సాక్షి ముందుకే..

0
sakshi
sakhsi tv ratings

మీడియా, రాజకీయాలు మిళితం అయిపోయిన వాస్తవం కాదనలేం. ఇంకా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా ఏదీ ఉండదు అన్నట్టుగానే మీడియా కూడా రాజకీయ సంబంధితమే. అందుకు తగ్గట్టుగానే తాజా పరిణామాలున్నాయి. తెలుగు నేల మీద రాజకీయ ప్రభావాలు మొన్నటి సాధారణ ఎన్నికల తర్వాత సమూలంగా మారిపోయాయి. పూర్తిగా టీడీపీకి అననుకూల వాతావరణం కనిపిస్తోంది.

తెలుగు మీడియాలో కూడా ఈ పరిస్థితి దర్పణం పడుతోంది. టీడీపీకి సానుకూలంగా ఉన్న సంస్థలకు ప్రతికూల పరిస్థితులు దాపురిస్తున్నాయి. కొన్నేళ్లుగా తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఉన్న మీడియా సంస్థల అధినేతలకు ఈ పరిణామాలు మింగుడుపడడం లేదు. అయినా ప్రజాభిప్రాయం మన్నించక తప్పదు అన్నట్టుగా ఉంది పరిస్థితి.

అదే సమయంలో మీడియాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైెఎస్ జగన్ కి మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. ఆయన సొంత మీడియా సంస్థ సాక్షి కి ఇప్పుడు పూర్తి సానుకూలత ఉంది. సాక్షి చానెల్ బార్క్ రేటింగ్స్ లో ముందుకు రావడం, సాక్షి ఆన్ లైన్ మీడియాకు అలెక్సా రేటింగ్స్ లో ఆదరణ కనిపిస్తుండడం, యూ ట్యూబ్ లో సాక్షి వీక్షకుల సంఖ్య అనూహ్యంగా పెరగడం దానికి ఉదాహరణలు. చాలాకాలం తర్వాత టీవీ రేటింగ్స్ లో సాక్షి రెండో స్థానంలో స్థిరంగా కనిపిస్తోంది. గడిచిన ఐదు వారాలుగా నిలకడగా ఉండడం విశేషం.

ప్రస్తుతం ముందుకు దూసుకెళుతున్న సాక్షి మీడియా దానికి తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీవీ9 మైహోమ్స్, మేఘా సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ అక్కడి నిర్వాహకుల్లో దాదాపుగా పాత యాజమాన్యం నుంచి వచ్చిన వారే కాబట్టి జగన్ కి వెంటనే ఒనగూరేదేమీ ఉండకపోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి నేరుగానూ, ఈటీవీ జాగ్రత్తగానూ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే పనిలో నిత్యం ఉంటాయి. మిగిలిన సంస్థల్లో టీవీ5 కూడా బీజేపీ వాయిస్ వినిపించేందుకు సంసిద్ధమవుతున్న వేళ ఎన్టీవీ ఎప్పటికప్పుడే అన్నట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సాక్షి సామర్థ్యం పెంచుకోకపోతే జగన్ వాణీ వినిపించే అవకాశాలు తగ్గిపోతాయి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు, పాలకపక్షంలో ఉన్నప్పుడు దానికి విరుద్ధంగా ఉంటుందనే వాస్తవాన్ని సాక్షి నిర్వాహకులు, జగన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మీడియాలో సాగుతున్న ప్రచారం చివరకు ప్రజలను ప్రభావితం చేసేందుకు ఓ కారణంగా మారే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here