మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహరెడ్డి విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా వస్తున్న రెండో చిత్రం ఇది.
ఈ సినిమాలో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి ఎదురుకాబోతోంది. తొలిసారిగా అన్నయ్య సినిమాలో తమ్ముడి వాయిస్ వినబోతున్నారు. జనసేన అధ్యక్షుడిగా పూర్తిస్థాయి రాజకీయాలతో ఇటీవల సినిమాలకు దూరమయిన పవన్ కళ్యాణ్ స్వరం మరోసారి వినే అవకాశం ఈ సినిమా ద్వారా కలగబోతోంది. బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన సమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి వెండి తెర రూపం ఈ చిత్రం. ఈ చారిత్రక వీరుడి ఘనతను పరిచయం చేసే వాక్యాలు పవన్ కల్యాణ్ గళం నుంచి వినబోతున్నాం.
అన్నయ్య, తమ్ముడు కలిసి వెండి తెరపై కొద్ది క్షణాలపాటు కనిపించిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్. చిత్రాన్ని ప్రేక్షకులు మరచిపోలేదు. ఇప్పుడు అన్నయ్య నటించిన 151వ చిత్రానికి తమ్ముడు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పడం ప్రేక్షక లోకాన్ని కథలోకి తీసుకువెళ్తుంది.