వైసీపీ గేట్లు ఎత్తేసిందా..?

  0

  ఏపీలో అధికార పార్టీ తీరు ఇలాంటి అనుమానాల‌కు తావిస్తోంది. గేట్లు ఎత్తేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కూ ప‌గ‌డ్భందీగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం దానికి భిన్నంగా సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. భ‌విష్య‌త్తుని దృష్టిలో పెట్టుకుని ప‌లువురు నేత‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇత‌ర పార్టీల నేత‌లు ఒక్కొక్క‌రుగా పాల‌క‌ప‌క్షంలో చేరే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌నే అభిప్రాయాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

  ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీ సాధించిన అఖండ మెజార్టీతో అంద‌రి చూపు ఆపార్టీ వైపు మ‌ళ్లింది. ముఖ్యంగా కుదేల‌యిన టీడీపీ నేత‌లు అనేక మంది వైసీపీలోకి జంప్ చేయాల‌ని భావించారు. కానీ వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌సేమీరా అన్నారు. ష‌రతులు విధించారు. ఈ విష‌యాన్ని ఆయన అసెంబ్లీలోనే ప్ర‌క‌టించారు. తాము గేట్లు ఎత్తితే చంద్ర‌బాబు క్యాంపులో ఎవ‌రూ మిగ‌ల‌రంటూ ఎద్దేవా చేశారు. గెలిచిన వారు పార్టీలోకి రావాలంటూ రాజీనామా చేయాల‌నే కండీష‌న్ అప్లై అవుతుంద‌ని తేల్చేశారు. అంతేగాకుండా ఓడిన నేత‌ల‌ను కూడా చేర్చుకోవడానికి ఆయ‌న సిద్ధంగా ఉన్న‌ట్టు క‌నిపించ‌లేదు.

  ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. తాజాగా అనకాప‌ల్లి ఎంపీ సీటు నుంచి మొన్న‌టి ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగిన అడారి ఆనంద్ వైసీపీ చేర‌బోతున్నారు. ఆయ‌న‌తో పాటుగా విశాఖ డెయిరీ పాల‌క‌వ‌ర్గం కూడా ప‌సుపు కండువాను వదిలి వైసీపీ కండువా క‌ప్పుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అన‌కాప‌ల్లి ప్రాంతంలో సుదీర్ఘ‌కాలంగా టీడీపీకి అండ‌గా ఉన్న అడారి తుల‌సీరావు కుటుంబం వైసీపీలో చేరుతుండ‌డం పాల‌క‌ప‌క్షానికి మ‌రింత బ‌లాన్నిచ్చే అంశం. సామాజికంగానూ మేలు చేసే విష‌యంగాచెబుతున్నారు. య‌ల‌మంచ‌లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో టీడీపీ కి క‌ష్ట‌కాలం దాపురించిన‌ట్టుగా ప‌లువురు చెబుతున్నారు.

  ఇక తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌త్తిపాడు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌యిన వ‌రుపుల రాజా కూడా దాదాపుగా వైసీపీ దారిలో ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఆయ‌న కూడా టీడీపీకి రాజీనామా ప్ర‌క‌టించారు. దాంతో కీల‌క‌మైన సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌ను వైసీపీలో చేర్చుకునేందుకు అధిష్టానం త‌లుపులు తెర‌వ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా ఇదో ఆస‌క్తిక‌ర విష‌యంగానే చెప్పాలి. గెలిచిన‌, ఓడిన అభ్య‌ర్థులిద్ద‌రూ ఒకే గొడుగు కింద‌కు చేరుతున్న త‌రుణంలో వైసీపీ వ్య‌వ‌హారాలు ఎటు ప‌రిణ‌మిస్తాయ‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే. అదే స‌మ‌యంలో అధికార పార్టీ గేట్లు ఎత్తేస్తున్న త‌రుణంలో విప‌క్షానికి ఇంకెన్ని వికెట్లు రాలిపోతాయో అన్న విష‌యం ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here