చిరంజీవిని న‌మ్ముకున్న గంటాని గ‌ట్టెక్కిస్తారా?

0

ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ప్ర‌స్తుతం సందిగ్ధంలో ఉన్నారు. రాజ‌కీయంగా ఆయ‌న భవిత‌వ్యం గంద‌ర‌గోళంగా క‌నిపిస్తోంది. ఎటు అడుగులు వేయాల‌న్న దానిపై ఆయ‌న ఊగిస‌లాట‌లో ఉన్నారు. క‌మ‌ల‌నాధుల‌తో ట‌చ్ లో ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ గూటికి వెళ్ల‌డానికి ఆయ‌న సంశ‌యిస్తున్నారు. ఏపీలో ఆపార్టీ బ‌లం పుంజుకునే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉండ‌డంతో గంటా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. అంతేగాకుండా త‌న‌తో పాటుగా మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు వ‌స్తార‌ని ఆశిస్తే బీజేపీలోకి వాళ్లంతా నిరాక‌రించ‌డం కూడా గంటా వెనుకంజ‌వేయ‌డానికి కార‌ణంగా క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో వైసీపీ శిబిరంలో ఆయ‌న మంత‌నాలు న‌డిపారు. కానీ జ‌గ‌న్ మాత్రం ప‌చ్చ‌జెండా ఊప‌డానికి సిద్ధంగా క‌నిపించ‌డం లేదు. రాజీనామా చేసి రావాల‌నే కండిష‌న్ తో పాటుగా ఇత‌ర అనేక ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని చెప్ప‌డంతో గంటాకి దిక్కుతోచ‌డం లేదు. దాంతో అటు టీడీపీలో కొన‌సాగ‌లేక‌, ఇటు ఏపార్టీలోకి దూక‌డానికి ప‌రిస్థితులు అనుకూలంగా లేక తొలిసారిగా గంటా ప‌రిస్థితి అయోమ‌యంలో ప‌డింది.

విశాఖ రాజ‌కీయాల్లో ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా గ‌డిచిన ఏడేళ్లుగా సాగిన గంటాకి మొట్ట‌మొద‌టిసారిగా ఈ ప‌రిణామాలు మింగుడుప‌డ‌డం లేదు. దాంతో త‌న మాజీ బాస్, చిర‌కాల స్నేహితుడు చిరంజీవి మీద న‌మ్మ‌కంతో గంటా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా తాడేప‌ల్లిగూడెంలో ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కోసం విజ‌య‌వాడ చేరుకున్న చిరంజీవి వెంట గంటా ఉన్నారు. ఆయ‌నకు తోడుగా ఈ ప‌ర్య‌ట‌న ఆద్యంతం కొన‌సాగారు. చిరంజీవితో త‌న‌కున్న సాన్నిహిత్యాన్ని చాటుకోవ‌డానికి గంటా శ్రీనివాస‌రావు ఈ ప‌ర్య‌ట‌న‌ను ఉప‌యోగించుకున్న‌ట్టుగా కొంద‌రు భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో త‌న రాజ‌కీయ భ‌విత విష‌యంలో స‌హ‌కారం అవ‌స‌రం అవుతుంద‌నే అంచ‌నాలో గంటా ఉన్నట్టు స్ప‌ష్టం అవుతోంది. మ‌రి సైరా స‌క్సెస్ తో ఉన్న చిరంజీవి త‌న మిత్రుడు పొలిటిక‌ల్ లైఫ్ ని స‌క్సెస్ చేయ‌గ‌ల‌రో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here