సాయిరెడ్డి తీరు మార్చుకోక‌పోతే..!

0

ఏపీ రాజ‌కీయాల్లో అత్యంత వేగంగా నెంబ‌ర్ టూ స్థానానికి ఎదిగిన నేత‌ల్లో వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ముఖ్యులు. గ‌తంలో ఎన్టీఆర్ హ‌యంలో చంద్ర‌బాబు మ‌ఖ్య భూమిక పోషించారు. క‌ర్ష‌క ప‌రిష‌త్ చైర్మ‌న్ పేరుతో చ‌క్రం తిప్పేందుకు ప్ర‌య‌త్నించారు. కీల‌క శాఖ‌ల‌న్నీ త‌న క‌నుస‌న్న‌ల్లో కార్య‌కలాపాలు సాగించేలా ప్ర‌య‌త్నించారు. కానీ చివ‌ర‌కు అది బెడిసికొట్టింది. అయినా అప్ప‌టికే మంత్రి ప‌ద‌వి కూడా అనుభ‌వించిన చంద్ర‌బాబు నెంబ‌ర్ టూ కావ‌డం పెద్ద విశేషం ఏమీ కాదు.

విజ‌యసాయి రెడ్డి మాత్రం అలా కాదు. ఆడిట‌ర్ గా జ‌గ‌న్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్ద‌డంలో త‌న సమ‌ర్థ‌త‌ను చాటుకున్న ఆయ‌న జ‌గ‌న్ కేసుల్లో నిందితుడిగానూ జైల్ మేట్ అయ్యారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి 2016లో నేరుగా తెర‌మీద‌కు వ‌చ్చారు. నాటి నుంచి వైసీపీ వ్య‌వ‌హారాల్లో ఆయ‌న‌దే కీల‌క‌పాత్ర అన్న‌ట్టుగా మారింది. జ‌గ‌న్ త‌ర్వాత విజ‌య‌సాయిరెడ్డి నేరుగా సంస్థాగ‌త వ్య‌వ‌హారాల ఇన్ఛార్జ్ పేరుతో పార్టీని న‌డిపించారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ స‌భ్యుడిగా జాతీయ స్థాయిలో ప‌లువురు నేత‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఏపీలో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత వైసీపీ పార్ల‌మెంటరీ పార్టీ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొత్తంగా ఏపీలో పాల‌క‌ప‌క్షంలో ఆయ‌న అన‌ధికార నెంబ‌ర్ టూ గా చెలామ‌ణీ అవుతున్నారు.

కీల‌క‌మైన స్థానానికి ఎదిగిన ఆయ‌న అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతున్నార‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఆయ‌న తీరు మీద విమ‌ర్శ‌లున్నాయి. ముఖ్యంగా ట్వీట్ల‌లో హుందాత‌నం లోపించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ త‌ర్వాత కొంత భాష విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటిస్తున్న‌ప్ప‌టికీ పోస్టింగ్స్ ప‌రంప‌ర‌లో ప‌లుమార్లు స్థాయికి త‌గ్గ‌ట్టుగా క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ కొన‌సాగుతోంది. బుద్ధా వెంక‌న్న లాంటి నాయ‌కుల మీద చేసే వ్యాఖ్య‌లు, ప‌వ‌న్ ప‌ర్స‌న‌ల్ విష‌యాల్లో స్పందించే తీరు ప‌లుమార్లు సామాన్యుల‌కు రుచించ‌డం లేదు. ప‌రిశీల‌కులు సైతం ఈ ప‌రిస్థితి మీద పెద‌వి విరుస్తున్నారు.

జాతీయ స్థాయిలో ఎదుగుతున్న నేత అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తే అంతా హ‌ర్షిస్తారు. ప్ర‌జ‌ల‌లో కూడా మంచి స్పంద‌న వ‌స్తుంది. కానీ దానికి భిన్నంగా అన్నింటికీ స్పందించాల‌నే ఆతృత‌లో అతి సామాన్యుడిలా వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి వారు ఫ్రైడే మ్యాన్ అంటూ ఎగ‌తాళి చేసినా ప్ర‌జ‌ల్లో స్పంద‌న వ‌స్తుంది. ఇంకా అనేక మంది సామాన్య నేత‌లు కూడా విజ‌య‌సాయిరెడ్డి మీద వ్య‌క్తిగ‌తంగా విమర్శ‌లు గుప్పించినా జ‌నంలోకి అవి వెళ్లేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంది. అందుకే వీఎస్సార్ అంటూ వైసీపీ శ్రేణులతో పిలుపించుకుంటున్న ఆపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌రింత హూందాత‌నం ప్ర‌ద‌ర్శించ‌డం అవ‌స‌రం అనిపిస్తోంద‌ని ప్ర‌ముఖ ప‌రిశీల‌కులొక‌రు వ్యాఖ్యానించ‌డం విశేషం. ఇప్ప‌టికే ఇటీవ‌ల విశాఖ‌లో మీడియా ప్ర‌తినిధులు ఆయ‌న వ్యాఖ్య‌ల మీద నిల‌దీయ‌డంతో నీళ్లు న‌మ‌లాల్సి వ‌చ్చింది. అన్నింటికీ ఆధారాలు ఉండ‌వు, మ‌న‌స్సాక్షికి తెలుసు అంటూ ఆయ‌న సరిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇలాంటి ప‌రిస్థితి కొన‌సాగ‌కుండా ఆయ‌న జాగ్ర‌త్త‌లు ప‌డ‌డం మంచిద‌నే సంకేతాల‌ను ఆ ప్రెస్ మీట్ ఇచ్చిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న ధోర‌ణి మార్చుకోకపోతే చివ‌ర‌కు వాటి ప్ర‌భావం జ‌గ‌న్ మీద ప‌డుతుంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here