వైఎస్ విజ‌య‌మ్మ ట్ర‌స్ట్ ఎందుకు మూత‌ప‌డిందో తెలుసా?

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ల్లి, వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ పేరు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. గ‌త కొన్నేళ్లుగా ఆమె రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉన్నారు. కానీ గ‌డిచిన ఎన్నిక‌ల్లో త‌న‌యుడి త‌రుపున విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ తెర‌మ‌రుగ‌య్యారు.

అయితే తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ఎన్జీవోల మీద చ‌ర్య‌లు తీసుకుంది. అందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణాలో కూడా విదేశీ సంస్థ‌ల నుంచి నిధులు పొందుతున్న ప‌లు ఎన్జీవోల‌ను ర‌ద్దు చేసింది. అదే స‌మ‌యంలో ఆదాయ‌పు ప‌న్ను వివ‌రాల‌ను స‌క్ర‌మంగా స‌మ‌ర్పించ‌క‌పోయిన నేప‌థ్యంలో చ‌ర్య‌లు తీసుకున్నారు. వాటిలో వైఎస్ విజ‌య‌మ్మ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ కూడా ఉండ‌డంతో విజ‌య‌మ్మ పేరు మ‌ళ్లీ మారుమ్రోగుతోంది. ఇది జ‌గ‌న్ దేన‌ని, త‌ల్లి పేరుతో న‌డుపుతున్నార‌ని కొంద‌రు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు.

కానీ వాస్త‌వానికి ఈ ట్ర‌స్ట్ కి వైఎస్ విజ‌య‌మ్మ‌కు ఎటువంటి సంబంధం క‌నిపించ‌డం లేదు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు అడ్ర‌స్ తో 2012లో రిజిస్టర్డ్ అయి ఉన్న ఈ ట్ర‌స్ట్ నిర్వాహ‌కుల జాబితాలో చీఫ్ ఫంక్ష‌న‌రీగా ఏ వీర‌భ‌ద్రావ‌తి పేరు ఉంది. సెక్ర‌ట‌రీగా వై బాబూరావు, ట్రెజ‌ర‌ర్ గా ఏ మాధురి ఉన్నారు. త‌ణుకు ఎన్జీవో కాల‌నీ అడ్ర‌స్ తో రిజిస్ట‌ర్ అయి ఉండ‌డం విశేషం. దాంతో జ‌గ‌న్ కుటుంబానికి సంబంధం లేకుండా ఆయ‌న త‌ల్లిపేరుతో రిజిస్ట‌ర్ అయి ఉన్న సంస్థ కావ‌డంతో రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఈ ట్ర‌స్ట్ గ‌డిచిన ఏడు సంవ‌త్స‌రాలుగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలు ఏమిట‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here