తెలుగు మీడియా: వైఎస్ కి భిన్నంగా జ‌గ‌న్

1

ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల్లో త‌న తండ్రి వైఎస్ బాట‌లో వెళ్లేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. రాజ‌న్న రాజ్యం త‌న ల‌క్ష్యం అని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ మీడియా వ్య‌వ‌హారాల్లో మాత్రం వైఎస్సార్ కి భిన్నంగా జ‌గ‌న్ తీరు క‌నిపిస్తోంది. మీడియాకు జ‌గ‌న్ దాదాపుగా దూరంగా ఉంటున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఆయ‌న సొంత గ‌డ్డ‌పై నేటికీ మీడియా ముందు పెద‌వి విప్ప‌లేదు. కేవ‌లం ఢిల్లీలో తొలి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్రెస్ మీట్ మిన‌హా ఒక్క‌సారి కూడా పాత్రికేయుల స‌మావేశానికి సిద్ధ‌ప‌డ‌లేదు.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించేవారు. ఆయ‌న జిల్లాల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా మీడియా స‌మావేశాలు నిర్వ‌హించేవారు. ముఖ్య‌మంత్రి హోదాలో స‌చివాలయంలో ప‌లు ప్రెస్ మీట్లలో మాట్లాడేవారు. కానీ జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి మాత్రం అంతుబ‌ట్ట‌కుండా ఉంది. ప్ర‌తిప‌క్ష నేత‌గా కూడా సొంత మీడియా మిన‌హా పెద్ద‌గా ఇత‌ర మీడియా సంస్థ‌ల‌కు జ‌గ‌న్ స‌మ‌యం ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డేవారు కాదు. కానీ పాదయాత్ర‌లో మాత్రం ఆయ‌న ప‌లు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసుకుని మాట్లాడారు. చివ‌రి వివిధ చానెళ్ల‌తో విడిగానూ మాట్లాడారు. అయితే ముఖ్య‌మంత్రిగా దానికి కూడా సిద్ధ‌ప‌డ‌లేదు.

అప్ప‌ట్లో వైఎస్సార్ కి హైద‌రాబాద్ తో పాటుగా ఎక్క‌డికి వెళ్లినా క‌నీసం ప‌ది మంది జ‌ర్న‌లిస్టుల‌ను పేరు పెట్టి పిలిచేటంత సాన్నిహిత్యం ఉండేది. మీడియాతో ఆయ‌న సంబంధాలు ఆ స్థాయిలో ఉండేవి. కానీ జ‌గ‌న్ కి కేవ‌లం సాక్షి ప్ర‌తినిధుల్లో కొంద‌రు త‌ప్ప ఇత‌ర మీడియా సంస్థ‌లకు చెందిన విలేక‌రుల‌ను గుర్తించగ‌లిగే ప‌రిస్థితి ఉంటుందా అంటే అనుమాన‌మేన‌నే అభిప్రాయం వినిపిస్తోంది. అప్ప‌ట్లో ఆ రెండు ప‌త్రిక‌లు అంటూనే వైఎస్సార్ అందరితో స‌ఖ్య‌త‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నించ‌గా, ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం దానికి భిన్నంగా సాగుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలుగు మీడియాతోనే కాకుండా జాతీయ మీడియాకి కూడా జ‌గ‌న్ ప్రాధాన్యం త‌గ్గించేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుల‌కు ప‌ద‌వులు కేటాయింపులో కూడా జ‌గ‌న్ తీరు అలానే ఉంది. వైఎస్సార్ మాదిరి న‌మ్మినోళ్ల‌కే ప‌దవులు ఇస్తున్న‌ప్ప‌టికీ రాష్ట్ర స్థాయిలో ప్ర‌భావితం చూప‌గ‌ల‌వారిని పెద్దాయ‌న ఎంచుకుంటే, జ‌గ‌న్ మాత్రం అందుకు భిన్నంగా త‌న జిల్లాకే చెందిన వారిని ప్రెస్ అకాడ‌మీకి ఎంపిక చేశారు. తెలంగాణాకి చెందిన జీవీడి, దేవుల‌ప‌ల్లి అమ‌ర్, రామ‌చంద్ర‌మూర్తి వంటి వారికి పిలిచి ప‌ద‌వులు ఇచ్చిన జ‌గ‌న్ ప్రెస్ అకాడ‌మీ విష‌యంలో మాత్రం సొంత రాష్ట్రానికే చెందిన సొంత జిల్లా వాసిని ఎంపికి చేశారు. దేవిరెడ్డి శ్రీనాధ‌రెడ్డి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అయిన‌ప్ప‌టికీ, ఆయ‌న విప‌క్షంలో జ‌గ‌న్ కి అండ‌గా ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రంలో ప‌లువురు జ‌ర్న‌లిస్టుల‌కు ప‌రిచ‌యం లేని పేరుగా ఉంది. గత ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్లంద‌రూ రాష్ట్ర‌వ్యాప్తంగా చిర‌ప‌రిచితులు కాగా, శ్రీనాధ్ రెడ్డి అందుకు భిన్న‌మైన వ్య‌క్తిగా ఉన్నారు. ఈ విష‌యంలో కూడా జ‌గ‌న్ తీరు విశేషంగానే క‌నిపిస్తోంది.

1 COMMENT

Leave a Reply to Suresh Cancel reply

Please enter your comment!
Please enter your name here