సైరా: ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి చ‌రిత్ర‌పై భిన్న‌వాద‌న‌ల‌కు ఆధారాల‌తో స‌మాధానం

0

చిరంజీవి “సైరా” సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి తిరుగుబాటు మీద భిన్నమైన వాదనలు, కొందరు ఆయన తిరుగుబాటును తేలికచేస్తూ చర్చలు చేశారు.

ఇప్పుడు జరుగుతునం వాదనలలో ప్రధానమైనవి..
1. ఈస్ట్ ఇండియా కంపని(కుంఫిణీ ) పాలన లో జరిగిన తిరుగుబాట్లను స్వాతంత్ర పోరాటాలుగా గుర్తించలేము
2. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుంఫిణీ మీద తిరగబడ్డ తోలి పాలెగాడు కూడా కాదు.
3. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పోరాటం పింఛన్ కోసమే కానీ కుంఫిణీ మీద తిరుగుబాటు కాదు.
4. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తోలి స్వాతంత్ర పోరాట యోధుడు అనటం చరిత్ర వక్రీకరణ
5. రెడ్డి కాదు బంగారపు కడ్డి నారసింహారెడ్డి … అనే పాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద పాడింది కాదు “సైరా చిన్నపరెడ్డి” మీద పాడింది.

ప్రభుత్వ రికార్డులలో ఉండే చరిత్ర లో సంపూర్ణ సత్యాలు ఉంటాయని ఎవరు నమ్మరు,ముఖ్యంగా చరిత్రకారులు ప్రభుత్వ రికార్డ్స్ లోని విషయాలను యాధాతధంగా తీసుకొని చరిత్రను రాయరు.

1). ఈస్ట్ ఇండియా కంపని(కుంఫిణీ ) పాలన లో జరిగిన తిరుగుబాట్లను స్వాతంత్ర పోరాటాలుగా గుర్తించలేము
ఈ వాదనను టెక్నికల్ గా అంగీకరించటానికి నాకు అభ్యంతరము లేదు. కానీ ఇప్పటికే కొన్ని తరాలు చదువుకున్న ముఖ్యంగా ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలలో చదువుకున్న వీరనారి ఝాన్సీ,తాంతియాతోపే,నానా సాహెబ్ ,సిపాయిల తిరుగుబాటు ను తిరగా రాస్తారా?

చరిత్ర మీద ఆసక్తి ఉన్న వాళ్లల్లో ఎంతమందికి ఈస్ట్ ఇండియా కంపని నుంచి బ్రిటీష్ రాణి పాలన మార్పు సంవత్సరాలు, కారణాలు తెలుసు?తాత్వికంగా ఆలోచిస్తే ఈస్ట్ ఇండియా కంపని ని బ్రిటన్ క్రౌన్ ను ఎందుకు వేరుగా చూడాలి?ఎవరు పాలించిన వారు భారతీయులకు పరాయి వాళ్ళే కదా?ఈస్ట్ ఇండియా కంపని పాలన లేకుండా బ్రిటీష్ పాలన వొచ్చి ఉండేదా?బ్రిటీష్ పాలనకు ప్రపంచ వ్యాప్తంగా సోపానాలు పరిచింది ఈస్ట్ ఇండియా కంపనినే కదా? ఈస్ట్ ఇండియా కంపని మీద స్వతంత్ర పోరాటం,బ్రిటీష్ మీద స్వతంత్ర పోరాటం అని ప్రత్యేకంగా రాసుకున్నామా?

కుంఫిణీ ప్రభుత్వం కాలంలో జరిగిన తిరుగుబాటైన బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో జరిగిన తిరుగుబాటులోనైనా స్వాతంత్రేచ్ఛ ఉన్నదన్న సత్యాన్ని మరువకూడదు,ప్రతి విప్లవానికి వేలాది మంది ప్రజల మద్దతు ఉందన్న విషయాన్ని కూడా విస్మరించకూడదు. నర్సింహారెడ్డి వెనుక 9000 మంది సైనికులు ప్రాణాలకు తెగించి ఎందుకు నిలబడ్డారు?

యీపోద్దిదియా ,రేపు తదియారా ,నరుని ప్రాణమొయి
నీటి మీదను బుగ్గ వంటింది నరుని శరీరంబు
పదరా పదరాా తెల్లవాడ్ని తెగనరుకుదాము …

–ఇందులోతెల్లవాడు కుంఫిణీ ఉద్యోగా ?బ్రిటన్ రాణి భటుడా?అన్నది తిరగబడ్డ సామాన్యులకు అనవసర విషయం.. వాడు పరాయి వాడు అంతే.

2). ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుంఫిణీ మీద తిరగబడ్డ తోలి పాలెగాడు కూడా కాదు.

