప‌వ‌చ్చు. నాయ‌కుడు త‌న మీద విమ‌ర్శ‌ల‌ను ఖాత‌రు చేయ‌కుండా ముందుకెళ్లాలి. కౌంట‌ర్ ఇవ్వ‌డానికి కొంద‌రు అనుచ‌రులు సిద్ధంగా ఉండాలి. కానీ జ‌న‌సేన‌లో అంతా తానై, అప్పుడప్పుడూ మాత్ర‌మే నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్న‌ట్టుగా ఉన్న రాజ‌కీయ సెట‌ప్ తో ప‌వ‌న్ త‌న మీద విమ‌ర్శ‌ల‌ను స‌భ‌లో ప్ర‌స్తావించి త‌న తీరు కొన‌సాగిస్తున్న‌ట్టు చాటుకున్నారు. ద‌త్త‌పుత్రుడు అంటున్నార‌ని ఆయ‌న మూడు సార్లు ప్ర‌స్తావించ‌డంతో వైసీపీ వాద‌నకు బ‌లం చేకూరింద‌నే చెప్ప‌వ‌చ్చు. చేత‌ల ద్వారా విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టాల్సిన స్థాయిలో ఉండి, తాట తీస్తాన‌నే మాట‌లు ఉప‌యోగించ‌డం ద్వారా ప‌రిణతి లేమి ప్ర‌ద‌ర్శించారు. పైగా త‌న‌ను అభిమానులు కూడా న‌మ్మ‌లేద‌ని , వైసీపీకే ఓటు వేశార‌ని బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌క‌టించి రాజ‌కీయ అవివేకం పూర్తిగా తొల‌గ‌లేద‌ని నిరూపించుకున్నారు.

సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డం క‌న్నా అభిమానుల‌ను అర‌లించ‌డానికే అన్న‌ట్టుగా కొన‌సాగుతున్న ప‌వ‌న్ తీరు విశాఖ‌లో మ‌రోసారి ప్ర‌స్ఫుటం అయ్యింది. అది రాజ‌కీయంగా ప్ర‌చారం తెచ్చినా ఫ‌లితాన్నివ్వ‌ద‌న్న‌ది ఆయ‌న‌కు ఇంకా అర్థం కావాల్సి ఉంది. అమ‌రావ‌తి వీధుల్లో తాను న‌డుస్తాన‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత విస్మ‌య‌క‌రంగా ఉన్నాయి. అన్నింటికీ మించి రెండు వారాల గ‌డువుతో ఆయ‌న పెట్టిన డిమాండ్లు ఆశ్చ‌ర్యం క‌లిగించాయి. ఇసుక కొర‌త క్ర‌మంగా త‌గ్గుతున్న త‌రుణంలో లాంగ్ మార్చ్ కార్య‌క్ర‌మం చేప‌ట్టి 36 మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులు మ‌రణించిన‌ట్టు, వారికి న‌ష్ట‌ప‌రిహారంతో పాటుగా, ఒక్కో కార్మికుడికి 50వేలు చెల్లించాల‌ని ఆయ‌న చేసిన డిమాండ్ స‌హేతుక‌త మీద సందేహాలు క‌నిపిస్తున్నాయి. ఏమ‌యినా రెండు వారాల గ‌డువు ఇచ్చిన ప‌వ‌న్ ఆ త‌ర్వాత ఏదో చేస్తార‌ని ఊహించ‌డం భావ్యం కాద‌ని, గ‌తంలో ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌ను ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. ముఖ్యంగా అనంత‌పురం క‌రువు మీద ప్ర‌త్యేక రైలు వేసుకుని ఢిల్లీ వెళ‌దామ‌ని బ‌హిరంగ స‌భ‌లో చెప్పిన జ‌న‌సేనాని ఆ త‌ర్వాత దానిని మ‌ర‌చిపోయిన విష‌యం గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అంతేన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. చూడాలి ఏం చేస్తారో మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here