2.5 కిలోమీట‌ర్ల లాంగ్ మార్చ్! ముందుకు సాగేనా?

0

ఏపీలో ఇసుక దుమారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు దీన్ని ప్ర‌ధాన అస్త్రంగా మ‌ల‌చుకుంటున్నాయి. ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌ప‌ట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. వ‌రుస‌గా భ‌వ‌న నిర్మాణ కార్మికుల మ‌ర‌ణాలు అందుకు దోహ‌దం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ మార్చ్ రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

గ‌తంలో ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ పై క‌వాతు పేరుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌కు మంచి ప‌ట్టున్న‌ట్టుగా క‌నిపించిన గోదావ‌రి జిల్లాల ప‌రిధిలో జ‌రిగిన కార్య‌క్ర‌మం కావ‌డంతో అప్ప‌ట్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. పెద్ద సంఖ్య‌లో జ‌న‌సైనికులు క‌దిలి వ‌చ్చారు. బ్యారేజ్ మొత్తం కిక్కిరిసిపోవ‌డంతో చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌వాతు ముందుకు సాగ‌లేదు. కారు దిగి రెండ‌డుగులు వేసిన త‌ర్వాత అభిమానుల తాకిడి, సెక్యూరిటీ ఒత్తిడితో ఆయ‌న క‌వాతు ప్ర‌య‌త్నం విర‌మించుకోవాల్సి వ‌చ్చింది. కేవ‌లం కారుపై ఆయ‌న ముందుకు సాగుతూ చివ‌ర‌కు బ‌హిరంగ‌స‌భ‌లో ఉప‌న్యాసం ఇచ్చారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ మార్చ్ సాగించ‌బోతున్న రూట్ మ్యాప్, విశాఖ న‌గ‌రంలోని మ‌ద్దెల‌పాలెం జంక్ష‌న్ నుంచి ఆశీల్ మెట్ట మీదుగా జీవీఎంసీ ముందున్న గాంధీ విగ్ర‌హం వ‌ర‌కూ..

అంత‌కుముందు విజ‌య‌వాడ‌లో ఆయ‌న కాలిన‌డ‌క‌న సాగించిన కార్య‌క్ర‌మం కూడా అనేక ఆటంకాల మ‌ధ్య సాగింది. కానీ ఇప్పుడు విశాఖ‌లో 2.5 కిలోమీట‌ర్ల మేర మ‌ద్దెల‌పాలెం జంక్ష‌న్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్ర‌హం వ‌ర‌కూ లాంగ్ మార్చ్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అది సాధ్య‌మా అనే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందున్న ప‌రిస్థితి ఇప్పుడు లేక‌పోయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఫ్యాన్స్ తాకిడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆయ‌న అభిమానుల మ‌ధ్య‌లో న‌డిచి వెళ్ల‌డం అంటే చాలా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

ఈ విష‌యం ఇప్ప‌టికే అనేక‌మార్లు రుజువయ్యింది. దాంతో విశాఖ లాంగ్ మార్చ్ లో కూడా అలాంటి జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే మ‌ళ్ళీ ఆయ‌న అడుగులు మ‌ధ్య‌లోనే ముగించాల్సి ఉంటుంది. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే. ఎంత సెక్యూరిటీ పెట్టినా అభిమానుల వీరావేశం అందుకు స‌హ‌క‌రిస్తుందా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here