వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌ర్వాత వారే..!

0

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి ఫిరాయింపులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. టీడీపీ టికెట్ మీద గెలిచి ఆరు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే సొంత పార్టీకి సెల‌వు చెప్పేశారు. ప్ర‌స్తుతానికి రాజ‌కీయాల‌కు దూరం అవుతాన‌ని చంద్ర‌బాబుకి వాట్సాప్ సందేశంలో చెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డానికి ముహూర్తం ఖ‌రారు చేసుకునే ప‌నిలో ఉన్నారు. ఈ వారంలోనే ఆ వ్య‌వ‌హారం ముగుస్తుంద‌ని వంశీ అనుచ‌రులు బాహాటంగానే చెబుతున్నారు.

వ‌ల్ల‌భ‌నేని వంశీని పార్టీ మార‌కుండా చూడడానికి చంద్ర‌బాబు తీవ్రంగా శ్ర‌మించారు. గ‌తంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకుంటున్న స‌మ‌యంలో నాటి ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ప‌డ్డ శ్ర‌మ ఇప్పుడు చంద్ర‌బాబుకి అనుభ‌వంలోకి వ‌చ్చిన‌ట్టు చెప్ప‌వ‌చ్చు. అయినా బాబు ప్ర‌య‌త్నాలు ఫలించ‌లేదు. రాయ‌బారాలు రివ‌ర్స్ అయ్యాయి. కేశినేని నాని, కొన‌క‌ళ్ల నారాయ‌ణ ఎంత చెప్పినా, వంశీ మాత్రం మెత్త‌ప‌డ‌క‌పోవ‌డంతో టీడీపీ నుంచి ఫ‌స్ట్ వికెట్ రాల‌డం ఖ‌రార‌య్యింది.

ఇక ఇప్పుడు వంశీ త‌ర్వాత ఎవ‌రు అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. ముఖ్యంగా వంశీ కన్నా ముందే సైకిల్ దిగేయాల‌ని చాలామంది ప్ర‌య‌త్నించారు. అలాంటి వారిలో క‌మ‌లంతో ట‌చ్ లోకి వెళ్లిన గంటా శ్రీనివాస‌రావు. అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వంటి వారితో పాటు వైసీపీ క్యాంప్ కి ట‌చ్ లో ఉన్న గొట్టిపాటి ర‌వి వంటి వారు కూడా ఉన్నారు. కాషాయ కూట‌మిలో త‌మ‌కు సుర‌క్షితం కాద‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత ఇలాంటి అనేక మంది దాదాపుగా వైసీపీ వైపు దృష్టి మ‌ళ్లించినట్టు పొలిటిక‌ల్ వ‌ర్గాల స‌మాచారం. దాంతో పైన పేర్కొన్న కొంద‌రు నేత‌ల‌తో పాటు విశాఖ న‌గరానికి చెందిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు, ప్ర‌కాశం జిల్లా నుంచి ఇద్ద‌రు పార్టీ మారేందుకు స‌న్నాహాల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

మొత్తంగా వంశీ ఎపిసోడ్ ముగియ‌గానే అలాంటి 8మంది నేత‌లు అసెంబ్లీలో త‌మ‌ను ప్ర‌త్యేక గ్రూపుగా గుర్తించ‌మ‌ని స్పీక‌ర్ ని కోరే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలున్నాయి. వారికి తోడుగా జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కూడా క‌లుస్తార‌ని స‌మాచారం. మొత్తం 9మంది ఎమ్మెల్యేలు ప్ర‌త్యేక గ్రూపుగా మారితే అసెంబ్లీలో విప‌క్షానికి కొత్త ఇర‌కాటం అవుతుంద‌ని ప‌రిశీల‌కుల అభిప్రాయం. నిజంగా అదే రీతిలో బాబుకి దూరంగా జ‌రిగి, ప్ర‌త్యేక వ‌ర్గంగా అధికార‌పార్టీకి అనుబంధం అయిపోతారా లేక నేరుగా కండువాలు మార్చేసుకుని ఉప ఎన్నిక‌ల వేడి రాజేస్తారా అన్న‌దే ప్ర‌స్తుతానికి అస్ప‌ష్టంగా ఉన్న విష‌యం. మొత్తంగా టీడీపీకి పెద్ద స్థాయిలో గండిప‌డ‌బోతున్న త‌రుణంలో ఆపార్టీకి మ‌రిన్ని ఇక్క‌ట్లు త‌ప్ప‌వ‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here