టీడీపీ నుంచి వరుసగా..

0

చంద్రబాబు సన్నిహితులు, సొంత సామాజికవర్గానికే చెందిన ఎంపీలు పార్టీ మారిన తర్వాత తామెందుకు సైకిల్ సవారీ చేయాలని అనుకుంటున్నారే ఏమో గానీ పలువురు టీడీపీ నేతలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు క్లారిటీ ఇచ్చేశారు. వారిలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నట్టు తేల్చి చెప్పేశారు. ఆయనకు తోడుగా మరో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా బీజేపీ బాటలో ఉన్నారు. గంటా సన్నిహితుడైన పంచకర్ల వరుసగా రెండు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి, మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి పరాజయం పాలయిన వరుపుల రాజా కూడా టీడీపీకి రాజీనామా చేశారు. మొన్నటి వరకూ డీసీసీబీ చైర్మన్ గానూ, ఆప్కాబ్ డిప్యూటీ చైర్మన్ గానూ రాజా పనిచేశారు. ఆయన కూడా వైసీపీ కాదంటే బీజేపీ గుమ్మం ఎక్కక తప్పదు. ఆ వెంటనే మరో సీనియర్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ముహూర్తం పెట్టేసుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో పంచకర్ల, వరుపుల రాజా వంటి వారు అనేక మంది కాపు నేతలతో సమావేశం నిర్వహించిన తోట త్రిమూర్తులుని చంద్రబాబు పిలిచి బుజ్జగించారు. దాంతో వారంతా గోడ దూకడానికి పునరాలోచన చేసినట్టు భావించారు. కానీ ఆలశ్యం అంత ప్రయోజనం కాదని భావిస్తున్న కాపు నేతలంతా కండువాలు మార్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు తాజా సమాచారం.

అడారి ఆనంద్ , అడారి రూపకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్

జ్యోతుల నెహ్రూ, బోండా ఉమా వంటి వారు కూడా బీజేపీలో చేరేందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారనే కథనాలు వస్తున్నాయి. వైసీపీ లో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వీరంతా చివరకి అక్కడ ఛాన్స్ దక్కకపోతే బీజేపీలో చేరడం అనివార్యంగా కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు కూడా వీరందరి నిర్ణయం తర్వాత తన భవితవ్యంపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నట్టు సమాచారం.

అదే సమయంలో అనకాపల్లికి చెందిన అడారి ఆనంద్ సహా పలువురు నేతలు వైసీపీ కండువాలు కప్పుకుంటున్న సమయంలో టీడీపీ తలనొప్పులు తీవ్రం అవుతున్నాయి. వరుసగా పలువురు నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో తెలుగుదేశం భవితవ్యం మరింత గందరగోళ పడే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఆగష్ట్ లో ఎటువంటి సంక్షోభం లేనప్పటికీ దసరా తర్వాత ఈ దూకుడు వ్యవహారాలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున తెలుగుదేశం త్వరగా ఖాళీ అయ్యే ప్రమాదం లేకపోలేదని భావిస్తున్నారు. కేవలం కాపు నేతలే కాకుండా రాయపాటి, ప్రత్తిపాటి సహా అనేక మంది చంద్రబాబు సొంత సామాజికవర్గ నేతలు కూడా బీజేపీ మీద గంపెడాశతో ఉన్న తరుణంలో చివరకు టీడీపీ ఏమవుతుందోననే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here