1955 లో ముద్రితమైన SB Chowdary రచించిన Civil Disturbance during the British Rule in India (1765-1857) పుస్తకం ముందు మాటలో Prof. SP Sarkar ఇలా అన్నారు–

The risings against British authority have often enough been dismissed as outcome of the machinations of a number of dispossessed malcontent personas. But of course the problem is where the following came from and why did people respond to the intrigues of interested parties. It is after all a superficial view of history to remain satisfied with attributing all disturbances to agitators

ఈ పుస్తకం 1765 నుంచి 1857 అంటే మనం చదువుకున్న సిపాయిల తోలి తిరుగుబాటు వరకు జరిగిన పోరాటాల గురించి వివరిస్తుంది. పునాదులు లేని ఏ పోరాటమైనా విజయం సాధించలేదు. భారత్ స్వాతంత్ర పోరాటానికి పునాదులు పడింది పాలెగార్ల పోరాటంతోనే. కట్టబొమ్మన నుంచి నరసింహా రెడ్డి వరకు వారి లక్ష్యాలు ఏవైనా అందరు స్వతంత్ర పోరాటానికి పునాదులు వేసిన వారే.

డాక్టర్ జోలపాలెం మంగమ్మ గారు ఇలా అంటారు ,

Historians have been unkind to the palegars in that they were completely ignored or even when noticed were depicted more as plunders rather than those who fought for freedom of their land. It is only recently that scholars have begun to view the problem of palegahrs as political.

ఇది నిజం .ఝాన్సీ లక్ష్మి భాయి కుంఫిణీ నుంచి భరణం తీసుకున్నారని కుంఫిణీ ప్రభుత్వం లక్ష్మి భాయి కొడుక్కి వారసత్వాన్ని ఇవ్వటానికి తిరష్కరించటంతో తిరుగుగుబాటు చేశారని రాసివుంటే ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి తదితర పాలెగాండ్లు పించదారులు అన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ వారి పోరాటాన్ని పింఛన్ ఆక్రోశం అని ఇప్పుడు కొట్టిపారేసేవాళ్ళు కాదు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి తిరగబడ్డ తొలిపాలెగార్ల వారసుడు. లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఒకే భరణం,ఇనామ్ మరియు మిరాశీ వ్యవస్థల రద్దు తదుపరి రాజ్యసంక్రమణ సిద్ధాంతం (అధికారికంగా 1848లో అమలులోకి వచ్చింది కానీ ముందే కొన్ని సంస్థానాల సంక్రమణ హక్కులను తిరస్కరించారు ) కారణాలతో ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి నోసుమ్ జాగీర్ ను కోల్పోవలసి రావటం, స్థానిక తాశీల్ధారు నోటి దురుసు నరసింహా రెడ్డి తిరుగుబాటుకు కారణాలుగా చూడాలి కానీ 11 రూపాయల 10 పైసల 8 అణాల కోసం నర్సింహారెడ్డి తిరగబడ్డాడు అనటం సహేతుకం కాదు.

చాలామంది నరసింహా రెడ్డి కుంఫిణీ నుంచి భరణం తీసుకోవటం ఇప్పుడే తెలిసినట్లుంది,ద్రిగ్భ్రాంతికి గురయ్యారో లేక సంబరాశ్చర్యాలకు లొనయ్యారో నరసింహారెడ్డి పింఛనుదారుడు అని ఒక్కమాటలో ఆయన తిరుగుబాటును కొట్టిపడేశారు.

నరసింహారెడ్డి వెనుక 9000 మంది సైన్యం ఉందని,ఆయన తిరుగుబాటు కేసులో 901 మందని అందులో 122 మందికి కఠిన శిక్షలు అమలుచేశారన్న విషయం వీరిలో ఎంతమందికి తెలుసు?

నరసింహా రెడ్డి ని ఉరి తీసి శవాన్ని 30 సంవత్సరాల కోట గుమ్మానికి వెలాడతీశారన్న విషయం వలనన్న కుంఫిణీ ప్రభుత్వం నరసింహా రెడ్డి పోరాటాన్ని ఎంత తీవ్రంగా పరిగణించిందో అర్ధం చేసుకోవొచ్చు.మరెవరినైనా ఉరి తీసి సంవత్సరాల తరబడి శవాన్ని వేలాడదీశా రా?

నరసింహా రెడ్డి కుంఫిణీ మీద తిరగబడ్డ తోలి పాలెగారు కాదు మరి 1799-1807 మధ్య తిరగబడ్డ పాలెగాండ్ల చరిత్ర ఎక్కడ లిఖించారు? పాఠ్య పుస్తకాలలో వీరి చరిత్రను ఎందుకు బోధించరు?

3).ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పోరాటం పింఛన్ కోసమే కానీ కుంఫిణీ మీద తిరుగుబాటు కాదు.

అసలు ఇంత తక్కువ పింఛను ఎలా వొచ్చిందో తెలుసుకోవాలి. సంవత్సరానికి 30,000 రూపాయల ఆదాయం ఉన్న ఉయ్యాలవాడ జాగీర్ ను కుంఫిణీ ప్రభుత్వం లాక్కొని ఉయ్యాలవాడ జాగీర్ధార్ పెదమల్లారెడ్డి కుటుంబానికి నెలకు 70 రూపాయల భరణం/పెన్సెన్ ను ఏర్పాటు చేశారు.

