వైసీపీలో ముదురుతున్న విబేధాలు

0

ఏపీలో అధికార పార్టీలో అసంతృప్తి సెగ‌లు మొద‌ల‌వుతున్నాయి. ఆధిప‌త్య పోరుతో అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వ‌ర్గ‌పోరు త‌ప్ప‌డం లేదు. ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ అధినేత పూర్తిగా ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌కే ప‌రిమితం కావ‌డంతో ప‌రిస్థితి చ‌క్క‌దిద్దే నాథుడే క‌నిపించ‌డం లేదు. దాంతో వైసీపీలో వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఉన్న‌ప్ప‌టికీ అన్ని వ్య‌వ‌హారాల్లోనూ సీనియ‌ర్ నేత‌, మంత్రి సోద‌రుడు, జిల్లా కేంద్ర ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు జోక్యం చేసుకుంటున్నార‌నే అబిప్రాయం వినిపిస్తోంది. దాంతో స్పీక‌ర్ త‌మ్మినేని స‌హా ప‌లువురు నేత‌లు అసంతృప్తితో క‌నిపిస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య వ‌ర్గ‌పోరు బాహాటంగానే క‌నిపిస్తోంది. ఆధిప‌త్యం కోసం వారు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌తో జిల్లాలో వైసీపీ రెండు శిబిరాలుగా మారిపోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

విశాఖ‌లో మంత్రి అవంతి శ్రీనివాస్ ధోర‌ణి మీద ప‌లువురు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఇటీవ‌ల ద్రోణంరాజు శ్రీనివాస్ నేరుగా బ‌హిరంగ‌స‌భ‌లోనే మంత్రికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇక తూర్పులో మంత్రి క‌న్న‌బాబు, డిప్యూటీసీఎం బోస్ మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. అదే స‌మ‌యంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వ్య‌వ‌హారంలో అంతా తామై అన్న‌ట్టుగా జ‌క్కంపూడి కుటుంబం వ్య‌వ‌హారించ‌డాన్ని ఈ ఇద్ద‌రు మంత్రులు జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్టు తెలుస్తోంది.

ప‌శ్చిమ‌లో కూడా దాదాపు అదే ప‌రిస్థితి. మంత్రి తానేటి వ‌నిత‌ను ఇత‌ర నేత‌లు ఖాత‌రు చేయ‌డం లేద‌ని చెబుతున్నారు. విజ‌య‌వాడ‌లో మంత్రి వెల్లంప‌ల్లికి, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకి మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. గుంటూరు జిల్లా ప‌ల్నాడులో జూనియ‌ర్ ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డికి, సీనియ‌ర్ పిన్నెల్లికి మ‌ధ్య పొడ‌సూపక‌పోవ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. చిల‌క‌లూరిపేట సీన్ రోడ్డెక్క‌తున్నట్టుగా క‌నిపిస్తోంది. ప్ర‌కాశం జిల్లాలో బాలినేని, వైవీ వ‌ర్గాల మ‌ధ్య చాలాకాలంగా విబేధాలున్నాయి. నేటికీ కొన‌సాగుతున్నాయి

నెల్లూరు వ్య‌వ‌హారం కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి బ‌య‌ట‌పెట్టారు. కాకాణి తీరు మీద ఆయ‌న విరుచుకుప‌డిన తీరు పార్టీ ప‌రిస్థితికి అద్దంప‌డుతోంది. ఇలా కోస్తా జిల్లాల‌తో పాటుగా రాయ‌ల‌సీమ‌లో కూడా విబేధాలున్న‌ట్టు చెబుతున్నారు. ఆపార్టీ అధినేత వీటిపై దృష్టి సారించ‌క‌పోతే చినికిచినికి గాలివాన‌లా మారే ప్ర‌మాదం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here