వైసీపీ అస‌లు రాజ‌ధాని స్వ‌రూపం ఇదే!

0

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంపై వైసీపీ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఆపార్టీ నేత‌ల మాట‌లు పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపుతున్నాయి. తొలుత మంత్రి బొత్సా స‌త్యనారాయణ‌, ఆవెంట‌నే వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌లు విస్తృత చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

అనూహ్యంగా అమ‌రావ‌తి అంశాన్ని బొత్సా తెర‌మీద‌కు తీసుకురావ‌డం వెనుక అధికార పార్టీ వ్యూహం ఉంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ద్విముఖ వ్యూహాంతో వైసీపీ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి అమ‌రావ‌తి రాజ‌ధాని న‌గ‌రంగా కొన‌సాగుతుంద‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దే తేల్చిచెప్పారు. ఎన్నిక‌ల ముందు, త‌ర్వాత అసెంబ్లీలో కూడా సీఎం హోదాలో ఆయ‌న తేల్చి చెప్పిన త‌ర్వాత మార్పు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు.

అయితే అనూహ్యంగా బొత్సా, విజ‌య‌సాయి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా అమ‌రావ‌తి పేరు మీదుగా చంద్ర‌బాబు ఎంపిక ఎంత లోప‌భూయిష్ట‌మో ప్ర‌జ‌ల‌కు చాటిచెప్పే వ్యూహం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందులోనూ వ‌ర‌ద బాధితుల పేరుతో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ఈ విష‌యం తెర‌మీద‌కు తీసుకురావ‌డం ద్వారా చంద్ర‌బాబు యాత్ర‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి, త‌మ కామెంట్స్ ని హైలెట్ చేసే ప‌థ‌కం వేస్తున్నారా అన్న సందేహం క‌లుగుతోంది. అదే అయితే గ‌నుక అధికార పార్టీ ప‌థ‌క ర‌చ‌న పారిన‌ట్టే చెప్ప‌వ‌చ్చు

అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల అభిప్రాయం కూడా తెలుసుకునే ల‌క్ష్యంతో ప‌లుమార్లు పాల‌క‌ప‌క్ష నేత‌లు ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఓ చిన్న లీక్ ఇవ్వ‌డం, ప్ర‌జ‌ల మూడ్ ని గ‌మ‌నించ‌డం, ఆ త‌ర్వాత త‌మ‌కు ఏది అనువుగా ఉంద‌నుకుంటే అటువైపు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం చాలాకాలంగా ప్ర‌భుత్వ పెద్ద‌లు అవ‌లంభించే ప‌ద్ధ‌తి. ఈసారి వైసీపీ కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే చేసిన‌ట్టుగా స్ప‌ష్టం అవుతోంది. అందుకు అనుగుణంగానే సీఎం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా ఇలాంటి ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా స్ప‌ష్టం అవుతోంది.

వాస్త‌వానికి అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టత‌కు వ‌చ్చిన‌ట్టు స‌న్నిహితుల స‌మాచారం. రైతుల భూముల్లో అత్య‌ధిక భాగం వెన‌క్కి ఇచ్చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టికే కార్య‌క‌లాపాలు సాగుతున్న మేర‌కు రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించి, త‌ద్వారా రైతుల‌కు న్యాయం చేశార‌నే అభిప్రాయం క‌లిగించ‌డం, రాజ‌ధాని పూర్తి చేశార‌నే ప్ర‌చారం సాగించాల‌ని భావిస్తున్నట్టు భోగ‌ట్టా. పెద్ద ప్రాజెక్ట్ నెత్తిన పెట్టుకుని, ఏదీ పూర్తిచేయ‌లేక‌, చివ‌ర‌కు ఏమీ కాలేద‌ని అనిపించుకోవ‌డం క‌న్నా రాజ‌ధానిలో అవ‌స‌ర‌మైన వివిధ కార్యాల‌యాల‌ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌లో వికేంద్రీక‌ర‌ణ చేయ‌డం ద్వారా అంద‌రి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్టు క‌నిపించాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే తాజాగా అమ‌రావ‌తిలో త‌న వ్యూహాన్ని వైసీపీ అమలులోకి తెచ్చిన‌ట్టు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here