పెదమల్లారెడ్డి తమ్ముడు చిన్నమల్లారెడ్డికి 70 రూపాయలలో సగం అంటే 35 రూపాయలు పోగా పెద్దమల్లారెడ్డి ముగ్గురు కొడుకులు నరసింహా రెడ్డి మరియు అతని ఇద్దరు అన్నలకు 35 రూపాయలలో మూడో వంతుగా ఒక్కోక్కరికి 11 రూపాయల 10 పైసల 8 అణాల పెన్సెన్ వొచ్చేది.

నరసింహారెడ్డి ఇద్దరు అన్నలు మొదటి నుంచి కుంఫిణీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. తమ్ముడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటుకు మద్దతుగా నిలవలేదు. కుంఫిణీ పట్ల వీరి భక్తిని గుర్తించి 26-Jun-1847నాడు (అప్పటికే నరసింహా రెడ్డి ఉరి తీయబడ్డాడు) వీరి పింఛన్ను రెట్టింపు చేస్తూ కుంఫిణీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఒక కుటుంబంలో ముగ్గురు సోదరులలో ఇద్దరు కుంఫిణీకి అనుకూలంగా ఉండి పింఛన్ను రెట్టింపు చేసుకోగా తిరగబడ్డ నరసింహారెడ్డిది ఉక్రోషపు ఆరాటం అనటం సమంజసమా?

నరసింహా రెడ్డి కేవలం పింఛన్ మీద ఆధారపడి బతికాడు అన్నది పూర్తి అవాస్తవం. కుంఫిణీ ప్రభుత్వం పాలెగార్ల హక్కులను తొలగించింది,వీటిలో ముఖ్యమైంది శిస్తు వసూలు హక్కు కుంఫిణీ ప్రభుత్వం తీసుకుంది కానీ పాలెగార్ల ఆస్తులన్నింటిని లాక్కోలేదు.

నరసింహా రెడ్డి వద్ద కొన్ని వందల మంది కట్టుబడి బంట్రోతులు, భూమి సాగుదారులు ,కూలీలు ఉండేవారు.కొన్ని వందల ఎకరాల భూమి ఆయన అధీనంలో ఉంది. దీనికి ఆధారాలు వెతికినప్పుడు నర్సింహారెడ్డి మనవడి కేసు గురించి తెలిసింది.

1925లో నరసింహారెడ్డి కూతురు వద్ద ఉన్నబంగారు సూసకాన్నీ (పెళ్లి కూతురు తలపై అలకరించే బంగారు బిళ్ళ ) ఒకరు దొంగిలించగా ఆవిడ ఐదుగురు కుమారులు అతన్ని హత్య చేశారు.ఈ హత్య మీద పోలీస్ కేసు నడిచింది.కుంఫిణీ ప్రభుత్వం నరసింహా రెడ్డి ఐదుగురు మనవళ్ళలో నలుగురికి ఉరిశిక్ష విధించి అందరికంటే చిన్నవాడైన బాలుడికి దీపాంతర వాసా శిక్ష విధించింది.

1947లో స్వాతంత్రం వొచ్చిన తరువాత భారత ప్రభుత్వం ఆ బాలుడి శిక్షను రద్దుచేసి స్చేచ్ఛను ప్రసాదించింది. జైలు నుంచి విడుదలైన బాలుడికి మేనమాలతో ఆస్తి తగవు వొచ్చింది. నరసింహారెడ్డి ద్వారా సంక్రమించిన 300 ఎకరాల పొలాన్ని ఆ బాలుడి మేనమామల అనుభవంలో ఉంది. అప్పట్లో దీపాంతరవాస శిక్ష అంటే శవం కూడా వెనక్కి రాదనీ నమ్మకం.స్వాతంత్రం వలన స్చేచ్ఛ పొందిన బాలుడు తమ 300 ఎకరాల ఆస్తిని వెనక్కి ఇవ్వమని మేనమామలను అడగ్గా వారు నీకు పెళ్లిచేసి కొంత భూమిని ఇచ్చి నీ బాగోగులు చూసుకుంటాం అని చెప్పారు. దానికి అంగీకరించని బాలుడు మొత్తం ఆస్తి కావాలని మేనమామాలతో గొడవ పడ్డాడు.

ఈ విషయాల వలన మనకు నరసింహారెడ్డికి వందల ఎకరాల భూమి ఉండేది, ఆయన పింఛన్ మీద ఆధారపడి బతకలేదు. ఫించన్ అనేది కేవలం కుంఫిణీ ప్రభుత్వం నుంచి జాగీర్దారుడి గుర్తింపు కోసమే అని గమనించాలి.

-శివ రాచ‌ర్ల వాల్ నుండి సేక‌ర‌ణ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here