కొత్త క్యాబినెట్ లో పాత మొఖాలు

  0

  కేసీఆర్ మనసు మార్చుకున్నారు. దాదాపు సంవత్సరకాలం పాటు పక్కన పెట్టిన నేతలనే మళ్లీ పిలిచి ఛాన్స్ ఇస్తున్నారు. ఇన్నాళ్లుగా ప్రభుత్వ పనితీరు ప్రజలను త్రుప్తి పరచలేకపోయిందని అంచనాకు వచ్చిన ఆయన మరోసారి బావ బావమరుదులను ఆశ్రయిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ తో పాటు హరీష్ రావుకి కూడా అవకాశం ఇవ్వడం విశేషంగా మారింది. అసలు కేసీఆర్ ఏమి ఆశించి వారిని పక్కన పెట్టారు..ఎందుకు మళ్లీ క్యాబినెట్ లోకి తీసుకుంటున్నారన్నది అర్థంకాని విషయంగా మారింది.

  ప్రభుత్వ వ్యవహారాలను మళ్లీ గాడిలో పెట్టాలంటే ఆ ఇద్దరు అత్యవసరమనే అంచనాకు కేసీఆర్ వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కీలక శాఖలు వారికి కేటాయించేందుకు సంసిద్ధమయినట్టు చెబుతున్నారు. హరీష్ కి ఆర్థికం అప్పగించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. కేటీఆర్ మాత్రం ఐటీ, గ్రామీణాభివ్రుద్ధిని కొనసాగించబోతున్నారు.

  ఇప్పటికే జాబితా రాజ్ భవన్ కి చేరింది. తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన లో భాగంగా సీఎం కేసీఆర్ కేబినెట్‌లో ఆరుగురు కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆరుగురు మంత్రుల పేర్లను ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్‌భవన్‌కు పంపించినట్లు తెలుస్తోంది. అందులో కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఆరుగురు కొత్త మంత్రులతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

  మహిళా మంత్రి విషయంలో కూడా కేసీఆర్ ఎట్టకేలకు చోటు కల్పించడం విశేషంగా కనిపిస్తోంది. అందులో భాగంగా పలువురు పోటీ పడినప్పటికీ ఎస్టీ మహిళా కోటాలో సత్యవతి రాథోడ్ కి ఛాన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. వైెఎస్ క్యాబినెట్ లో కీలక శాఖలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఒక మహిళా మంత్రికి చోటు ఖాయం అని చెప్పవచ్చు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here