జ‌గ‌న్ చుట్టూ ఉచ్చు, గ‌ట్టెక్కేనా?

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో ఎన్న‌డూ లేని సందిగ్ధం క‌నిపిస్తోంది. బంప‌ర్ మెజార్టీ సాధించిన పార్టీ చ‌రిత్ర సృష్టించి పాల‌నాప‌గ్గాలు చేప‌ట్ట‌గా, విప‌క్షాలు మ‌త్రం ఉనికి కోసం పాట్లు ప‌డుతున్నాయి. ఒక్క సీటులో కూడా డిపాజిట్ రాని బీజేపీ అత్యాశ‌కు పోతుంటే, దానికి వంత పాడేందుకు ఒక్క సీటు గెలిచిన జ‌న‌సేన సిద్ధం అంటోంది. 23 మందిని గెలిపించుకున్నా ఇప్ప‌టికే ఒక్క‌రు రాజీనామా చేయ‌డంతో 22 మందితో మిగిలిన మాజీ పాల‌క‌ప‌క్షం ముప్పుతిప్ప‌లు ప‌డుతూ మ‌ళ్లీ పాత‌మిత్రులం ఒక్క‌ట‌వుతామ‌నే సంకేతాలు ఇస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఏపీలో కుల చిచ్చు రాజుకుంద‌ని , ఒక సామాజిక‌వ‌ర్గాన్ని జ‌గ‌న్ టార్గెల్ చేశార‌ని క‌థ‌నాలు రాస్తూ ఓ వ‌ర్గం మీడియా కులం చుట్టూ క‌థ‌లు అల్లుతోంది. అదే స‌మ‌యంలో ఏపీలో మ‌తం మంట‌లు రాజేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనికి బీజేపీ స‌ర్వ‌వేళ‌లా త‌న‌కు తెలిసిన ఏకైక అస్త్రంతో సిద్ధంగా ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ప్ర‌త్యేక హోదా లాంటి రాష్ట్రాభివృద్ధికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు గానీ, నిధుల కేటాయింపులో మ‌రింత ఉదారంగా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా ఏపీ వాసుల మ‌న‌సులు గెలుచుకోవాల‌నే ఆశ బీజేపీలో లేదు. దాంతో కులం, మ‌తం ఆధారంగా బలం పెంచుకోవాల‌ని కుతూహ‌లంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల సీఎస్ బ‌దిలీ విష‌యంలో బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ దానికో ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. దానికి కొన‌సాగింపుగా టీడీపీ అధినేత‌కు స‌న్నిహితుడిగా మెలిగిన క్రైస్త‌వ మ‌త్త‌య్య సీఎస్ బ‌దిలీపై సంబ‌రాలు చేసుకుని, వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో మ‌రిన్ని అపోహ‌లు పెంచ‌డానికి దోహ‌దం చేసింది. ఆయ‌న కేక్ క‌ట్ చేసుకోవ‌డం వెనుక అస‌లు కార‌కులు ఎవ‌ర‌న్నది మ‌త్త‌య్య చ‌రిత్ర తెలిసిన అంద‌రికీ అర్థం అవుతోంది. కానీ ఎవ‌రో క్రైస్త‌వులు చేశార‌న్న‌ట్టుగా చెప్ప‌డానికి పెద్ద ప్ర‌య‌త్న‌మే జ‌రిగింది. వాటికి వంత‌పాడుతూ జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద కులం కోణంలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా గుంటూరులో ఓ వార్డు స‌చివాల‌యంలో క్రైస్త‌వ ప్రార్థ‌న‌లు జ‌రిగాయంటూ ప్ర‌చారం హోరెత్తింది. కానీ తీరా చూస్తే ఫ‌స్ట్ ఫ్లోర్ లో వార్డ్ స‌చివాల‌యం మూత‌వేసి ఉండ‌గా, గ్రౌండ్ ఫ్లోర్ లో క‌మ్యూనిటీ హాల్ అద్దెకు తీసుకుని ఓ బ‌ర్త్ డే పార్టీ సంద‌ర్భంలో చేసిన ప్రార్థ‌న‌ల‌ను ప్ర‌జ‌ల్లో ప్ర‌చారానికి పెట్ట‌డం ద్వారా ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసే కుట్ర సాగిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

త‌ద్వారా జ‌గ‌న్ మ‌తం చుట్టూ మంట‌లు రాజేసి, మెజార్టీ మెప్పు పొందాల‌నే కుయ‌త్నాల్లో విప‌క్షాలున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఈ మూడు పార్టీలు క‌లిసి సాగిస్తున్న ఈ మ‌హాన్నాట‌కం చివ‌ర‌కు ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. ప్ర‌జ‌ల్లో కులం, మ‌తం అనే సెంటిమెంట్లు ఏపీ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌వే త‌ప్ప పూర్తిగా నిర్ధేశించే అవ‌కాశాలు ఇప్ప‌టి వ‌ర‌కూ లేవు. కాబ‌ట్టి రాబోయే కాలంలో వాటిని ఎదుర్కోవ‌డంలో జ‌గ‌న్ ఏమేర‌కు విజ‌య‌వంతం అవుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here