జ‌గ‌న్ వ‌న్ మ్యాన్ షో: వ‌ర్క‌వుట్ అవుతుందా..?

0

రాజ‌కీయాల్లో ప్రాంతీయ పార్టీల అధినేత‌కు దాదాపుగా తిరుగుండ‌దు. ముఖ్యంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుల‌కు ఉండే ప‌ట్టు అంతా ఇంతా కాదు. గ‌తంలో ఎన్టీఆర్, ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ ని చూస్తే ఈ విష‌యం బోధ‌ప‌డుతుంది. ఎన్టీఆర్ స్వ‌యంకృతాప‌రాధంతో పెత్త‌నం చంద్ర‌బాబుకి అప్ప‌గించ‌డం ద్వారా చివ‌ర‌కు త‌న పీఠం మీద‌కు తెచ్చుకున్నారు గానీ అంత‌వ‌ర‌కూ ఆయ‌న మాటే వేద‌వాక్కుగా సాగింది. ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే రీతిలో పెత్త‌నం చెలాయిస్తున్నారు.

ప్ర‌స్తుతం మారిన సామాజిక ప‌ర‌స్థితుల నేప‌థ్యంలో వ‌న్ మ్యాన్ షో ఏమేర‌కు వ‌ర్క‌వుట‌వుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. తాజా రాజ‌కీయాల్లో జ‌గ‌న్ కి దాదాపుగా ఎదురులేకుండా ఉంది. కానీ ఎల్ల‌వేళలా ఇదే ప‌రిస్థితి కొన‌సాగ‌ద‌న్న‌ది సుస్ప‌ష్టం. అందుకు త‌గ్గ‌ట్టుగా త‌గిన టీమ్ ని ఎంపిక చేసుకోవాల్సిన జ‌గ‌న్ కి క్యాబినెట్ మంత్రులు కూడా స‌మ‌ర్థ‌వంతంగా లేర‌నే అభిప్రాయం వినిపిస్తోంది. కీల‌క స‌మ‌యాల్లో సామ‌ర్థ్యం బ‌య‌ట‌పెట్టుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ అనేక మంది మంత్రులు ఇప్ప‌టికే త‌మ శాఖ‌ల్లో కూడా ప‌ట్టు సాధించ‌లేక‌పోతున్నారు.

పైగా అన్ని శాఖ‌ల స‌మీక్ష‌ల‌ను సీఎం నిర్వ‌హిస్తుండ‌డంతో త‌మ‌కు పెద్ద‌గా ఛాన్స్ ద‌క్క‌డం లేద‌నే అభిప్రాయం ప‌లువురు నేత‌ల్లో క‌నిపిస్తోంది. సీనియ‌ర్ మంత్రులు కొంత అసంతృప్తిగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతానికి దానిని బ‌య‌ట‌ప‌డ‌కుండా చూసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో స‌ల‌హాదారులుగా నియ‌మించుకున్న అధికారులు కూడా సీఎం తీరుతో కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. విప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ కి, ఇప్ప‌టికీ పొంత‌నే లేద‌ని ఓ సీనియ‌ర్ అధికారి చేసిన కామెంట్ ప‌లు క‌థ‌నాల‌కు ఆస్కారం ఇచ్చింది.

ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన త‌ర్వాత పార్టీ స‌మావేశాల‌కు కూడా జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నివ్వ‌డం లేదు. కానీ పార్టీ పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌మావేశం కూడా పిలిచిన దాఖ‌లాలు లేవు. అంతా తానై అన్న‌ట్టుగా వ‌న్ మాన్ షో కొన‌సాగిస్తున్నారు. దాంతో ఆయ‌న తీరు ఫ‌లిత‌మిస్తుందా లేదా అన్న‌ది ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌క‌మే. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి ప్రాధాన్య‌త‌నివ్వ‌డం లేద‌ని ప‌లువురు భావిస్తున్న త‌రుణంలో శ్రీకాకుళం టూర్ తో ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. కనీసం వారానికి రెండు మూడు జిల్లాల్లో ఇదే రీతిలో ప‌ర్య‌ట‌నలు సాగిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం ఉంది. అదే స‌మ‌యంలో ర‌చ్చ‌బండ‌, క్యాంపు ఆఫీసులో విన‌తిప‌త్రాల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుడితే మ‌రింత మెరుగ్గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. అన్నింటిక‌న్నా ముందు పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ ఎక్కువ మందిని భాగ‌స్వాముల‌ను చేసే రీతిలో తీరు, పాల‌నా ఉంటే మ‌రింత ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని స‌న్నిహితులు సైతం భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here